
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూలో క్షీణత
ఎక్కడికక్కడ నిలిచిపోయిన హోటల్ అప్‌గ్రేడేషన్
విశాఖ యాత్రినివాస్ హోటల్ మూతపడటంతో ఏడాదికి రూ.4 కోట్లకుపైగా నష్టం
ప్రభుత్వ సొమ్ముతో మరమ్మతులు చేసిన హోటళ్లను ప్రైవేట్ పరం చేసే కుట్ర
టీటీడీ దర్శన సర్వీసులు నిలిచిపోవడంతో భారీగా తగ్గిన రాబడి
గత ప్రభుత్వం హోటళ్లను అప్‌గ్రేడ్ చేస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగం పడకేసింది. పర్యాటకులకు బస, ఆతిథ్య సౌకర్యాలు అందించలేక చేతులు ఎత్తేసింది. ఆదాయ ఆర్జనలో తిరోగమనంలో పయనిస్తోంది. కూటమి సర్కారు వచ్చాక ఆర్భాటపు ప్రకటనలు మినహా పర్యాటకాభివృద్ధి జాడే లేకుండా పోయింది. ప్రైవేటు జపంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) నిర్వీర్యమైపోతోంది. ఏపీటీడీసీ ఆస్తులను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేందుకు కూటమి కుయుక్తులు పన్నుతోంది. దీనివల్ల ఏపీటీడీసీ 2024–25 వార్షిక రెవెన్యూలో గణనీయంగా రూ.20 కోట్లకుపైగా పతనం కనిపిస్తోంది.
కరోనాతో ప్రపంచ పర్యాటకం మొత్తం కుదేలైన రోజుల్లోనూ ఏపీ పర్యాటకం అత్యంత వేగంగా బలోపేతమైంది. 2014–19తో పోలిస్తే 2022–23లో రికార్డు స్థాయిలో రూ.162 కోట్లు, 2023–24లో ఏకంగా రూ.164 కోట్లు టర్నోవర్ సాధించింది. 2021–22తో పోలిస్తే ఏకంగా 11 శాతంపైనే వృద్ధిని నమోదు చేసింది. విచిత్రంగా 2017–18లో టీడీపీ హయాంలో మాత్రం రూ.1.99 కోట్ల లోటుతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించడం చంద్రబాబు హయాంలో సంపద సృష్టి ఎంతగా దిగజారిందో స్పష్టం చేస్తోంది. మళ్లీ ఇప్పుడు ఏపీటీడీసీ రెవెన్యూ తిరోగమనంలోకి వెళ్లడం గమనార్హం.
గత ప్రభుత్వంలో అప్‌గ్రేడ్.. ఇప్పుడు డిగ్రేడ్!
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏపీటీడీసీకి చెందిన హరిత హోటళ్లను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా పర్యాటకులకు అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు సంకల్పించింది. 2023 చివరిలో రూ.80 కోట్లకుపైగా వెచ్చించి 12 హోటళ్ల ఆధునికీకరణ పనులు ప్రారంభించింది. వాటిని 2024 సెప్టెంబర్‌నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించింది. రూ.70 కోట్లకుపైగా పనులు పూర్తిచేసింది. కానీ, గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడంతో హోటళ్ల అప్‌గ్రేడేషన్ ప్రాజెక్టు చివరి దశలో నిలిచిపోయింది. హోటళ్లు మూతపడ్డాయి. ఫలితంగా హోటళ్ల ఆదాయానికి పూర్తిగా గండికొట్టినట్టు అయ్యింది.
ముఖ్యంగా విశాఖపట్నంలోని యాత్రీ నివాస్ ఏడాదికిపైగా మూతపడటంతో రూ.4కోట్లకుపైగా ఆదాయాన్ని కోల్పోయింది. హార్సిలీహిల్స్, నెల్లూరు, సూర్యలంక, శ్రీశైలం, టైడా, అనంతగిరి, యాత్రీనివాస్, బెరంపార్క్, భవానీ ఐలాండ్, దిండి, ద్వారకా తిరుమలలోని హరిత హోటళ్ల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. వరదలతో దెబ్బతిన్న భవానీ ఐలాండ్‌లో ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదు. దీంతో పర్యాటకుల తాకిడి భారీగా తగ్గిపోయింది. తద్వారా బోటింగ్ ఆదాయమూ పడిపోయింది.
ప్రైవేటుపరానికి కుయుక్తులు
ఆదాయం పడిపోవడాన్ని కారణంగా చూపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీటీడీసీ హోటళ్లు, ఆస్తులను ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. దీనికోసం అధికారం చేపట్టిన కొత్తల్లోనే దొంగచాటున ‘స్టెర్లింగ్’ సంస్థకు చెందిన హోటల్ ప్రతినిధులు ఏపీటీడీసీ ఆస్తులను లెక్కేసుకోవడానికి ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరచడం విశేషం.
తాజాగా కొద్ది రోజుల కింద స్టెర్లింగ్ ప్రతినిధులు, యోగా గురువు బాబారాందేవ్ వంటి ప్రముఖులు సీఎంను కలిశారు. అంతకు ముందే ఏపీటీడీసీకి చెందిన హోటళ్లను పరిశీలించి ఎవరికి ఎక్కడ ఏం కావాలో కర్చీఫ్ వేసుకున్నట్టు వినికిడి. ఈ క్రమంలోనే ఏపీటీడీసీకి చెందిన 30 ఆస్తులను ఓఅండ్‌ఎంగా ప్రభుత్వం ఇచ్చేస్తోంది. అయితే, వీటిని కూడా ముందుగానే ఎవరికి ఇవ్వాలో ఫైల్ సిద్ధమైనట్టు సమాచారం. పేరుకు మాత్రమే టెండర్లు పిలిచి మమ అనిపించడమే తరువాయిగా తెలుస్తోంది.
కేంద్ర నిధుల దారి మళ్లింపు..
కూటమి ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి సంస్థకు నిధులు కేటాయించకపోగా కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్‌లో భాగంగా గండికోట, అఖండ గోదావరి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులనూ దారి మళ్లించేసింది. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి సుమారు రూ.170కోట్లకు గాను రూ.100 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పనులూ ప్రారంభించకుండానే కేటాయించింది. ఈ నిధులు రాష్ట్ర ట్రెజరీ నుంచి ఏపీటీడీసీ ఖాతాలకు జమ కాలేదు.
ఈ విషయం బయటకు పొక్కడంతో ఆర్థిక శాఖ అధికారులు తేరుకుని నిధులు ఏపీటీడీసీకి ఇచ్చేశారు. దీనికి తోడు ఏటా బడ్జెట్‌లో ఏపీటీడీసీకి రూ.2.40 కోట్లకుపైగా కేటాయింపులు చేస్తుండంగా ఈసారి కూటమి ప్రభుత్వం రూ.60లక్షలకే కుదించడం ఏపీటీడీసీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. దీనికి పూర్తి విరుద్ధంగా పర్యాటకంలో పండగల పేరుతో ఏపీ పర్యాటక అథారిటీకి రూ.150 కోట్లు కేటాయించింది. అంటే ఏపీటీడీసీ వార్షిక ఆదాయానికి సరిసమానమైన మొత్తాన్ని కేవలం పండగల పేరుతో నచ్చిన కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు చూపిస్తున్న శ్రద్ధ ఏపీటీడీసీని బలంగా నిలబెట్టడంలో చూపించట్లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
టీటీడీ దర్శనానికి మంగళం
పర్యాటకాభివృద్ధి సంస్థతోపాటు ఏపీఎస్‌ఆర్టీసీ, వివిధ రాష్ట్రాల్లోని సుమారు 8 కార్పొరేషన్లకు గతంలో టీటీడీ నెలకు 5400 తిరుమల దర్శన (రూ.300)టికెట్లు అందించేది. దీని ద్వారా ఏపీటీడీసీ హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడు నుంచి ప్రత్యేక ప్యాకేజీ టూర్ల(బస్సులు)ను నడపడంతోపాటు హైదరాబాద్, ముంబై నుంచి విమాన టూర్ ప్యాకేజీలతో భక్తులకు తిరుమల వేంటేశ్వరస్వామి దర్శన భాగ్యాన్ని కల్పించేది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టికెట్ల కేటాయింపును రద్దు చేసింది. దీంతో ఏపీటీడీసీ ఆదాయానికి భారీ దెబ్బతగిలింది. వీటితో పాటు గతంలో దేవదాయ శాఖతో సంయుక్తంగా నిర్వహించిన ఆధ్యాత్మిక సర్క్యూట్ టూర్ ప్యాకేజీలను కూడా సర్కారు పక్కన పడేసింది. ఫలితంగా ఏపీటీడీసీకి చెందిన ట్రాన్స్‌పోర్టు విభాగం నిర్వీర్యమైంది.
లీజు వసూళ్లలో గ్యారంటీ ఎంత?
ఇదిలా ఉంటే రాజమహేంద్రవరంలోని గోదావరి గట్టున ఉండే హరిత హోటల్‌ను గతంలోనే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. దాని నుంచి రూ.10 కోట్ల వరకు లీజు రెంటు ప్రభుత్వానికి బకాయిపడింది.ఇలా రాష్ట్రంలో సుమారు రూ.40 కోట్ల వరకు ప్రభుత్వానికి లీజు రెంట్లు రూపంలో ఆదాయం రావాల్సి ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే ప్రభుత్వ హరిత హోటళ్లపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. సౌకర్యాల లేమితో పర్యాటకులు ప్రైవేటు హోటళ్లవైపు మొగ్గుచూపుతున్నారు. అధికమొత్తాలు చెల్లించుకుంటున్నారు.