టీటీడీ ఈవో ధర్మారెడ్డికి పుత్రశోకం.. గవర్నర్, సీఎం సంతాపం

TTD EO Dharma Reddy son Dies with Cardiac arrest in Chennai - Sakshi

సాక్షి, చెన్నై/జూపాడుబంగ్లా/సాక్షి, అమరావతి: తిరు­మల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఈవో ఎ.వి.ధర్మారెడ్డికి పుత్రశోకం కలిగింది. ఆయన కుమారుడు చంద్రమౌళిరెడ్డి అలియాస్‌ శివ (28) చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8.20 గంటలకు కన్నుమూశారు. ధర్మారెడ్డి కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది.

చెన్నైలో బీటెక్‌ పూర్తిచేసి ముంబైలో ఫైనాన్స్‌ కన్సల్టెంటుగా ఉద్యోగం చేస్తున్న చంద్రమౌళి ఈనెల 18వ తేదీన చెన్నైలో తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చేరిన చంద్రమౌళికి ఎక్మో చికిత్స అందిస్తున్నామని, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు సోమవారం బులెటిన్‌ ద్వారా తెలిపాయి. ఈ సమాచారంతో పెద్దసంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖులు, చెన్నైలోని తెలుగు ప్రముఖులు, అధికారులు, సన్నిహితులు కావేరి ఆస్పత్రికి చేరుకుని ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.

మూడురోజుల పాటు చంద్రమౌళికి వైద్యులు అత్యవసర వైద్యచికిత్స చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇందుకు సంబంధించిన బులెటిన్‌ను ఆస్పత్రివర్గాలు 11 గంటల సమయంలో విడుదల చేశాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, మాజీ మంత్రులు, పలువురు «ప్రముఖులు ధర్మారెడ్డిని ఓదార్చారు. చంద్రమౌళి కళ్లను కుటుంబసభ్యులు దానం చేశారు. చంద్రమౌళి భౌతికకాయాన్ని ధర్మారెడ్డి స్వగ్రామం నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు ప్రత్యేక అంబులెన్స్‌లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నై నుంచి తరలించారు. చంద్రమౌళి మృతితో పారుమంచాల గ్రామంలో విషాదం అలుముకుంది. గురువారం గ్రామంలోని వారి పొలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

గవర్నర్, సీఎం సంతాపం: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ఆకస్మిక మృతి పట్ల గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరుగా సంతాపం తెలిపారు. ధర్మారెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజే­శారు. 

చదవండి: (Vijayawada: గల్ఫ్‌ సర్వీసులకు డిమాండ్‌ ఫుల్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top