మామిడి తాండ్ర రుచి ... తినరా మైమరచి | Sakshi
Sakshi News home page

మామిడి తాండ్ర రుచి ... తినరా మైమరచి

Published Mon, May 31 2021 5:38 AM

Tribe is engaged in the preparation of Mango Jelly - Sakshi

తాండ్ర... ఈ పేరు వింటేనే నోరూరుతుంది. గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తుండడంతో మరింత గిరాకీ పెరుగుతోంది. కిలో రూ.80 వరకూ ధర పలుకుతున్నా కొనుగోలుదారులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మామిడి సీజన్‌ అయిపోయినా వీటిని భద్ర పరుచుకొని తినే అవకాశం ఉండడంతో డిమాండ్‌ పెరుగుతోంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించి మరింత ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాంత వాసులు కృషి చేస్తున్నారు.

కురుపాం(విజయనగరం జిల్లా): గిరిజన మహిళలు సంప్రదాయంగా తయారుచేస్తున్న కొండమామిడి తాండ్రకు మంచి గిరాకీ ఏర్పడింది. కురుపాం నియోజకవర్గ పరిధిలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో గిరిశిఖర గ్రామాల్లో గిరిజన మహిళలు కొండమామిడి పండ్లను సేకరించి తాండ్ర తయారీకి ఉపక్రమిస్తున్నారు. ఏజెన్సీలో సహజసిద్ధంగా మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను సేకరించి  మామిడి తాండ్రను తయారు చేసి కిలో రూ.60 నుంచి రూ.80 వరకూ విక్రయిస్తున్నారు. 

తాండ్ర తయారీ 
ఏజెన్సీలో గిరిశిఖరాలపై మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం సమయాల్లో వెళ్లి పండ్లను సేకరించి వాటిని శుభ్ర పరిచి పెద్ద డబ్బాల్లో వేసి రోకలితో దంచుతారు. దంచగా వచ్చిన మామిడి రసాన్ని మేదర జంగెడలో పలుచగా వెదజల్లేలా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలుపకుండానే పొరలు పొరలుగా వేసి వారం, పది రోజులు ఆరబెట్టి ఉండలా చుట్టి తాండ్రను తయారు చేస్తారు. 

తియ్యరగు 
మామిడి పండ్లను ఒక డబ్బాలో వేసి రోకలితో దంచగా వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తారు. మిగిలిన మామిడి తొక్కలను, టెంకలను వేరు చేసి ఎండబెడతారు. తొక్కలను తియ్యరగుగా పిలుస్తారు. వీటిని బెల్లంతో ఊరగాయగా చేసుకొని అన్నంతో కూరగా ఆరగిస్తారు.

టెంకపిండి అంబలిగా... 
మామిడి పండ్ల నుంచి తొక్కను, రసాన్ని వేరుచేసిన తరువాత చివరిగా ఉండే మామడి టెంకలను కూడా ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకొని గిరిజనం ఆరగించటం ఆనవాయితీ. 

మార్కెట్లో మంచి గిరాకి..
ఏజెన్సీలో గిరిజనం తయారు చేసే తాండ్ర, తియ్యరకు మంచి గిరాకీ ఉంది. స్థానిక వ్యాపారులు తాండ్రను కేజీ రూ.80 వరకు కొనుగోలు చేస్తున్నారు. తియ్యరగు కేజీ రూ.50 ధర పలుకుతోంది. ఎటువంటి రసాయనాలు కలుపకుండా తయారు చేయటంతో వ్యాపారులు ఈ ప్రాంత తాండ్రపై మక్కువ చూపిస్తున్నారు.

మామిడితో ఎంతో మేలు 
ప్రతీ ఏడాది మామిడితో గిరిజన కుటుంబాలకు అన్ని విధాలా మేలే. ఎందుకంటే మేము ఏడాదిపాటు వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు తాండ్రను అన్నంతో, తియ్యరగు ఊరగాయగా వినియోగిస్తుంటాం, మామిడి టెంకను కూడా టెంక పిండి అంబలిగా చేసుకొని వృద్ధులు తాగుతారు. మరికొన్ని సందర్భాల్లో వ్యాపారులకు కూడా విక్రయిస్తుంటాం. మామిడితో మాకు అన్ని విధాలా మేలే. 
– బిడ్డిక తులసమ్మ, వలసబల్లేరు గిరిజన గ్రామం, కురుపాం మండలం 

Advertisement
Advertisement