స్కూళ్లలో ఇకపై రెండు సెమిస్టర్ల విధానంలో పాఠ్య పుస్తకాలు

Textbooks in schools now in two semester system Andhra Pradesh - Sakshi

1 నుంచి 9 తరగతులకు వచ్చే ఏడాది నుంచి అమలు

2024 – 25లో 10వ తరగతికి అమలు

2 సెట్లుగా పాఠ్యపుస్తకాల ముద్రణ

స్కూళ్లు తెరిచిన రోజే అన్ని పుస్తకాలు పంపిణీ

సగానికి తగ్గనున్న బ్యాగు బరువు

చదువుకోవడమూ సులువు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాఠశాలల విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2 సెమిస్టర్ల విధానంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023 – 24 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 9 వ తరగతి వరకు ఈ పాఠ్య పుస్తకాలు అందిస్తారు. 2024 – 25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులకు కూడా ఇదే విధానంలో పాఠ్య పుస్తకాలు అందుతాయి. వీటిని మిర్రర్‌ ఇమేజ్‌లో బైలింగ్యువల్‌ (ద్విభాషా) విధానంలో ముద్రించి ఇస్తారు.

ఇలా రెండు సెమిస్టర్ల విధానంలో పుస్తకాలు ఇవ్వడం వల్ల విద్యార్థుల బ్యాగు బరువు సగం మేర తగ్గుతుంది. విద్యార్థులు కూడా సులభంగా చదువుకోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం పాఠశాల విద్యలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎస్సీఈఆర్టీ దశలవారీగా సిలబస్, పాఠ్య పుస్తకాలను సవరిస్తోంది. దీని కోసం దేశ, విదేశాల్లో ఉన్నత విధానాలపై అధ్యయనం చేసింది.

ఎన్సీఈఆర్టీ, ఇతర రాష్ట్ర బోర్డుల పాఠ్యాంశాలు, సిలబస్‌ను సమగ్రంగా అధ్యయనం చేసి ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్కరణలు తీసుకువచ్చారు. 2020 – 2021 విద్యా సంవత్సరం నుండి ’ట్రైమెస్టర్‌ (మూడు) సిస్టమ్‌తో ద్విభాషా ఆకృతిలో 1 నుండి 5వ తరగతులకు పాఠ్యపుస్తకాలను, రెండు సెమిస్టర్‌ విధానంలో 6వ తరగతి పాఠ్య పుస్తకాలను అందించారు.

7, 8 తరగతులకు కూడా 2021 – 22 విద్యా సంవత్సరం నుండి రెండు సెమిస్టర్‌ విధానంలో పుస్తకాలు ఇచ్చారు. అయితే, వివిధ వర్గాలు, నిపుణుల అభిప్రాయాలను అనుసరించి క్షేత్ర స్థాయిలో కూడా పరిశీలన చేసి టర్మ్‌ ఆధారిత సిలబస్‌ పాఠ్య పుస్తకాలలో ఏకరీతి నమూనాను అనుసరించాలని ఎస్సీఈఆర్టీ ఓ నివేదిక ఇచ్చింది. ఈ విధానం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది.

ఎస్సీఈఆర్టీ నివేదిక అన్ని తరగతులకు రెండు సెమిస్టర్ల విధానంలో పాఠ్య పుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ బి.ప్రతాప్‌ రెడ్డి శనివారం విడుదల చేసిన సర్క్యులర్‌లో వివరించారు. రెండు సెమిస్టర్ల పుస్తకాలను ఒకేసారి పాఠశాలలు తెరిచే రోజునే విద్యార్థులకు పంపిణీ చేస్తారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top