ఐరాస దృష్టికి సచివాలయ సేవలు

Village And Ward Secretariat services to the UN focus - Sakshi

సహకారం అందించేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్య సమితి

నేడు సంస్థ ప్రతినిధులతో చర్చలు

రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి పెంచడమే లక్ష్యం

నేటినుంచి ‘సచివాలయ’ ఉద్యోగులకు శిక్షణ  

సాక్షి,  అమరావతి: పక్షపాతం, మధ్యవర్తుల ప్రమేయం, అవినీతికి తావులేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను అట్టడుగు స్థాయిలో ప్రజలందరికీ సమానంగా అందజేయాలన్న లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఐక్యరాజ్య సమితి(ఐరాస) దృష్టిని ఆకర్షించింది. సచివాలయ సేవలకు సహకారం అందించేందుకు ఐరాస అనుబంధ విభాగాలు ముందుకొచ్చాయి. దీనిపై సోమవారం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. 

నేటి నుంచి శిక్షణా కార్యక్రమాలు 
► సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రభుత్వం మరో విడత శాఖాపరమైన శిక్షణ నిర్వహించనుంది. సచివాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 94,379 మందికి.. వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 22,091 మందికి విధి నిర్వహణలో వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.  
► వార్డు సచివాలయాల్లో పనిచేసే ప్రతి 30 మందిని ఒక బ్యాచ్‌గా ఏర్పాటు చేసి వారు పనిచేసే ప్రాంతంలో ప్రత్యక్షంగా, గ్రామ సచివాలయాల్లో పనిచేసే వారికి ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ప్రతి శాఖకు సంబంధించి డిప్యూటీ డైరెక్టర్‌ లేదా ఆ పైస్థాయి అధికారితో ఆ శాఖ విధులపై శిక్షణ ఇస్తారు. 
► 6 నుంచి 12 రోజుల పాటు శిక్షణలో పాల్గొనాల్సి ఉంటుంది. శిక్షణ ముగిసిన తర్వాత ఆ రోజు శిక్షణకు సంబంధించి ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించి వారి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
► సెప్టెంబర్‌ 5 వరకు విడతల వారీగా శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయని గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌ తెలిపారు.  

సచివాలయాల్లో నేటి నుంచి డిజిటల్‌ లావాదేవీలు 
గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా కరెంట్‌ బిల్లులు చెల్లింపు వంటి పలు సేవలను నగదు రహితంగా నిర్వహించే వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో డిజిటల్‌ లావాదేవీలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో కుగ్రామాల్లో ఉండే సచివాలయాల్లో సైతం డిజిటల్‌ లావాదేవీలు అందుబాటులోకి వచ్చినట్టు అవుతుందని... దీని వల్ల మన రాష్ట్రంలో మరో సాంకేతిక విప్లవం వచ్చినట్టేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మొబైల్‌ ద్వారా అత్యంత సులభంగా, సురక్షితంగా, తక్షణమే చెల్లింపు ప్రక్రియ జరిపేలా ప్రతి సచివాలయానికి క్యూఆర్‌ కోడ్‌ను కేటాయించనున్నారు.  

► నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), కెనరా బ్యాంక్‌ల సహకారంతో సచివాలయాల్లో యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. 
► గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం 543 రకాల సేవలను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారులు ఇక నుంచి ఈ సేవలను అవసరమైతే డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.  
► సచివాలయాల్లో ప్రతి నగదు రహిత లావాదేవీ జరిగిన వెంటనే సంబంధిత వినియోగదారుడి మొబైల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top