
గతంలో పొగాకు వ్యాపారం చేసి, మానేసిన యువకుడు
ఉచితంగా జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేస్తానంటే అపరిచిత వ్యక్తికి వివరాలు
ఆ జీఎస్టీ నంబర్‌తో రూ.140 కోట్ల మేర బంగారం వ్యాపారం
లాభాలు దోచేసి పరారైన నిందితుడు.. లబోదిబోమంటున్న బాధితుడు
కర్నూలు (హాస్పిటల్): అతను ఓ గ్రామీణ యువకుడు. జీవితంలో స్థిర పడాలని పొగాకు వ్యాపారం ప్రారంభించాడు. జీఎస్టీ నెంబర్ తీసుకుని ప్రభుత్వానికి పన్ను చెల్లించాడు. వ్యాపారం కలిసి రాక మధ్యలో ఆపేసి ఓ హోటల్‌లో పనికి కుదిరాడు. మూడేళ్ల తర్వాత రూ.4.60 కోట్లకు పైగా జీఎస్టీ చెల్లించాలని మెసేజ్ రావడంతో కంగుతిన్నాడు. దీనిపై విచారణ చేసిన జీఎస్టీ అధికారులు సైతం అతను మోసపోయిన విధానాన్ని చూసి నివ్వెరపోయారు.
ఏపీలోని నంద్యాల జిల్లా మిడుతూరు మండలం పైపాలెం గ్రామానికి చెందిన మల్లెం నవీన్‌కుమార్‌రెడ్డి 2017–18లో ఆర్యన్ ట్రేడర్స్ పేరిట పొగాకు వ్యాపారాన్ని ప్రారంభించాడు. మూడేళ్ల పాటు చేసిన రూ.30 లక్షల వ్యాపారానికి రూ.9 లక్షల జీఎస్టీని 2018–19 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాడు. ఆ తర్వాత 2019–20లో మరో రూ.7.5 లక్షలు, 2020–21లో రూ.1.25 లక్షలు జీఎస్టీ కట్టాడు. అనంతరం వ్యాపారం బాగోలేక మధ్యలో ఆపేసి హైదరాబాద్ వెళ్లి ఓ రెస్టారెంట్‌లో పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో కూడా అతను ప్రతి నెలా జీఎస్టీ రిటర్న్స్‌ను రెగ్యులర్‌గా దాఖలు చేస్తూ వచ్చాడు. ఇందుకోసం ఓ వ్యక్తికి రూ.300 నుంచి రూ.500 దాకా ఫీజు చెల్లించేవాడు. ఈ నేపథ్యంలో జీఎస్టీ రిటర్న్స్‌ను ఉచితంగా దాఖలు చేస్తామని ఓ గోడపై ఉన్న ప్రకటనకు ఆకర్షితుడై అందులో ఉన్న నితిన్ గుప్తా అనే వ్యక్తి నెంబర్‌కు ఫోన్ చేశాడు. అతడు నవీన్ రెగ్యులర్‌గా జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేసే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, మెయిల్, జీఎస్టీ నంబర్ తీసుకున్నాడు. కొద్ది కాలం పాటు నెలనెలా జీరో రిటర్న్స్ దాఖలు చేస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత అతని నుంచి నవీన్ కుమార్ రెడ్డికి ఫోన్ రాలేదు.
నువైనా కట్టు.. లేదా అతనితో కట్టించు
2023 జూలైలో వైజాగ్ నుంచి సెంట్రల్ జీఎస్టీ అధికారులు నవీన్ వద్దకు వచ్చారు. అతను చేస్తున్న ఉద్యోగాన్ని చూసి విస్తుపోయారు. మీ జీఎస్టీ నెంబర్‌తో రూ.140 కోట్లకు పైగా బంగారం వ్యాపారం చేశారని, అందుకు ఇప్పటి దాకా జీఎస్టీ చెల్లించలేదని చెప్పారు. తాను అలాంటి వ్యాపారమేదీ చేయలేదని నవీన్‌కుమార్ రెడ్డి వారికి వివరించాడు. తన వివరాలు ఎవరికిచ్చాడో చెబుతూ బ్యాంక్ స్టేట్‌మెంట్ చూపించి, జరిగిన విషయాన్ని తెలిపాడు. దీంతో నవీన్‌కుమార్ రెడ్డి మోసపోయాడని గ్రహించి, వారు అతనితో వాంగ్మూలం తీసుకుని వెళ్లిపోయారు.
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ జీఎస్టీ అధికారుల నుంచి పిలుపు వస్తే వెళ్లి కలిశాడు. ‘రూ.4.60 కోట్లకు పైగా జీఎస్టీని నీవైనా కట్టు.. లేదా నీ వివరాలు ఇచ్చిన వారితోనైనా కట్టించు’అని అధికారులు చెప్పి పంపించారు. జరిగిన మోసంపై ఫిర్యాదు చేయడానికి మిడుతూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ప్రస్తుతం పని చేసేది హైదరాబాద్‌లో కాబట్టి, అక్కడికి వెళ్లమని చెప్పారు. హైదరాబాదులో ఫిర్యాదు చేయడానికి వెళ్తే మీ చిరునామా మిడుతూరు కాబట్టి, అక్కడే ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఏమి చేయాలో పాలుపోక న్యాయ నిపుణుల సలహాతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితుడు సిద్ధమయ్యాడు.