వీరు రూ. 8 అంటారు.. వారు రూ. 3కి కొంటారు | Totapuri mango price drop worries farmers | Sakshi
Sakshi News home page

వీరు రూ. 8 అంటారు.. వారు రూ. 3కి కొంటారు

Jun 18 2025 8:10 AM | Updated on Jun 18 2025 8:10 AM

Totapuri mango price drop worries farmers

ప్రస్తుతం తోతాపురి ర్యాంపుల్లో కేజీ రూ.3లే  

మద్దతు ధర రూ.8గా ప్రకటించిన కూటమి ప్రభుత్వం  

ఫ్యాక్టరీలో రూ.5 నుంచి రూ.6 

మద్దతు ధరపై చేతులెత్తేసిన వైనం  

అర్ధరాత్రి ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లిన కూటమి నేతల కాయల వాహనాలు 

కేజీ రూ.6కు తగ్గకుండా చూస్తామన్న  ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ విద్యాధరి  

తోతాపురి మామిడి రైతుకు మద్దతు ధర ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం కిలోకు రూ. 8 మేర కొనాల్సిందే అని కంపెనీలకు చెబుతున్నా, పక్కాగా దాన్ని అమలు చేయడంలేదు. మరోవైపు చిత్తూరు జిల్లా ర్యాంపుల్లో కిలో కాయ ధర రూ. 3 మించి పలకని దైన్యం నెలకొంది. ఈ నేపథ్యంలో తోతాపురి రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.  

కాణిపాకం: చిత్తూరు జిల్లాలో తోతాపురి ధరలు పాతాళానికి పడిపోయాయి. ర్యాంపుల్లో కేజీ రూ.3కు మించి కొనుగోలు చేయడంలేదు. ఫ్యాక్టరీలో రూ.5, రూ.6కు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తోతాపురికి మద్దతు ధర కేజీ రూ.8గా నిర్ణయించింది. ప్రభుత్వ ప్రోత్సాహక నిధిగా కేజీకి రూ.4 ఇస్తామని ప్రకటించింది. ఈనెల 14వ తేదీన చిత్తూరు జిల్లాలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించి, కచి్చతంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ఫ్యాక్టరీలు  తోతాపురిని కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఈ మద్దతు ధర ఎక్కడా అమలుకావడం లేదు. రైతుకు కనీస ధర ఇప్పించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది.

కిలో రూ.6 కు తగ్గకుండా చూస్తాంః జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌  
కిలో మామిడికాయల ధర రూ.6కు తగ్గకుండా చూస్తామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ విద్యాధరి మీడియా సమావేశంలో వెల్లడించారు. ర్యాంపుల్లో రూ.3.50కి కొంటున్నారని తెలిపారు. కిలో రూ. 6లు చెల్లించేలా టాస్‌్కఫోర్స్‌ కమిటీ వేస్తామన్నారు. తద్వారా  «రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని వివరించారు.   

ఉద్యానశాఖ కుంటిసాకులు  
జిల్లాలో మామిడి రైతుల ఆందోళనల నేపథ్యంలో ఉద్యానశాఖ అధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాయలు పక్వానికి  రాకుండా కోత కోయడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని కుంటిసాకులు చెబుతూ మద్దతు ధరకు మంగళం పాడుతున్నారు. అధికారుల తీరుపై జిల్లా రైతులు భగ్గుమంటున్నారు. మద్ధతు ధర రూ. 8 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

టోకెన్ల కోసం తోపులాటలు..తొక్కిసలాటలు  
చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని ఓ పరిశ్రమ వద్ద టోకెన్ల కోసం మామిడి రైతులు పడరాని పాట్లు పడ్డారు.మంగళవారం సుమారు మూడు గంటల పాటు టోకెన్ల కోసం అవస్థలు పడ్డారు. రద్దీని గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని నియంత్రించి టోకెన్లు జారీ చేశారు. ఈ తరుణంలో ఫ్యాక్టరీ వద్ద గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. టోకెన్ల కోసం గేటు తీసే క్రమంలో తోపులాటలు, తొక్కిసలాటలు జరిగాయి. ముగ్గురు వ్యక్తులు సొమ్మసిల్లి పడిపోయారు.  

ఫ్యాక్టరీల ఆవరణలో వందలాది వాహనాలు  
మామిడి కాయలను విక్రయించేందుకు జిల్లా వ్యాప్తంగా రైతులు ఫ్యాక్టరీలకు వచ్చారు. అయితే సరైన మద్దతు ధర లభించని కారణంగా తెచ్చిన కాయలను ఇంటికి తిరిగి తీసుకెళ్లలేక, అయినకాడికి తెగనమ్ముకోలేక వచ్చిన వాహనాల్లో రోజులుగా వేచిచూస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీ ఆవరణలో వందలాది ట్రాక్టర్లు, లారీలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా ఆ వాహనాలు  ముందుకు, వెనక్కు కదలకుండా అలానే నిలిచిపోయాయి.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement