కడప అర్బన్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు ప్రేమించాడు.. ఇప్పుడు నిరాకరించడంతో యువతి అతని ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. ఈ ఘటన కడప నగరంలోని రామకృష్ణ నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. బాధిత యువతి అనూష కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గత ఐదేళ్లుగా తాను, విజయ్ పరస్పరం ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సన్నిహితంగా మెలిగాడని ఆమె తెలిపింది.
ఇప్పుడు పెళ్లి విషయాన్ని ప్రస్తావించగానే విజయ్ ముఖం చాటేస్తూ తప్పించుకుంటున్నాడని ఆరోపించింది. అతనికి వారి తల్లిదండ్రులు వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగినప్పటికీ తనను ప్రేమించిన యువకుడు విజయ్ వైఖరిలో మార్పు రాలేదని వాపోయింది. దీంతో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నేరుగా ప్రియుడి ఇంటి ముందు కూర్చొని నిరసన చేపట్టింది.
దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారం అందుకున్న బ్లూ కోల్ట్స్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువతితో మాట్లాడారు. సమస్యపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ ఘటనపై రిమ్స్ పోలీస్ స్టేషన్ సీఐ రాజగోపాల్‌ను వివరణ కోరగా.. ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. బాధిత యువతి పోలీస్‌స్టేషన్‌కు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని వివరించారు.


