పేదలపై భారం మోపలేం..

Union Minister RK Singh Video Conference On Electricity Reforms - Sakshi

రైతులకు శాశ్వత ఉచిత విద్యుత్‌ మా బాధ్యత

విద్యుత్‌ సంస్కరణలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ

ఉద్యోగుల భద్రత కూడా తమకు ముఖ్యమని వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలపై విద్యుత్‌ భారం వేసేందుకు తాము ఎంతమాత్రం సిద్ధంగా లేమని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతుకు శాశ్వత ఉచిత విద్యుత్‌ను అందించడం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపింది. విద్యుత్‌  ఉద్యోగుల భద్రతకు నష్టం కలిగేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని పేర్కొంది. విద్యుత్‌ సంస్కరణలపై రాష్ట్రాలతో కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చట్ట సవరణకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి రాష్ట్ర వాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారు. విద్యుత్‌ సంస్కరణల దిశగా అడుగేసిన కేంద్ర ప్రభుత్వం గత ఏడాదే ముసాయిదా ప్రతిని రాష్ట్రాలకు పంపింది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం దీనిపై కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో ముసాయిదాలో మార్పులు చేసిన కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు చేపట్టింది.

ఉచిత విద్యుత్‌ అందాల్సిందే:
‘పేదల గృహ విద్యుత్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం భారీగా సబ్సిడీ ఇస్తోంది. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా పేదలకు యూనిట్‌ రూ.1.45కే  (50 యూనిట్లలోపు) ఇస్తోంది. పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం గత ఏడాది రూ.1,700 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18 లక్షల విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు డిస్కమ్‌లకు ప్రభుత్వం రూ.9 వేల కోట్ల వరకు సబ్సిడీ ఇస్తోంది. మరోవైపు రైతు కోరినన్ని కనెక్షన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సబ్సిడీ విషయంలోనూ వెనకాడబోం. రైతుల కోసమే 10 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రభుత్వం ప్రారంభించింది. వారికి ఉచిత విద్యుత్‌ అందాల్సిందే..’ అని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. కేంద్రం విద్యుత్‌ సంస్కరణలు చేపడితే. వ్యవసాయ విద్యుత్‌ లైన్లు ఎవరు వేయాలి? ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే ఎవరు కొత్తవి బిగించాలి? అనే అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ విషయాల్లో తమ ప్రభుత్వం ఏమాత్రం రాజీపడబోదని, కచ్చితమైన విధివిధానాలు ఉండాల్సిన అవసరం ఉందని, రైతు ప్రయోజనాలు కాపాడాలని కోరారు.

మా ఉద్యోగులకు కష్టం రావొద్దు
కేంద్రం ఏ సంస్కరణలు చేపట్టినా రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర విద్యుత్‌ రంగం బలోపేతం దిశగా వారు ప్రభుత్వంతో మమేకమై పని చేశారని శ్రీకాంత్‌ నాగులాపల్లి తెలిపారు. పవన, సౌర విద్యుత్‌ను జాతీయ స్థాయిలో లెక్కించి, రాష్ట్రం వాటా కేటాయిస్తే బాగుంటుందని సూచించగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. పోటీ ఆపరేటర్లు వచ్చినా డిస్కమ్‌లు యథాతథంగా పనిచేస్తాయని చెప్పారు. డిస్కమ్‌ల లైన్లనే ప్రైవేటు ఆపరేటర్లు వాడుకుంటారని, ఉద్యోగులకు ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. విద్యుత్‌ చౌర్యం, మీటర్ల బిగింపు, రీడింగ్‌తో పాటు అనేక అంశాలపై చర్చ జరిగింది. కాగా దక్షిణాది ప్రాంతంలో వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ ఏర్పాటును కేంద్రం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళింది.
చదవండి: అభిమానికి సీఎం జగన్‌ ఆత్మీయ ఆలింగనం 
చంద్రబాబుకు భారీ షాక్‌: కుప్పంలో టీడీపీ ఢమాల్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top