TTD: డిసెంబరు నాటికి ఆటోమేటిక్ లడ్డూ యంత్రాల ఏర్పాటు 

TTD EO Said Automatic Laddu Machines Will Be Installed By December - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు.  ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియాన్ని డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనవరి 28న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారని అన్నారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు, టి, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించాం.

తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభం కానుంది స్పష్టం చేశారు. తిరుమలలో స్వామివారి హుండీ కానుకలు లెక్కించడానికి బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన పరకామణి భవనం నిర్మించామని ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నాం. త్వరలో మరో తేదీ నిర్ణయించి తెలియజేస్తాన్నారు.

‘‘తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోంది. తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నాం. ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశాం. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం.

భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటిదేవస్థానమ్స్‌ పేరుతో మొబైల్‌ యాప్‌ను ఇటీవల ప్రారంభించాం’’  అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవడంతోపాటు విరాళాలు కూడా అందించవచ్చు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చు. ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వీక్షించవచ్చునని ధర్మారెడ్డి పేర్కొన్నారు.

యువతకు ధార్మిక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో తిరుమల ఆస్థానమండపంలో యువ ధార్మికోత్సవం నిర్వహిస్తాం. దాదాపు 2 వేల మంది యువతీ యువకులు పాల్గొంటారన్నారు. ఫిబ్రవరి 5న రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 18న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహా శివరాత్రి పర్వదినం ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు.

జనవరి నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 20.78 లక్షలు కాగా, హుండీ ద్వాతా రూ.123.07 కోట్లు ఆదాయం చేకూరింది. విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.07 కోట్లు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 37.38 లక్షలు, కాగట కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 7.51 లక్షలు.
చదవండి: ఏకో ఇండియాతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఎంవోయూ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top