
సాక్షి, విశాఖపట్నం: మరోసారి విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో చిక్కుకుంది. ఇద్దరు ఖైదీలు రాసిన లేఖ వైరల్ అవుతోంది. విశాఖ సెంట్రల్ జైల్ అధికారులపై ఖైదీల తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు సుపరింటెండెంట్ మహేశ్ బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్ సాయి ప్రవీణ్ వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఓ కిడ్నాప్ కేసులో నిందితుడైన ఉలవల రాజేశ్, మరో ఖైదీ మీర్జాఖాన్ మీడియాకి లేఖ రాశారు.
రౌడీషీటర్ ఉలవల రాజేశ్ లేఖలో సంచలన అంశాలు వెల్లడించాడు. రిమాండ్‌లో తాను మొబైల్స్ వినియోగించకపోయినా సరే తనపై కుట్ర పన్నారు అంటూ లేఖలో పేర్కొన్నాడు. ‘‘సెల్ ఫోన్ సిగ్నల్ వచ్చే బ్లాక్ వద్ద నన్ను బంధించి మొబైల్ వినియోగించినట్లు నాపై తప్పుడు సాక్షాలు సృష్టించారు. జైలు అధికారుల దాష్టీకాలపై 18-3-2025న కోర్టు వాయిదాకు వచ్చినపుడు జైలు అధికారులపై జడ్జికి ఫిర్యాదు చేశాను. జడ్జి దృష్టికి ఈ వ్యవహారాలను తీసుకు వెళ్తున్నానంటూ కక్ష కట్టి నన్ను వేధిస్తున్నారు’’ అంటూ లేఖలో పేర్కొన్నాడు.
‘‘తోటి ఖైదీల వలె కాకుండా నన్ను లాకప్ నుంచి అస్సలు బయటకు రాకుండా సూపరింటెండెంట్ లోపలే బంధిస్తున్నారు. అందరు ఖైదీల్లాగా ఉదయం నుంచి నన్ను బయటకు పంపడం లేదు. జడ్జికి ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుక్కోవాలని వేధిస్తున్నారు. లేకుంటే జైల్లో ఇలానే హింస తప్పదని సూపరింటెండెంట్ బెదిరిస్తున్నారు. జైల్లో మాకు చట్టప్రకారం ఇవ్వాల్సిన ఆహారాన్ని కూడా ఇవ్వడం లేదు. జైలు క్యాంటీన్‌ల్లో అనేక అవకతవకలకు పాల్పడుతూ దోపిడీ చేస్తున్నారు. జరుగుతున్న అవకతవకలపై అధికారులను నిలదీస్తే, గంజాయి వాడుతున్నారని తప్పడు కేసులు పెటడతామంటూ నాగన్న అనే మరో ముద్దాయిని బెదిరిస్తున్నారు. జైల్లో మేము పడుతున్న బాధలను బయటకు తెలియాలనే ఈ లేఖ రాస్తున్నాం’’ అంటూ రాజేశ్, మీర్జాఖాన్ చెప్పుకొచ్చారు.