నూతన విద్యా విధానంతో నవశకానికి నాంది

Venkaiah Naidu Comments On New education policy - Sakshi

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పెంపొందేలా వర్సిటీలు చొరవ చూపాలి

సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ వేడుకల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

అనంతపురం విద్య: నూతన జాతీయ విద్యా విధానం నవ శకానికి నాంది పలికిందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ ఏర్పడి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం అనంతపురంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్చువల్‌ విధానంలో ఉప రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పెంపొందేలా యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు పెంపొందా లన్నారు. వర్సిటీల్లో హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌లో విద్యను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పూర్తిస్థాయి క్యాంపస్‌ అందుబాటులో వస్తే ప్రపంచ స్థాయి ర్యాంకింగ్‌ జాబితాలో సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ ఏపీ చోటుదక్కించుకుంటుందన్న నమ్మకం తనకుందని  పేర్కొన్నారు. 2021–22 విద్యాసంవత్సరంలో ఎంటెక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్‌ సహా మరో ఐదు పీజీ ప్రోగ్రాంలు ప్రవేశపెట్టడం, పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలతో పాటు సహ పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

రాష్ట్రంలో విద్యా విప్లవం
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో విద్యా విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో 7 వర్సిటీలను అంతర్జాతీయ ప్రమాణాలు గల వర్సిటీలుగా మార్పు చెందేలా సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. కేంద్ర విద్యా మంత్రి (స్వతంత్ర) డాక్టర్‌ సుభాష్‌ సర్కార్‌ మాట్లాడుతూ.. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ పురోగతికి కట్టుబడి ఉన్నామన్నారు. శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామన్నారు.

అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీకి నిధులు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకమండలిని కూడా నియమించలేదని, శాశ్వత బోధన సిబ్బంది లేరని పేర్కొన్నారు. యూనివర్సిటీ వీసీ ఎస్‌ఏ కోరి, జేఎన్‌టీయూ (ఏ) వీసీ జింకా రంగజనార్దన, సెంట్రల్‌ యూనివర్సిటీ డీన్‌ జి.ఆంజనేయస్వామి, ఎస్వీ యూనివర్సిటీ మాజీ వీసీ వీవీఎన్‌ రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top