ప్రాణం తీసిన చలిమంట.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌తో..

Venkatachalam Bonfire Family Three injured Social Media Post - Sakshi

సాక్షి, నెల్లూరు(వెంకటాచలం): చలి కాచుకునేందుకు వేసిన మంట ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మంటలు అంటుకుని ఇద్దరు చిన్నపిల్లలు, కాపాడేందుకు వెళ్లిన తల్లి గాయపడ్డారు. రెండేళ్ల వయసున్న చిన్నకుమార్తె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ విషయం బుధవారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో బయట పడింది. అయితే పోలీసులు గోప్యంగా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని కంటేపల్లి గ్రామానికి చెందిన మానికల రవికృష్ణ పెయింట్‌ పని చేస్తుంటాడు.

అతడికి భార్య నాగభూషణమ్మ, కుమార్తెలు లహరిశ్రీ, శ్రీవర్ష (2) ఉన్నారు. ఈనెల 16వ తేదీన తెల్లవారుజామున నాగభూషణమ్మ థిన్నర్‌ వాడి ఇంటి ముందు చలిమంట వేసింది. కుమార్తెలు చలి కాచుకుంటుండగా ఆమె సమీపంలో ముగ్గు వేస్తోంది. రవికృష్ణ కూడా అక్కడ ఉన్నాడు. కాగా మంట ఆరిపోతుండడంతో లహరిశ్రీ థిన్నర్‌ పోసింది. దీంతో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున చెలరేగి లహరిశ్రీ, శ్రీవర్ష శరీరానికి అంటుకున్నాయి. తల్లి చూసి వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. రవికృష్ణ, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

108 సిబ్బంది ముగ్గురిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన పిల్లలను మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీవర్ష మంగళవారం సాయంత్రం మృతిచెందింది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే కొందరు వ్యక్తులు బాధిత గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టగా వైరలైంది. కాగా ఇది పెద్ద విషయం కాదన్నట్లుగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పత్రికలు, మీడియాకు తెలియజేసి ఉంటే బాధితులకు సాయం అందేదని చెబుతున్నారు. చలి కాచుకునేందుకు వేసిన మంట చిన్నారిని బలి తీసుకోవడం, మరో బాలిక, తల్లి గాయాలపాలవడంతో కంటేపల్లి గిరిజన కాలనీలో విషాదం నెలకొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top