ఆంధ్రప్రదేశ్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. గన్నవరం మండలం దావాజీగూడెంలోని ఎస్‌వీఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ మండల స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గన్నవరం నియోజకవర్గంలో గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 30 వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిందని వంశీ గుర్తుచేశారు. అయితే, గత ఎన్నికలకు ముందు జగన్‌పై దుష్ప్రచారం చేశారని, భూములు లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం సాగించారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా గన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో 4,500 ఇళ్ల పట్టాలు నిలిచిపోయాయని తెలిపారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆ పట్టాలను పంపిణీ చేయలేదని విమర్శించారు.
పేద ప్రజల జీవన ప్రమాణాలను మార్చేందుకు ఎన్టీఆర్, వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారని వంశీ పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి కోసం ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు నిరంతరం పనిచేశారని అన్నారు. అలాగే, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా జగన్ ప్రజలకు సేవలందించారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అనేక కేసులు నమోదు చేశారని వంశీ ఆరోపించారు. దీంతో కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని విమర్శించారు. అయితే, ఇలాంటి బెదిరింపులకు భయపడకుండా వైఎస్సార్‌సీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
గ్రామాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతోందని వంశీ ఆరోపించారు. అలాగే, బడులు, గుళ్ల పక్కన కూడా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తే ప్రజలకు మరింత మంచి చేసే అవకాశం ఉంటుందని అన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని పేర్కొంటూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. దీంతో స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: ‘లోక్‌భవన్ ముట్టడి’పై పోలీసు ప్రతాపం


