
మొలుగుమాడులో భూముల సర్వే కోసం ఉపయోగించిన డ్రోన్‌తో సిబ్బంది
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని గ్రామంలో పైలట్ సర్వే పూర్తి
గ్రామానికి సరిహద్దులు,వాగులు, డొంకలు ఖరారు
ప్రభుత్వ, పట్టా భూముల వివరాలు పక్కాగా నిర్ధారణ
ఎట్టకేలకు ‘నక్షా’.. టిప్పన్లు తయారు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం
ప్రభుత్వ ఆమోదం లభిస్తే గ్రామ పటం ఇక అధికారికం
దాదాపు నెల రోజుల పాటు శ్రమించిన రెవెన్యూ, సర్వే ఏజెన్సీ సిబ్బంది
గ్రామస్తుల సహకారంతో విజయవంతమైన రీసర్వే
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం–కృష్ణా జిల్లాల సరిహద్దు మండలమైన ఎర్రుపాలెం పరిధిలో ఉండే వ్యవసాయాధారిత గ్రామం మొలుగుమాడు. గతంలో ఇది ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండేది. నిజాం కాలంలో తెలంగాణలో భాగమైంది. అయినా ఆ గ్రామానికి ఇప్పటివరకు నక్షా (గ్రామ పటం) లేదు. రెవెన్యూ రికార్డులు మాత్రం ఉన్నాయి. ఆ రికార్డుల మేరకు రైతులు ఎవరి భూమి వారు సాగు చేసుకుంటున్నారు.
ఈ గ్రామంలోని రైతులందరికీ రైతు భరోసా కూడా వస్తోంది. కానీ గ్రామ పటం లేని కారణంగా అసలు గ్రామ సరిహద్దులేవో తేల్చలేని పరిస్థితి. వాగులు, వంకలు ఎక్కడెక్కడున్నాయో కాగితాల మీద చూపించలేని పరిస్థితి. ఇలాంటి గ్రామాలు తెలంగాణలో 413 ఉన్నాయని తేల్చిన ప్రభుత్వం.. పైలట్‌గా ఆ గ్రామంతో పాటు ఐదు గ్రామాల్లో భూముల రీసర్వే చేపట్టింది.
మొలుగుమాడుకు సంబంధించిన 843 ఎకరాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసింది. రీ సర్వే అనంతరం మొలుగుమాడు గ్రామంలోని భూములపై స్పష్టత వచ్చింది. ఆ గ్రామ సరిహద్దులు తేలాయి. అసలు ఆ గ్రామంలో ఉన్న భూముల విస్తీర్ణం ఎంత? ఎంతమంది రైతులు సాగు చేసుకుంటున్నారు? ప్రభుత్వ భూమి ఎంత ఉంది? చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? వాగులు ఎంత మేరకు ఉన్నాయి? భూముల సాగుకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నాయి? రోడ్లు ఎక్కడ ఉన్నాయి? శ్మశానాల సంగతేంటి? ఎన్ని సర్వే నంబర్లలో భూమి ఉంది? ఆ సర్వే నంబర్లను ఎన్ని సబ్ డివిజన్లు చేశారు? అనే వివరాలన్నీ స్పష్టంగా తెలిసిపోయాయి.
దీంతో గ్రామానికి నక్షా వస్తోంది. టిప్పన్లు (రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి స్కెచ్) వస్తున్నాయి. దీంతో ఇదంతా ఎలా సాధ్యమయ్యింది? అసలు రీసర్వే ఎలా జరిగింది? అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.
గ్రామస్తులకు ముందుగానే అవగాహన
రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే కోసం మొలుగుమాడు గ్రామాన్ని పైలట్‌గా ఎంపిక చేసిన తర్వాత ఆ గ్రామస్తులకు ఈ ప్రక్రియపై ముందుగా అవగాహన కల్పించారు. హైదరాబాద్‌కు చెందిన ఐఐసీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఏజెన్సీ సర్వే నిర్వహించింది.
ఎర్రుపాలెం తహశీల్దార్ ఎం.ఉషా శారదతో పాటు మధిర, ఎర్రుపాలెం సర్వేయర్లు, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ఆరుగురు సర్వే ఏజెన్సీ సిబ్బంది రెండు బృందాలుగా విడిపోయి భూముల రీసర్వే నిర్వహించారు. మరో ఆరుగురు డ్రోన్ సిబ్బంది వీరికి సహకరించారు. ఈ ఏడాది మే 26వ తేదీన సర్వే ప్రారంభం కాగా జూన్ 21వ తేదీతో పూర్తయింది. రోజుకు 60–80 సర్వే నంబర్ల చొప్పున విభజించుకుని సర్వే చేశారు.
ఉత్తర దిక్కు నుంచే మొదలు..
ఉత్తరం దిక్కు నుంచి సర్వే ప్రారంభించారు. అంతకుముందు గ్రామాల సరిహద్దులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. ఉత్తరం దిక్కునే పురాతన సరిహద్దు రాయిని గుర్తించి అక్కడి నుంచి రీసర్వే ప్రారంభించారు. గ్రామంలో ఒకటో సర్వే నంబర్ కూడా ఉత్తరం దిక్కు నుంచే ప్రారంభమవుతోంది.
అయితే ఎక్కడ సర్వే చేసినా ఉత్తరం దిక్కునే ప్రారంభిస్తారని, గడియారం ముల్లు తరహాలో ఉత్తరం నుంచి తూర్పు, దక్షిణం, పడమర దిక్కుల్లో సర్వే చేస్తారని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. ఫలానా రోజు ఫలానా సర్వే నంబర్లలో రీ సర్వే ఉంటుందని ముందుగానే చాటింపు వేయడం వల్ల..సర్వే సమయంలో రైతులు తమ భూముల్లో సిద్ధంగా ఉండేవారు.
వారి భూమి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో చూపించేవారు. ఈ క్రమంలో ఆ భూ కమతాన్ని గ్రౌండ్ ట్రూతింగ్ చేసిని సిబ్బంది.. డీజీపీఎస్ విధానంలో విస్తీర్ణాన్ని నిర్ధారించి సరిహద్దులు ఫిక్స్ చేశారు. దీన్ని రికార్డులో నమోదు చేశారు. వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపారు. ఈ గ్రామంలో భూముల విషయంలో పెద్దగా వివాదాలు లేకపోవడంతో పోలీసుల అవసరం రాలేదు.
6 ఎకరాలు ఎక్కువ..!
ఈ గ్రామంలో భూములకు సంబంధించిన వివాదాలు పెద్దగా రాలేదు కానీ, రీ సర్వే అనంతరం భూముల లెక్క మాత్రం తేడా వచ్చింది. గతంలో ఉన్న రికార్డుల ప్రకారం అక్కడ 845.32 ఎకరాల భూమి ఉంది. కానీ రీ సర్వే తర్వాత ఆ గ్రామంలో మొత్తం భూమి విస్తీర్ణం 852.10 ఎకరాలుగా తేలినట్లు తెలిసింది. అంటే 6 ఎకరాల 18 గుంటల భూమి ఎక్కువ ఉందన్నమాట. అయితే వ్యవసాయ భూముల విషయంలో ఎలాంటి తేడాలు రాలేదని, ప్రభుత్వ భూములు, చెరువులు, వాగులకు సంబంధించిన విస్తీర్ణం ఎక్కువ వచ్చి ఉండవచ్చని చెబుతున్నారు.
వెలుగులోకి సమస్యలు
⇒ సర్వే నంబర్లకు సంబంధించిన సబ్ డివిజన్లు ఎక్కువగా ఉండడంతో కొన్నిచోట్ల రైతు ఎక్కడ కబ్జాలో ఉన్నాడో అర్థం కాలేదు. ముఖ్యంగా తెలుగులో ‘రు’, ‘ఎ’, ఇంగ్లీషులో ‘ఆర్’, ‘ఈ’ అని సబ్ డివిజన్లు ఉన్నచోట్ల ఈ సమస్య కనిపించింది.
⇒ వారసత్వంగా వచ్చే భూముల విషయంలో భాగస్వామ్య పంపకాలు పూర్తయిన తర్వాత కూడా పాత పట్టాదారు (తండ్రి లేదా తల్లి) పేరిట భూములకు పాసు పుస్తకాలు వచ్చాయి.
⇒ ఒక రైతు పేరిట 66 గజాల భూమి కూడా రికార్డయి పాసుపుస్తకం ఉంది. ఇది రైతుబంధు కోసం జరిగి ఉంటుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
⇒ ఆన్‌లైన్ పహాణీలు కొన్నిచోట్ల సరిపోలలేదు. ఈ గ్రామంలోని 74వ సర్వే నంబర్‌లో భూమి రికార్డు ఒకరి పేరిట ఉంటే ఆ భూమి సాగు (కబ్జా)లో మరో ముగ్గురు రైతులున్నారు. సర్వేలో ఆ భూమి ముగ్గురు రైతులదేనని తేలింది. దీంతో ఇప్పుడు రికార్డుల్లో ఆ ముగ్గురి పేర్లు నమోదు చేసే అవకాశం లభించింది.
⇒ మరో రైతు భూమి 62, 63 సర్వే నంబర్లలో ఉంటే పహాణీలో 36 సర్వే నంబర్‌లో వచ్చింది. మరో రైతు భూమి 17వ సర్వే నంబర్‌లో ఉండాల్సి ఉండగా, ఆన్‌లైన్ రికార్డులో మాత్రం 49 సర్వే నంబర్ నమోదైంది.
తేలని డొంక సమస్య
ఈ గ్రామం,, సఖినవీడు గ్రామంతో కలిసే చోట రైతుల పొలాలకు వెళ్లేందుకు పూర్వం డొంక ఉండేదని గ్రామస్తులు చెపుతున్నారు. ఈ డొంకకు ఎదురుగా రోడ్డు అవతల 30 అడుగుల డొంక ఉంది. కానీ, రోడ్డు ఇవతలి వైపు లేకపోవడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది. దీంతో డొంక ఆవలి భూములను సాగు చేయలేని పరిస్థితి ఉంది.
రీసర్వేలో భాగంగా ఈ డొంక సమస్యను తేల్చాలని, నక్షాలో చేర్చాలని గ్రామస్తులు కోరినా ఫలితం లేకుండా పోయింది. ఈ డొంక మార్గంలో సమాధులు ఉండడం, అందులోనే అసైన్డ్ భూమి ఉండడంతో డొంకను అధికారికంగా చూపెట్టలేమని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సమస్యను తేలి్చన తర్వాతే నక్షా తయారు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సహకరించిన అందరికీ ధన్యవాదాలు
రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఒక్కొక్కటిగా భూముల సమస్యలు పరిష్కరిస్తున్నాం. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని మొలుగుమాడు గ్రామంలో నక్షా లేదని తెలిసి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశాం. అందరి సహకారంతో ఇక్కడ రీసర్వే పూర్తయిందనే సమాచారం వచ్చింది. రైతులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు.
– పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
ఆ తృప్తి ఎప్పటికీ ఉంటుంది
రీసర్వేకు మొలుగుమాడు గ్రామ రైతాంగం బాగా సహకరించింది. 843 ఎకరాల్లో భూములు సర్వే చేయడమంటే మాటలు కాదు. రెవెన్యూ సిబ్బందితో పాటు సర్వే ఏజెన్సీ కూడా బాగా పనిచేసింది. నా హయాంలో ఓ గ్రామానికి రెవెన్యూ పటం తయారు చేశానని, నక్షా ఇవ్వగలిగాననే తృప్తి ఎప్పటికీ మిగిలిపోతుంది.
– మన్నె ఉషాశారద, ఎర్రుపాలెం మండల తహశీల్దార్
మంచి అవకాశం..వినియోగించుకున్నాం
మా గ్రామానికి నక్షా లేని కారణంగా అసలు డొంకలెక్కడున్నాయో, రోడ్లు ఏవో అర్థమయ్యేది కాదు. గతంలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలో చేసిన పాదయాత్ర సందర్భంగా వినతిపత్రం ఇచ్చాం. ఆయన మా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టులో చేర్చారు. ఆ అవకాశాన్ని మేం వినియోగించుకున్నాం.
– గంటా శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్, మొలుగుమాడు
ప్రతి రైతు నుంచి సంతకాలు తీసుకున్నాం
భూముల రీసర్వే కోసం నిబద్ధతతో పనిచేశాం. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి రైతు నుంచి సంతకాలు తీసుకున్నాం. ఎవరి పేరు మీద భూమి ఉంటే వారు వస్తేనే సర్వే చేశాం. ఎవరైనా కుటుంబ సభ్యులు వస్తే చేయలేదు.
– రాజశేఖర్, గ్రామ సర్వేయర్
సర్వే సారాంశం ఇదీ:
పట్టా ఉండి భూముల్లో కబ్జా ఉన్న రైతుల సంఖ్య: 1023
ఆ భూమి విస్తీర్ణం: 668.0226 ఎకరాలు
ఎలాంటి టైటిల్ లేకుండానే సాగు చేసుకుంటున్న రైతులు: 62
ఆ భూమి విస్తీర్ణం: 34.3964 ఎకరాలు
టైటిల్ ఉండి వాస్తవంగా భూమి లేని రైతులు: 13
ఆ భూమి విస్తీర్ణం: 3.0139 ఎకరాలు
ఆన్‌లైన్‌లో ఎంట్రీ కాని రైతుల సంఖ్య: 54
ఆ భూమి విస్తీర్ణం: 26.316 ఎకరాలు
గ్రామ సరిహద్దులివీ..
ఉత్తరం: ఇనగాలి గ్రామం (ఈ వైపున 21 సర్వే నంబర్లు ఉన్నాయి)
దక్షిణం: సఖినవీడు గ్రామం (ఈ దిక్కున 24 సర్వే నంబర్లు ఉన్నాయి)
తూర్పు: ఏరు (కట్లేరు)
పశ్చిమం: మాటూరు గ్రామం (ఇటు వైపు 10 సర్వే నంబర్లు ఉన్నాయి.)
భూముల రకం, విస్తీర్ణం..
భూమి రకం విస్తీర్ణం (ఎకరాలు, గుంటల్లో)
ప్రభుత్వ భూమి 78.3359
ఇనాం భూమి 16.2039
గ్రామ కంఠం 49.38
చెరువు 25.2960
పట్టా భూమి 683.06