
రైతులను ఆదుకోవడంలో అన్నింటా విఫలమైన కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలో అడుగంటిన యూరియా నిల్వలు
వెలవెలబోతోన్న రైతుసేవా కేంద్రాలు, ఎరువుల గోదాంలు
సకాలంలో ఎరువుల్లేక కర్షకులకు కష్టాలు
ఉన్న వాటిని టీడీపీ నేతలు అక్రమంగా తరలించే యత్నం
అడ్డుకుంటున్న అధికారులపై వాగ్వాదాలకు దిగుతున్న వైనం
ఆత్మహత్యలే శరణ్యమంటూ గగ్గోలు పెడుతున్న రైతన్నలు
సాక్షి, వీరఘట్టం, సరుబుజ్జిలి, నందికొట్కూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు ఆర్బీకేల ద్వారా ఎరువులు సకాలంలో అందేవి. నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించట్లేదు. కూటమి ప్రభుత్వంలో రైతులను ఎరువుల కష్టాలు వీడటం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రైతులకు యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఉన్న కొద్దిపాటి నిల్వలను సైతం పక్కదారి పట్టించేందుకు అధికారం అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు.
రైతులకు పంపిణీ చేసే యూరియా కూడా తమకే కావాలంటూ దౌర్జన్యం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలంలోని కిమ్మి రైతు సేవా కేంద్రానికి బుధవారం 440 బస్తాల యూరియా వచ్చింది. ఇదే ఆర్‌ఎస్‌కే పరిధిలో ఉన్న కొట్టుగమ్మడకి చెందిన ఉదయ్ అనే టీడీపీ నాయకుడు తన అనుచరులతో ఆర్‌ఎస్‌కేకు వచ్చి 200 బస్తాల యూరియాను దౌర్జన్యంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. గోదాంలో ఉన్న యూరియాను రెండు ట్రాక్టర్లలో లోడ్ చేసి తరలించేందుకు పన్నాగం పన్నాడు.
విషయాన్ని గమనించిన గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యూరియా తరలింపును అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం లారీతో వచ్చిన యూరియాను ఆర్‌ఎస్‌కే గోదాంలో అన్‌లోడ్ చేసి, స్టాక్ వివరాలను రికార్డుల్లో నమోదు చేసి, ఆ తర్వాత రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది.
ఈ నిబంధనలను పక్కన పెట్టి, వచ్చిన యూరియాలో సగం యూరియాను తీసుకువెళ్లిపోతామంటే కుదరదని మండల వ్యవసాయ శాఖ అధికారిణి జె.సౌజన్య తేల్చి చెప్పారు. దీంతో కిమ్మి ఆర్‌ఎస్‌కే వద్ద టీడీపీ నేత అనుచరులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పి, ఆందోళనను విరమింపజేశారు.
సహకార సొసైటీ ముట్టడి..
ఇటీవల కురిసిన వర్షాలకు మొక్కజొన్న, కంది పంటలకు యూరియా వేసేందుకు నంద్యాల జిల్లా నందికొట్కూరులోని రైతు సేవా కేంద్రాల వద్దకు, సహకార సొసైటీ కార్యాలయాల వద్దకు వెళ్లిన రైతన్నలకు నిరాశ ఎదురు కావడంతో బుధవారం ఆందోళనకు దిగారు.
పట్టణంతో పాటు బిజినవేముల, మల్యాల రైతులు యూరియా కోసం తరలివచ్చారు. స్టాక్ లేకపోవడంపై వారిలో ఆగ్రహం వ్యక్తమైంది. ఇవాళ, రేపు అంటూ ఎందుకు తిప్పుకుంటున్నారని రైతులు ఉపేంద్రారెడ్డి, మహబూబ్బాషా, స్వాములు అధికారులను నిలదీశారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా కూటమి ప్రభుత్వం యూరియా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులపై దాడి..
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ సచివాలయంలో 245 బస్తాల యూరియాను పంపిణీ చేస్తామని ముందస్తుగా చెప్పడంతో రైతులు బుధవారం సచివాలయం వద్దకు చేరుకున్నారు. గంటలపాటు వేచి చూసినా పంపిణీ జరగకపోవడంతో ఆందోళనకు దిగారు.
వైఎస్సార్సీపీ మండల బూత్ కమిటీ కన్వీనర్ ఎం.రమణ అధికారులను ప్రశ్నించగా.. కొందరు అనధికార వ్యక్తులు స్పందిస్తూ తమకు ఇష్టం వచ్చిన సమయంలో పంపిణీ చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో రైతులు వారితో వాగ్వాదానికి దిగి పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు.పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాలను చెదరగొట్టారు. ఈ సమయంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ బూత్ కమిటీ కన్వీనర్ రమణ పట్ల దురుసుగా వ్యవహరించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో యూరియా పంపిణీ నిలిచిపోయింది.