వైద్య సేవల రంగంలో గిరిజన యువత

Tribal youth in the field of medical services - Sakshi

డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌తో కలిసి హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ

హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉపాధి

సంప్రదాయ కళల్లో శిక్షణ ద్వారా పర్యాటక రంగంలోనూ ఉపాధి

స్థానిక ఉత్పత్తులను విక్రయించేలా మార్కెటింగ్‌ టెక్నిక్స్‌

గిరిజన యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ

సాక్షి, అమరావతి: గిరిజన యువతకు ఉపాధి కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్‌ఎస్‌డీసీ) ద్వారా చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. గిరిజన యువత కోసం ఏపీ ఎస్‌ఎస్‌ఐడీసీ వివిధ ఉపాధి కోర్సులను అందుబాటులోకి తీసుకొచి్చంది. ఇందులో భాగంగా డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌తో కలిసి హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌లో శిక్షణ ఇస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఒక శిక్షణా ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్‌లో ఇప్పటివరకు 361 మంది గిరిజన యువత హాస్పిటల్‌ సర్వీసెస్‌ కోర్సుల్లో శిక్షణ పొందారు.

వీరిలో 244 మందికి ఇప్పటికే ఉపాధి లభించినట్టు ఏపీ ఎస్‌ఎస్‌డీసీ ఈడీ హనుమాన్‌ నాయక్‌ తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రాథమికంగా రూ.12 వేల నుంచి రూ.16 వేల వరకు జీతం లభిస్తోందని తెలిపారు. విశాఖ, బేతంచర్లలో కూడా ఇటువంటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. అదేవిధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతో కలిసి నర్సింగ్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా గిరిజన యువతులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ విధంగా 2020లో 3,300 మందికి శిక్షణ ఇవ్వగా.. ఈ ఏడాది కనీసం 5,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top