
సాక్షి, విశాఖపట్నం: నెట్‌వర్క్, సాంకేతిక భాగస్వామ్యం బలోపేతం అవుతుండటంతో భారత్, అమెరికా దేశాల మధ్య రక్షణ సంబంధాలు భవిష్యత్‌లో మరింత ఉజ్వలంగా మారతాయని యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ జె పపారో వ్యాఖ్యానించారు. మిలాన్–2022 విన్యాసాల్లో భాగంగా విశాఖలో నిర్వహించిన మారిటైమ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భారత్, అమెరికా దళాలు నెట్‌వర్క్, సాంకేతికతలను ఇచ్చిపుచ్చుకోవడంలో పరస్పర సహకారాలు మెరుగు పర్చుకుంటున్నాయన్నారు. ఎంహెచ్–60 రోమియో చాపర్స్ వంటి అత్యాధునిక రక్షణ సాంకేతిక హెలికాప్టర్ల విషయంలోనూ బంధం బలోపేతమైందని తెలిపారు.
మిలాన్‌లో పాల్గొనడం వల్ల అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ మొదలైన క్వాడ్ దేశాల మధ్య మారిటైమ్ సహకారం మరింత దృఢంగా మారనుందన్నారు. ఈ కూటమిలో పొత్తులు ఒకదానికొకటి బాధ్యతలను కలిగి ఉంటాయనీ, క్వాడ్ దేశాలు పరస్పరం సహాయం చేసుకునేందుకు దేశాల భాగస్వామ్య విలువలు, కట్టుబాట్లను గమనిస్తున్నట్లు తెలిపారు.
మిలాన్‌లో వియత్నాం పాల్గొనడం స్ఫూర్తిదాయకమన్నారు. సముద్ర జలాల విషయంలో వియత్నాం తరచూ దురాక్రమణలకు గురవుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మిలన్‌లో పాల్గొనడం ద్వారా ఒక కూటమిని ఏర్పరుచుకోవడంతో పాటు కొన్ని పెద్ద దేశాల నుంచి ఎదుర్కొంటున్న బెదిరింపులను చిన్న దేశాలు సమర్థంగా తిప్పికొట్టేందుకు సహకారాలు పొందుతాయన్నారు.