నాకు దిక్కేది.. ఎలా బతకాలి

Three Family Members Died In Ravulapalem Road Accident - Sakshi

తూర్పు గోదావరి (రావులపాలెం) : నాన్న కోసం వెళ్లిన అమ్మ, అన్నయ్య, నాన్నమ్మ లేకుండా పోయారు. ఇక ఎలా బతకాలి.. నాకు దిక్కేది అంటూ ఆ కుటుంబంలో చిన్న కుమారుడు దుర్గాప్రసాద్‌ గుండెలు అవిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. కొత్తపేట మండలం మందపల్లి వద్ద గురువారం అర్ధరాత్రి పాలవ్యాన్, మోటారు బైక్‌ను ఢీ కొట్టిన ఘటనలో రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడ్డారు. పోస్టుమార్టం అనంతరం అప్పన సత్యవతి, వెంకటలక్ష్మి, మహేష్‌ మృతదేహాలను సమీప బంధువులు, స్థానికులు రెండు అంబులెన్సుల్లో ఇంటికి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు, బంధువులు చివరి చూపుకోసం రావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 మృతిచెందిన దుర్గాప్రసాద్‌ నాన్నమ్మ సత్యవతి భర్త రెండేళ్ల క్రితం కాలం చేశాడు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారందరికీ వివాహం అయ్యింది. సత్యవతి భర్త పోయిన నాటి నుంచి పెద్ద కుమారుడు పుల్లేశ్వరరావు, చిన్న కుమారుడు నాగేశ్వరరావుల వద్ద ఉంటుంది. అయితే చిన్న కుమారుడు నాగేశ్వరరావు కొబ్బరి లోడింగ్‌ కూలీ పని చేసుకుంటూ భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు మహేష్, దుర్గాప్రసాద్‌ను చదివిస్తున్నాడు. మహేష్‌ డిగ్రీ చదువుతుండగా దుర్గాప్రసాద్‌ ఇంటర్‌ పూర్తి చేశాడు.

 కొంతకాలంగా వేరే మహిళతో నాగేశ్వరరావు సహజీవనం చేస్తున్నాడు. దీంతో ఆ కుటుబంలో కలతలు రేగాయి. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే గురువారం ఉదయం కొబ్బరి లోడింగ్‌ పనికి వెళ్లిన నాగేశ్వరరావు సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో ఫోన్‌ చేశారు. ఎంతకీ స్పందించకపోవడంతో ఆందోళన చెందారు. చివరకు నాగేశ్వరరావు కొత్తపేటలో ఉన్నట్టు తెలుసుకుని అతని తల్లి సత్యవతి, భార్య వెంకటలక్ష్మి, పెద్ద కుమారుడు మహేష్‌ అతని వద్దకు వెళ్ళి మాట్లాడారు. అనంతరం తిరిగి వస్తుంటే ప్రమాదానికి గురయ్యారు. డిగ్రీ చదువుతున్న మహేష్‌ కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్నామని సమీప బంధువులు అప్పన రామకృష్ణ, సత్యకిషోర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top