సముద్రంలో చేపల వేటపై 2 నెలల నిషేధం

Two Month Fishing Ban in Sea From April 15 to June 14 in Vizianagaram District - Sakshi

ఈ నెల 15 నుంచి జూన్‌ 14 వరకు నిషేధం

సముద్రంలో మత్స్య సంపదను కాపాడేందుకు నిషేధాజ్ఞలు

మత్స్యకారులకు భృతి అందించేందుకు ప్రభుత్వం చర్యలు

భోగాపురం: సాగరంలో జలసంపదను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి సంవత్సరం లాగానే చేపలు గుడ్లు పెట్టే సమయం ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి జూన్‌ 14వ తేదీ వరకు ప్రభుత్వం వేట నిషేధాజ్ఞలు జారీచేసింది. ఈ సమయంలో ఉపాధి కోల్పోనున్న మత్స్యకారులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. మత్స్య భరోసా పథకం ద్వారా అదుకుంటుంది. గత ప్రభ్వుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకారులను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి సంవత్సరం మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో మత్స్యభరోసా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10 వేలు సాయాన్ని  అందిస్తుండడంతో గంగపుత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

జిల్లాలో 15,138 మంది మత్స్యకారులు 
విజయనగరం జిల్లాలోని తీరప్రాంత మండలాలు పూసపాటిరేగ, భోగాపురంలో 14 సముద్రతీర మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 15,138 మంది మత్స్యకారులు ఉన్నారు. వారిలో 10 వేల నుంచి 12 వేల మంది మత్స్యకారులు నిరంతరం సముద్రంలో వేట కొనసాగిస్తుంటారు. రెండు మండలాల్లో 706 మోటార్‌ బోట్లు, 424 సంప్రదాయ బోట్లకు రిజిస్ట్రేషన్‌ అయింది. మత్స్యశాఖ అధికారులు మోటార్‌ బోట్లు, సంప్రదాయ పడవల్లో వేట కొనసాగిస్తున్న 2,335 మంది మత్స్యకారులను గుర్తించి రిజిస్ట్రేషన్‌ చేయించారు. 

పారదర్శకంగా అమలు  
మత్స్యకారులకు మంజూరైన సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నాం. మత్స్య సంపదను వృద్ధి చేసేందుకే ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. వేట నిషేధ సమయంలో  మత్స్యకారులు   నిబంధనలు ఉల్లంఘించి వేట కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.  
- నిర్మలాకుమారి, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్, విజయనగరం 

మత్స్యకారులకు భరోసా 
వేట నిషేధ సమయంలో మత్స్యకారులను అదుకునేందుకు మత్స్యకార భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు సాయం అందజేస్తోంది. జిల్లాలో 2,335 మందికి మత్స్యకార భరోసా అందనుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు పనులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  
- వాసుపల్లి రేయుడు, సర్పంచ్‌ ముక్కాం గ్రామం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top