చూపులేని విద్యార్థుల కోసం దృష్టి లైబ్రరీని
అభివృద్ధి చేసిన ట్రిపుల్–ఐటీ హైదరాబాద్
పీజీ దాకా విద్యా సంబంధ పాఠ్యాంశాలు బ్రెయిలీ, ఆడియోబుక్ ఫార్మాట్లలో అందుబాటులోకి
తెలుగు సహా 12 భాషల్లో పాఠ్యాంశాలు..
త్వరలోనే పోటీ పరీక్షల సిలబస్ కూడా..
సాక్షి, హైదరాబాద్: సాధారణ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు చదవడం మామూలు విషయమే. కానీ చూపులేని విద్యార్థులకు మాత్రం అదో పెద్ద ప్రహసనం. బ్రెయిలీ లిపిలో అందుబాటులో ఉన్న పుస్తకాలను చదవడమే వారికి వీలవుతుంది. ఒకవేళ బ్రెయిలీలో నూతన ఎడిషన్లు అందుబాటులో లేకపోయినా, పేలవమైన ఆడియో రికార్డింగ్‌లు ఉన్నా లేక ఖరీదైన సాఫ్ట్‌వేర్లు అవసరమైనా వారు సర్దుకుపోవాల్సి ఉంటుంది.
అయితే ఈ సమస్యకు హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్–ఐటీ) పరిష్కారం చూపించింది. కృత్రిమ మేధ (ఏఐ), భాషా సాంకేతికతల ఆధారంగా ‘దృష్టి’పేరుతో డిజిటల్ ల్రైబరీని అభివృద్ధి చేసింది. పూర్తిగా ఉన్నత విద్యా సంబంధ పాఠ్యపుస్తకాలను బ్రెయిలీ, ఆడియోబుక్ ఫార్మాట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎలా పనిచేస్తుందంటే..: దృష్టి లైబ్రరీలో ఉపయోగించేఆప్టికల్ క్యారెక్టర్ రికగి్నషన్ (ఓసీఆర్) వ్యవస్థ.. బొమ్మలు, డాక్యుమెంట్లు, పీడీఎఫ్ రూపంలో ఉన్న పాఠ్యాంశాలను స్కాన్ చేసి చూపులేని విద్యార్థులకు అను కూలమైన ఫార్మాట్లలో వాటిని అందిస్తుంది. అంటే వాటిని బ్రెయిలీ లిపితో కూడిన అక్షరాలుగా మారుస్తుంది. అలాగే టెక్స్ట్‌టు స్పీచ్ టూల్స్‌ను ఉపయోగించి ఆయా పాఠ్యాంశాలను ఆడియోబుక్స్‌లాగా మార్పిడి చేస్తుంది. ట్రిపుల్ ఐటీ అభివృద్ధి చేసిన రీడర్ అప్లికేషన్ ద్వారా ఆడియోబుక్స్‌ను దృష్టి లైబ్రరీ అందిస్తుంది.
12 భాషల్లో..: ప్రస్తుతం దృష్టి లైబ్రరీలో తెలుగుతోపాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, పంజాబీ, తమిళం, ఒడియా భాషల్లో పాఠ్యాంశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాఠ్యపుస్తకాలన్నింటినీ చూపులేని వారు సౌకర్యవంతంగా యాక్సెస్ చేసేందుకు వీలు కలగనుంది. అలాగే శ్రవణ అనుభవాన్ని సైతం పొందేందుకు వీలవనుంది. అంతేకాకుండా ఆడియో వేగాన్ని నచ్చినట్లుగా నియంత్రించడంతోపాటు బుక్‌మార్క్‌లు, పర్సనలైజ్ సెట్టింగ్స్, వాయిస్ ఆదేశాలతో నావిగేట్ చేసుకోవడం వీలవుతుంది.
చూపులేని విద్యార్థులు, ఆయా విద్యాసంస్థలకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు వీలుగానే పరిశోధకుడు కృష్ణ తులసియన్ ట్రిపుల్–ఐటీ హైదరాబాద్‌లో ‘దృష్టి లైబ్రరీ’ని అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్ సీవీ జవహర్, ప్రొఫెసర్ గురుప్రీత్ సింగ్ లెహల్ మార్గదర్శకత్వంలో ఈ ప్రక్రియ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఏఐ ఆధారిత భాషా వేదిక ‘భాషిణి’సాయంతో దీన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ‘దృష్టి’ప్ర«దానంగా యూజీ, పీజీ పాఠ్య పుస్తకాలనే అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన పాఠ్యాంశాలు, పుస్తకాలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
వినియోగం ఉచితమే..
అంధుల పాఠశాలలు, అభ్యాసకులు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఎక్కడున్నా కంటెంట్‌ను పొందేందుకు వీలుగా ‘దృష్టి’ని అభివృద్ధి చేశాం. ఖరీదైన సాఫ్ట్‌వేర్‌లను కొనాల్సిన అవసరం లేకుండా ఉచితంగా వాటిని అంధ పాఠశాలలకు అందిస్తాం. – ప్రొఫెసర్ గురుప్రీత్ సింగ్ లెహల్
కంటెంట్‌ను అందించొచ్చు..
దృష్టి డిజిటల్ లైబ్రరీని ఓపెన్ ప్లాట్‌ఫాంపై రూపొందించడం వల్ల చూపులేని విద్యార్థులకు అవసరమైన కంటెంట్‌ను ఎన్జీవోలు, వలంటీర్లు, విద్యాసంస్థలు అందించేందుకు వీలవుతుంది. ఈ లైబ్రరీని విస్తరించాలంటే అందుకు అందరి తోడ్పాటు అవసరం. – ప్రొఫెసర్ జవహర్


