ఆంగ్ల వికీపీడియాకు దీటుగా..‘తెలుగు ‘వికీ’కి వందనం!..

Telugu Wikipedia as successor to English Wikipedia - Sakshi

ఆంగ్ల వికీపీడియాకు దీటుగా ‘తెలుగు వికీ’ 

ఉభయ రాష్ట్రాల్లోని జిల్లా పునర్వ్యవస్థీకరణ సమగ్ర సమాచారం నిక్షిప్తం 

27 వేల రెవెన్యూ గ్రామాల వివరాలతో తెలుగు వికీపీడియా బలోపేతం 

సాక్షి, అమరావతి: మనకు ఏదైనా సమాచారం అవసరమైతే మొదటగా వెదికేది వికీపీడియా. ప్రపంచంలో ఎటువంటి సమాచారాన్నైనా ఒక్క క్లిక్‌తో మనకు అందిస్తుంది వికీపీడియా. ఇప్పుడు వికీపీడియా తెలుగులోనూ విశ్వ విజ్ఞానాన్ని అందిస్తోంది. మధురమైన తెలుగు భాషను ప్రపంచానికి పరిచయం చేస్తూనే.. ప్రపంచ విశేషాలను తెలుగు వారికి అందిస్తోంది ‘తెలుగు వికీపీడియా’. తొలినాళ్లలో ఎవరూ గుర్తించని ఈ ‘అద్భుత తెలుగు సమాచార వేదిక’ ఆంగ్ల వికీపీడియాను సైతం అధిగమిస్తోంది.

దేశంలోని ఇతర భారతీయ భాషల వికీపీడియాలు కూడా ఇవ్వలేనంతగా తెలుగులో ఖచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని సమకూరుస్తోంది. ఈ క్రమంలోనే 2016లో తెలంగాణలో, తాజాగా ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత వాటి భౌగోళిక సరిహద్దుల వివరాలను ఒకచోట చేర్చి సమగ్రమైన రూపాన్ని తెలుగు వికీపీడియన్లు అందించడం విశేషం. 2003లో డిసెంబర్‌ 10న తెలుగు వికీపీడియా అందుబాటులోకి వచ్చినప్పటికీ, 2006 నుంచి పూర్తిస్థాయిలో సమాచారాన్ని అందిస్తోంది. 

27వేలకుపైగా గ్రామాల సమాచారం 
ఆంగ్ల వికీపీడియాలో వేలాది మంది లక్షల వ్యాసాలు రాస్తుంటారు. కానీ తెలుగు వికీపీడియాలో రాసే వాళ్లను వేళ్లపై లెక్కించవచ్చు. ఐతేనేం.. ఆ కొద్దిమందే సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో 27 వేలకు పైగా రెవెన్యూ గ్రామాలు, వాటి మండలాలు, జిల్లాలపై వ్యాసాలు రాయడం ఒక చరిత్ర. ఈ సమాచారం ఒక్క తెలుగు వికీలో తప్ప ఎక్కడా లభించదు. ఈ మొత్తం సమాచారాన్ని ముద్రిస్తే 60 వేల పేజీల గ్రంథం అవుతుంది. దీనిని ఎవరైనా ఉచితంగా వినియోగించుకోవచ్చు. 

అడ్మిన్ల పర్యవేక్షణలో.. 
తెలుగు వికీపీడియాలో ఖచ్చితమైన సమాచారానికి మాత్రమే చోటు లభిస్తుంది. ఔత్సాహికుల్లో అనుభవజ్ఞులు అడ్మిన్లుగా వ్యవహరిస్తూ నిత్యం వ్యాసాలను పరిశీలిస్తుంటారు. పొరపాట్లు ఉంటే వాటిని సరి చేస్తూ పాఠకులకు చేరవేస్తున్నారు. ఇక్కడ ఓటింగ్‌ ద్వారా అడ్మిన్లను ఎంపిక చేయడం, అవసరమైతే తొలగించడం కూడా చేస్తారు. తెలుగు వికీలో 14 మంది అడ్మిన్లుగా పని చేస్తున్నారు. ప్రపంచంతో పాటు భారతదేశ రాష్ట్రాలు, జిల్లాల సమాచారం తెలుగులో అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల అనువాద వ్యాసాలను కూడా పెంచుతున్నారు. 

మీరూ వికీపీడియన్‌ కావొచ్చు 
వెబ్‌సైట్‌లో ఖాతాను సృష్టించుకోవడం లేదా గెస్ట్‌గా అయినా ఎవరైనా వికీపీడియన్‌గా మారవచ్చు. ఎటువంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పెన్‌నేమ్‌తో కూడా వ్యాసాలు అందించవచ్చు. కొత్తగా వచ్చిన వారికి ఒక గురువును కూడా జత చేస్తారు. వారి సూచనలతో నెమ్మదిగా అక్షర దోషాలను గుర్తించడం, వ్యాసాలు రాయడం అలవాటు చేస్తారు. ప్రతి వికీపీడియా వ్యాసానికి ప్రత్యేక శైలి ఉంటుంది. దానిని అనుసరించే వ్యాసాలు రాయాలి. మారుమూల గ్రామాల్లోని విశేషాలు, సంస్కృతితో పాటు ఎవరైనా సామాజిక కోణంలో స్వయంగా తీసిన ఫొటోలు కూడా 
పొందుపరచవచ్చు.  

ముఖ్యంగా ఇవి.. 
► ఆంగ్ల వికీలో ఇప్పటి వరకు 66.10లక్షల వ్యాసాలు నాలుగు బిలియన్లకుపైగా పదాలతో ఉన్నాయి. నిత్యం ఎన్నో అప్‌డేట్‌లు వస్తున్నాయి 

► కానీ, తెలుగు వికీలో సమాచారం ఆశించినంత స్థాయిలో లేదు. తెలుగులో 80,778 వ్యాసాలు మాత్రమే ఉన్నాయి. 

► వాస్తవానికి వందల సంఖ్యలో ఔత్సాహికులు స్వచ్ఛందంగా తెలుగు వికీపీడియాకు వ్యాసాలు రాస్తుండగా,  ఇందులో నిత్యం పని చేసే వారు 50 మంది లోపే. 

► తెలుగు వికీపీడియన్లలో రిటైర్డ్‌ ఉద్యోగులు, ఔత్సాహిక తెలుగు ప్రేమికులు, గృహిణులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, విద్యార్థులు ఇలా అనేక వర్గాలు పని చేస్తూ తెలుగు పరిరక్షణకు కృషి చేస్తున్నారు. 

► 2014లో విజయవాడలో జరిగిన తెలుగు వికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 80 మంది వికీపీడియ­న్లు హాజరయ్యారు. ఇందులో 20 మంది ఇతర భా­షల వారు ఉన్నారు. 2015లో తిరుపతిలో జరి­గి­న 11వ వార్షికోత్సవంలో 80 మంది వరకు పా­ల్గొన్నారు.

మరింత బలోపేతానికి కృషి 
నేను ప్రైవేటుగా ఉద్యోగం చేస్తూ తెలుగు వికీపీడియాకు పని చేస్తున్నాను. ప్రభుత్వాలు విడుదల చేసిన డేటాపై ఆధారపడి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వాడి జిల్లాలు, మండలాల సరిహద్దులు, మ్యాపులను స్వయంగా తయారు చేశాం. ఈ పేజీల్లో రాసిన ప్రతి అంకె, ప్రతి సమాచారమూ ఖచ్చితత్వంతో ఉండేలా చూస్తాం. ఆధారాన్ని ప్రతి పేజీలోనూ మూలాలుగా చూపిస్తాం. అంతేకాదు.. ఏ పేజీలోనైనా ఏదైనా సమాచారం తప్పుగా ఉందనో, అసలు లేదనో మీరు గమనిస్తే, మీరే స్వయంగా మార్పులు చెయ్యవచ్చు. తెలుగు వికీపీడియాలో ఉన్న సమాచారానికి కాపీరైట్‌ ఉండదు. తెలుగు వికీపీడియా బలోపేతానికి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. 
– పవన్‌ సంతోష్, తెలుగు వికీపీడియన్, విజయవాడ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top