భూ సర్వేపై 26 నుంచి శిక్షణ  | Sakshi
Sakshi News home page

భూ సర్వేపై 26 నుంచి శిక్షణ 

Published Mon, Aug 23 2021 4:39 AM

Training from 26 on land survey - Sakshi

సాక్షి, అమరావతి:  వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద చేపట్టిన రీ సర్వే కోసం ఈ నెల 26వ తేదీ నుంచి విడతల వారీగా 1,294 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు సర్వే సెటిల్‌మెంట్, భూ రికార్డుల కమిషనర్‌ సిద్ధార్థజైన్‌ తెలిపారు. సహాయ విభాగ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సహాయకులకు 15 రోజులపాటు శిక్షణ ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. సామర్లకోటలోని సర్వే ట్రైనింగ్‌ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా కారణంగా అందరికీ ఒకేసారి శిక్షణ ఇచ్చే అవకాశం లేకపోవడం వల్ల జిల్లా స్థాయిలో ప్రతి బ్యాచ్‌కు 60 మందిని ఎంపిక చేసి విడతల వారీగా శిక్షణ ఇప్పిస్తున్నట్టు తెలిపారు.

శిక్షణ ముగింపులో ప్రతి బ్యాచ్‌కు సర్వే నిర్వహణ పరీక్ష మాదిరిగానే థియరీ, ప్లాటింగ్‌పై తుది పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఈ పరీక్షలను పర్యవేక్షించడానికి సంబంధిత జాయింట్‌ కలెక్టర్ల ద్వారా రెవెన్యూయేతర విభాగం నుంచి పరిశీలకులను నియమిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న భూ పునర్‌ వ్యవస్థీకరణ కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని సంప్రదాయక సర్వేతో పాటు సిలబస్‌లో కొత్త విషయాలను ప్రవేశపెట్టామని తెలిపారు. ఈటీఎస్, డీజీపీఎస్,  నెట్‌వర్క్, ఎస్‌ఓపీ, గ్రౌండ్‌ ట్రూతింగ్, ఫీచర్‌ ఎక్స్‌ట్రాక్షన్, గ్రౌండ్‌ ధ్రువీకరణ వంటి అధునాతన అంశాలను సిలబస్‌లో చేర్చామని వివరించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement