మద్యం మత్తులో యువకుల ఘర్షణ | Viral Video Guntur Men Hang And Assault Person Near Wine Shop | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో యువకుల ఘర్షణ

Apr 20 2026 11:16 AM | Updated on Apr 20 2026 11:43 AM

Viral Video Guntur Men Hang And Assault Person Near Wine Shop

గుంటూరు: గుంటూరు వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కంకరగుంట బ్రిడ్జి వద్ద ఓ వైన్‌ షాపు భవనం పైనుంచి వేలాడదీసి ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి పై దాడి చేసిన ఘటన ఆదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో అప్రమత్తమైన నగరంపాలెం సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ ప్రసన్న సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆకులవారితోట ప్రాంతానికి చెందిన దేవరకొండ స్వరూప్, శ్రీనివాసరావు తోట ప్రాంతానికి చెందిన దేవరకొండ శశికుమార్‌ సోదరులు. వీరు మద్యం తాగేందుకు కొమ్మినేని రత్తయ్యకు చెందిన నిర్మల్‌ వైన్‌ షాపు వద్దకు వచ్చారు. మద్యం తాగుతున్న సమయంలో అదే వైన్‌షాపులో ఉన్న మరో వ్యక్తితో వాగ్వవాదం చోటుచేసుకుంది. దీంతో సోదరులిద్దరు ఆ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మద్యం మత్తులో ఆ వ్యక్తిని వైన్‌ షాపు భవనం పై నుంచి కిందకు వేలాడ తీసి తీవ్రంగా దాడి చేశారు. 

ఇది గమనించి వాహనదారులు సెల్‌ఫోన్‌లో వీడియాలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కొద్ది సేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇద్దరు సోదరులను వైన్‌షాపు నిర్వాహకులు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు ఘటనా స్థలి చేరుకుని ఇద్దరు సోదరులను అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బల్లి రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వ్యక్తి ఇద్దరు సోదరుల దాడికి భయపడి పారిపోవడంతో గాయపడిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని విచారించి ఇద్దరు సోదరులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ సత్యనారాయణ వెల్లడించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement