
భారత ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ/విమానాశ్రయం(గన్నవరం)/భవానీపురం(విజయవాడపశ్చిమ)/వన్‌టౌన్(విజయవాడపశ్చిమ)/తిరుమల: ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ బుధవారం సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, దుర్గగుడి ఈవో శీనా నాయక్ స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పండితులు వేదాశీర్వచనం చేయగా, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో శీనా నాయక్ ఉపరాష్ట్రపతికి అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం దివ్యానుభూతి అని చెప్పారు.
రాష్ట్రం అభివృద్ధిపథంలో సాగాలని అమ్మవారిని ప్రారి్థంచినట్లు పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్, సతీమణి ఆర్.సుమతితో కలిసి తొలిసారి న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చారు. ఆయనకు గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
మహిళా శక్తిని గౌరవించడం మన సంప్రదాయం: సీపీ రాధాకృష్ణన్
మహిళా శక్తిని గౌరవించుకోవడం భారతీయ సంప్రదాయమని, అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా కొలవడం ద్వారా శక్తి, భక్తి రెండూ లభిస్తాయని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. విజయవాడ భవానీపురంలోని విజయవాడ ఉత్సవ్‌ను ఆయన బుధవారం సందర్శించారు. విజయవాడ ప్రత్యేకతపై మాట్లాడుతూ ‘విజయవాడ హాటెస్ట్ సిటీ..కూల్ పీపుల్’ అని అభివరి్ణంచారు. దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణలాంటిదన్నారు. సుందర తెనుంగు అంటూ పద్యాల్లో తెలుగును కొనియాడారు.
ఏపీలోని రైతులు గొప్ప కష్టజీవులని, వారందించే ఆహారం యావత్ దేశానికి అందుతుందన్నారు. త్వరలోనే వికసిత్ భారత్ అందులో వికసిత్ ఏపీని మనం చూస్తామన్నారు. ధైర్యం, విజయం, శక్తికి ప్రతీకలు దుర్గమ్మ తొమ్మిది అవతారాలు అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద మంత్రి షెకావత్‌ను నిర్వాహకులు సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గే‹Ù, ఎంపీ కేశినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు.
హిమ క్రీము.. భలే బాగు
విజయ డెయిరీ స్టాల్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి
ఐస్‌క్రీం రుచిగా ఉందని కితాబు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): విజయవాడ పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) స్టాల్‌ను బుధవారం ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ సందర్శించారు. స్టాల్‌కు వచ్చిన ఆయనకు విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు స్వాగతం పలికారు. కృష్ణా మిల్క్ యూనియన్ గురించి క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా విజయ డెయిరీ ఐస్‌క్రీమ్‌ను రుచి చూసి నాణ్యత, రుచిగా ఉందని ఉపరాష్ట్రపతి అభినందించారు.
ఘనంగా వీడ్కోలు
ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌కు బుధవారం గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఆయన తిరుపతి బయలుదేరి వెళ్లారు.
శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి
ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ బుధవారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వామివారి చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందజేశారు.