Jawan Sai Teja: రేగడపల్లె ముద్దుబిడ్డ.. నిను మరువదు ఈ గడ్డ!

Telugu Jawan Sai Teja Deceased Bipin Rawat Chopper Crash At Tamilnadu - Sakshi

లాన్స్‌నాయక్‌ సాయితేజ కన్నుమూత

విధి నిర్వహణలో హెలికాప్టర్‌ ప్రమాదం 

రక్షణ విధుల్లోనే తుదిశ్వాస 

స్వగ్రామంలో విషాద ఛాయలు  

రేగడపల్లె.. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఓ కుగ్రామం. భరతమాత ముద్దుబిడ్డకు జన్మనిచ్చిన ఈ పల్లె ఇప్పుడు మౌనంగా రోదిస్తోంది. దేశానికే భద్రత కల్పించే అధికారికి రక్షణ కవచంగా నిలిచిన ఓ వీరుడు ఊహించని ప్రమాదంలో కన్నుమూయగా, నా బిడ్డడేనని గర్వంగా చాటుతోంది. మూడు పదుల వయసు కూడా లేని యువకుడు.. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి దేశం తలెత్తుకునే స్థాయికి ఎదిగి ఈ నేలలోనే ఒదిగిపోయాడు. విధి నిర్వహణలోనే∙వీర మరణం పొందాడు. దీంతో సొంతూరు కన్నీరు పెడుతోంది. దేశ సేవకు నడుంబిగించిన బి.సాయితేజ(27) అకాల మరణంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 

బి.కొత్తకోట: తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో బుధవారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో లాన్స్‌నాయక్‌ బి.సాయితేజ మృత్యువాత పడ్డారు. దేశ భద్రత పర్యవేక్షించే సీడీఎస్‌ చీఫ్‌ సెక్యూరిటీ అధికారి అయిన ఈ యువ జవాను మృతితో స్వగ్రామం రేగడపల్లె కన్నీటి పర్యంతమవుతోంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన బి.మోహన్, బి.భువనేశ్వరి దంపతులకు బి.సాయితేజ, బి.మహేష్‌బాబు సంతానం.

సాయితేజ స్థానికంగానే చదువుకున్నాడు. 10వ తరగతి పూర్తి కాగానే దేశానికి సేవ చేయాలనే తపనతో సైన్యంలో చేరాడు. డిగ్రీ పూర్తి చేసి గుంటూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్స్‌కు హజరై 2012లో సైనికుడిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పారా కమెండో పరీక్ష రాసి ఉత్తీర్ణతతో 11వ పారా లాన్స్‌ నాయక్‌ హోదా దక్కించుకున్నాడు. చీఫ్‌ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) ఏర్పాటయ్యాక తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌కు వ్యక్తిగత భద్రతాధికారిగా పనిచేస్తున్నాడు. 

రోజూ 10 కి.మీ రన్నింగ్‌ 
ఢిల్లీలో ఉన్నా, రేగడలో ఉన్నా సాయితేజ ప్రతిరోజు ఉదయం 10 కిలోమీటర్లు రన్నింగ్‌ చేసేవాడు. శరీర దృఢత్వానికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం చూసి ఊరే ఆశ్చర్యపోయేది. క్రికెట్‌ అడటమంటే కూడా ఎంతో ఇష్టం. గ్రామానికి చెందిన యువకులను క్రికెట్‌ టోర్నమెంట్లకు పంపుతూ ప్రోత్సహించేవాడు. ఎక్కడ క్రీడలు జరుగుతున్నా పాల్గొనేవాడు. రేగడలో ఉన్నన్ని రోజులు  అందరితో కలసిమెలిసి ఉండటమేకాదు ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించేవాడని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు.

మంచి మిత్రుడు  
రేగడపల్లెకు చెందిన సాయితేజ, నేను మంచి స్నేహితులం. సాయితేజ 2012లో సైన్యంలో చేరగా, నేను 2014లో సీఆర్‌పీఎఫ్‌లో చేరా. ఇద్దరం ఒకేసారి సెలవులు తీసుకొని స్వగ్రామానికి వచ్చేవాళ్లం. నెలరోజులు ఎంతో సందడిగా గడిచిపోయేది. సాయితేజ మరణం నన్ను కలచివేస్తోంది. 
– వై.మనోజ్‌కుమార్‌రెడ్డి, సీఆర్‌పీఎఫ్‌ జవాను, రేగడపల్లె  

దేశ సేవలోనే ఇద్దరు కుమారులు 
పిల్లలు కళ్లముందే ఉండాలి.. కంటికి రెప్పలా చూసుకోవాలి.. పిల్లాపాపలతో ఇల్లు కళకళలాడాలి.. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఈ సంతోషమే. కానీ బి.మోహన్, బి.భువనేశ్వరి దంపతులు తమ కంటిపాపలను దేశ సేవకు అంకితం చేశారు. గొప్పగా బతికే ధనధాన్యాలు లేకపోయినా.. దేశానికే రక్షణ కల్పించే తమ బిడ్డలను చూసి ఉప్పొంగిపోయారు. ఉన్న ఇద్దరు పిల్లలు సైన్యంలో చేరగా.. పెద్ద కొడుకు రక్షణ విధుల్లోనే కన్నుమూశాడు. ఆ వీరునికి జన్మనిచ్చిన దంపతులను చూసి ఆ ఊరంతా ఒక్కటై వచ్చి ఓదారుస్తోంది.

ఊరు ఊరే కదిలింది.. 
ఆ ఊరి పిల్లోడు హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించాడనే సమాచారం తెలియగానే ఊరు ఊరే సాయితేజ ఇంటి వద్దకు చేరింది. అప్పటికే విషయం తెలిసి కుప్పకూలిన జవాను తల్లిదండ్రులు బి.మోహన్, బి.భువనేశ్వరికి కుటుంబ సభ్యులై ఓదార్చారు. రక్షణ విధుల్లో తలమునకలయ్యే సాయితేజ సెలవుల్లో గ్రామానికి వచ్చినప్పుడు తలలో నాలుకగా మెలుగుతూ అందరి ఆప్యాయత చూరగొన్నాడు. అలాంటి తమ ఊరి ముద్దుబిడ్డ ఇకలేడంటే ఇప్పటికీ ఆ ఊరు నమ్మలేకపోతోంది. 

ఏం జరిగిందో తెలియక...
ఎప్పుడూ లేనిది ఇంటికి ఎవరెవరో వస్తున్నారు.. తల్లి శ్యామల గుక్కపట్టి ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తున్నారు. ఏం జరిగిందో తెలియక చిన్నారులు మోక్షజ్ఞ, దర్శిని అందరి ముఖాల్లోకి దీనంగా చూస్తున్నారు. ఈ దృశ్యం చూసి కన్నీరుకార్చని హృదయం లేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top