ఏపీపై కేంద్రం సవతి ప్రేమ చూపించడం సరికాదు: ఎంపీ విజయసాయిరెడ్డి

Vijayasai Reddy Alleged Center Failed On Promises AP Bifurcation - Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీల అమల్లో కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. ఈ విషయంలో కేంద్రం సవతి ప్రేమను చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాజ్యసభలో అప్రాప్రియేషన్‌ బిల్లు 2022పై జరిగిన చర్చలో మాట్లాడారు ఎంపీ విజయసాయిరెడ్డి. పోలవరం ప్రాజెక్టు అమలు లోపభూయిష్టంగా ఉందన్నారు. 

‘ఏపీ విభజన హామీల అమల్లో కేంద్రం విఫలమైంది. అన్ని అవకాశాలు ఉన్నా కేంద్రం దృష్టి పెట్టడం లేదు. ఆస్తుల పంపకం కోసం సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు అమలు లోపభూయిష్టం. దీనికి యూపీఏ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. 2010-11 రేట్లతో 2022లో ప్రాజెక్ట్‌ కట్టమంటున్నారు. ఏ కాంట్రాక్టర్‌ ముందుకొస్తారు, నష్టాలు ఎవరు భరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం సవతి ప్రేమ చూపించడం సరికాదు’ అని ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.

పోలవరం పనుల సొమ్ము చెల్లింపుల్లో జాప్యం లేదు
పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ పనులకు వెచ్చిస్తున్న సొమ్మును కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్‌ తుడు పేర్కొన్నారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. 2014 ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ వరకు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం 15 వేల కోట్ల 970 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ మొత్తంలో ఆమోదయోగ్యమైనవిగా గుర్తించిన బిల్లులకు  13 వేల కోట్ల 226 కోట్ల రూపాయల చెల్లింపు జరిగిందన్నారు. 

పోలవరం ప్రాజెక్ట్‌ పనుల బిల్లులను పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తనిఖీ చేసి వాటి చెల్లింపుల కోసం సిఫార్సు చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని వివరించారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ ద్వారా నిధులు మంజూరు చేయాలని 2016 సెప్టెంబర్ 30న  ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అయితే ఆఫీసు మెమోరాండం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి  కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ కింద అయిన ఖర్చు మాత్రమే భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. ఆ ఖర్చును సమయానుసారం భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.

ఇథనాల్ స్టాకు పెంపు నిరంతర ప్రక్రియ
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం చేయవలసిన  ఆవశ్యకత దృష్ట్యా దేశవ్యాప్తంగా ఇథనాల్ నిల్వల సామర్ధ్యం పెంపు అనేది  ఒక నిరంతరం ప్రక్రియ అని  కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. 2020-21లో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ మిశ్రమం చేసినట్లు చెప్పారు. ఆయిల్ రిఫైనరీలు, టెర్మినల్స్, సప్లయర్ల వద్ద ఇథనాల్‌ను నిల్వ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఇథనాల్ నిల్వ చేసేందుకు అవసరమైన ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా ఏపీ.. ఆపరేషన్‌ పరివర్తన్‌ కూడా!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top