శ్రీవారి చెంత వేడుకగా ఉగాది ఆస్థానం

Ugadi Celebrations at Tirumala  - Sakshi

శోభాయమానంగా ఫల, పుష్పాలంకరణ

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు.

శ్రీవారి ఉత్సవమూర్తులు బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వ్రస్తాలను ధరింపచేసి పంచాంగ శ్రవణం నిర్వహించారు.

బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తం గా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

శ్రీవారి దర్శనానికి 12 గంటలు 
తిరుమలలోని క్యూకాంప్లెక్స్‌లో 2 కంపార్టుమెంట్‌లు నిండి ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 57,559 మంది స్వామివారిని దర్శించుకుని హుండీలో రూ.4.26 కోట్లు వేశారు. టైం స్లాట్‌ టికెట్లు కలిగిన వారికి సకాలంలో, దర్శన టికెట్లు లేని వారికి 12 గంటల్లో , ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్నవారికి 3 గంటల్లో దర్శనమవుతోంది.  

ప్రత్యేక ఆకర్షణగా  ఫల పుష్పాలంకరణ 
ఉగాదిని పురస్కరించుకుని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయం లోపల విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పా­లతో శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం చెంత ఎండు కొబ్బరితో దశావతారాలు, కొబ్బరిపూలతో చేసిన శ్రీలంక ఆర్ట్‌ అలంకరణలు, పుచ్చకాయలతో ఆకర్షణీయంగా చెక్కిన శ్రీపద్మావతి శ్రీనివాసుల కల్యాణఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆలయం వెలుపల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని తీసుకెళుతున్న గరుత్మంతుడు అనే ఘట్టాన్ని రూపొందించారు. గొల్ల మండపం పక్కన ఉగాది లక్ష్మీదేవితో శ్రీమహావిష్ణువు, ఉద్యానవనంలో ఆడుకుంటున్న బాలల రూపంలో ఉన్న శ్రీరాముడు హనుమంతుడు, ఉగాది రోజున మామిడి వనంలో కాయ­లు కోస్తున్న శ్రీకృష్ణుడు, పౌరాణిక ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

టీటీడీ గార్డెన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి న 150 మంది పుష్పాలంకరణ కళాకారులు 3 రోజుల పాటు శ్రమించి ఆకర్షణీయమైన ఫల, పుష్ప ఆకృతులను రూపొందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top