డీఎస్సీలో నిబంధనలకు పాతర..
బూటకంగా మారిపోయిన డీఎస్సీ–2025
మెరిట్, రిజర్వేషన్ అమలులోనూ అక్రమాలు
ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు.. రిజర్వేషన్ పోస్టుల్లో భర్తీ
నష్టపోయిన రిజర్వుడు అభ్యర్థులు
హారిజాంటల్ రిజర్వేషన్ అమలులోనూ ఉల్లంఘన
జీవో నం.77ను పాటించని వైనం
‘మెరిట్’పై సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం బేఖాతర్
అభ్యర్థుల మెరిట్ లిస్టుల తయారీలోనూ తప్పులే..
దారుణాలను దాచేసి బాధితులపై దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: టీచర్ పోస్టుల భర్తీపైనే సీఎం తొలి సంతకం... మెగా డీఎస్సీ–2025.. అంటూ ఆశలు రేకెత్తించిన చంద్రబాబు సర్కారు నయ వంచనకు పాల్పడిందని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభకు పాతరేసి నచ్చినట్లు ఉద్యోగాలు ఇచ్చారని మండిపడుతున్నారు. కటాఫ్ మార్కులు ప్రకటించకుండా.. వారిచ్చిందే ర్యాంకు, చెప్పిన వారికే ఉద్యోగం అన్న చందంగా డీఎస్సీని మార్చేశారని అర్హులు ఆవేదన చెందుతున్నారు. జీవో నం.77 ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ అమలును సరిగా అర్థం చేసుకోవడం లేదని ప్రభుత్వం చెబుతుండటాన్ని తప్పుబడుతున్నారు. నిజానికి పాలకులే ఈ జీవో అమలును తుంగలో తొక్కేశారని అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.
ఓపెన్ మెరిట్‌లో కటాఫ్ మార్కులు లేకుండా, రిజర్వేషన్ ప్రకారం కటాఫ్ ప్రకటించకుండా ఉద్యోగాలు ఇచ్చేశారని పేర్కొంటున్నారు. నిరుద్యోగులను దగా చేసి డీఎస్సీపై న్యాయస్థానాలను సైతం ప్రభుత్వం తప్పుదోవ పట్టించడంపై విస్తుపోతున్నారు. నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే తప్పుడు ప్రచారాలకు వంత పాడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్ ప్రకారం జరగాల్సిన ప్రక్రియను ప్రభుత్వ పెద్దలకు నచ్చినట్లు మార్చేశారని, హారిజాంటల్ రిజర్వేషన్ అమలులో యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడ్డారని అభ్యర్థులు చర్చించుకుంటున్నారు.
కటాఫ్ మార్కులు ఎందుకు ప్రకటించలేదు?
మెగా డీఎస్సీ–2025 నిర్వహణను అడుగడుగునా దారి తప్పించారు. జిల్లా ఎంపిక కమిటీలను నీరుగార్చి ప్రక్రియను పూర్తిగా రాష్ట్ర స్థాయిలో తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. పరీక్ష ముగిశాక రాసిన అభ్యర్థులందరితో కామన్ మెరిట్ లిస్టు విడుదల చేయాల్సి ఉన్నా పలు దఫాలు ‘టెట్’ మార్కులు ‘ఎడిట్’ చేశారు. డీఎస్సీలో వచ్చిన మార్కులతో కలిపి మార్పులు చేర్పులు చేశారు. దీంతో మొదట మెరిట్‌లో ఉన్న ర్యాంకులు తలకిందులైపోయాయి.
చివరిగా ఇచ్చిన మెరిట్ లిస్టుల్లోనూ ఓపెన్ ‘కటాఫ్’, సామాజిక వర్గాల ఆధారంగా మెరిట్ కటాఫ్ మార్కులు ఎక్కడా ప్రకటించిన దాఖలాలు లేవు. వివిధ సామాజిక వర్గాల రిజర్వేషన్లలో కేటగిరీల వారీగా నోటిఫికేషన్‌లో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లు్యఎస్, ఓసీ అభ్యర్థుల మెరిట్‌ను సైతం విడుదల చేయాలి. తర్వాత ‘లోకల్ మెరిట్’ ఎంపిక చేపట్టాలి. ఓపెన్ కటాఫ్ కంటే పైన ఉన్న ప్రతిభావంతులను ఓపెన్‌లోనే భర్తీ చేయాలని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశాన్ని జీవో నం.77లోనూ పేర్కొన్నారు. కానీ ఏ విధానం అనుసరించారో, ఎలా చేశారో పరీక్ష రాసిన ఒక్క అభ్యర్థికి కూడా అర్థం కాకుండా చేశారు.
రిజర్వేషన్ వర్తింపులోనూ అన్యాయమే..!
డీఎస్సీలో పోస్టుల ఆధారంగా అమలు చేయాల్సిన వివిధ సామాజిక రిజర్వేషన్లనూ దారి తప్పించారు. మెరిట్‌లో ఉన్న అభ్యర్థులకు రిజర్వేషన్ కేటగిరీలో పోస్టులు ఇవ్వడంతో ఆ మేరకు రిజర్వుడు కేటగిరీలోని మెరిట్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇక హారిజాంటల్ రిజర్వేషన్ అమలులోనూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వంద శాతం పోస్టుల్లో కచ్చితంగా 33 శాతం పోస్టులను మహిళలకు కేటాయించాలి. 33 శాతం కంటే మహిళలు తగ్గితే ‘హారిజాంటల్ రిజర్వేషన్’ను పరిశీలించి తగ్గిన మహిళల సంఖ్య ఆధారంగా అంతే సంఖ్యలో అత్యంత కిందనున్న పురుష అభ్యర్థులను తొలగించి వారిస్థానంలో మెరిట్‌లో ఉన్న మహిళలను ఎంపిక చేయాలి.
ఒకవేళ మహిళా అభ్యర్థులు 33 శాతానికి మించి ఉంటే ‘హారిజాంటల్ రిజర్వేషన్’ వర్తించదు. హారిజాంటల్ రిజర్వేషన్‌లో ఒకటి ఉమెన్, రెండోది స్పెషల్ రిజర్వేషన్. స్పెషల్ రిజర్వేషన్‌లో డిసేబుల్ (4 శాతం), మెరిట్ స్పోర్ట్స్ (3), ఎక్స్ సర్వీస్‌మెన్ (2) శాతం ఎంపిక చేయాలి. వీరిని సామాజిక రిజర్వేషన్‌లో లోకల్ పోస్టులకు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఆయా సామాజిక కేటగిరీలో ఎన్ని పోస్టులు కేటాయించారో చివరిలో ఉన్న అభ్యర్థులను తొలగించి వారి స్థానంలో స్పెషల్ రిజర్వేషన్ అభ్యర్థులను చేర్చాలి. ఒకవేళ స్పెషల్ కేటగిరీ అభ్యర్థి మెరిట్‌లో ఉంటే.. మరో స్పెషల్ కేటగిరీ (హారిజాంటల్) అభ్యర్థికి అవకాశం ఉండదు. ఇవన్నీ పూర్తి చేశాక మాత్రమే అభ్యర్థులకు 1 : 1 నిష్పత్తిలో కాల్ లెటర్లు పంపాలి.
ఓపెన్ మెరిట్, రిజర్వేషన్ మెరిట్, హారిజాంటల్ రిజర్వేషన్ల వర్తింపు పూర్తి చేశాక మెరిట్ ప్రకారం కాల్ లెటర్లు అందుకున్న వారికి అన్ని సర్టిఫికెట్లు పరిశీలన పూర్తిచేసి ఉద్యోగం ఇవ్వాలి. అత్యంత అరుదుగా మాత్రమే తిరస్కరించే ఆస్కారం ఉంటుంది. సర్టిఫికెట్లలో లోటుపాట్లు ఉంటే సరిచేసుకునేందుకు గడువునివ్వాలి. కానీ ఈ డీఎస్సీలో మాత్రం చేసిన తప్పులు, నిబంధనల ఉల్లంఘనను కప్పిపుచ్చేందుకు అత్యంత వేగంగా 148 రోజుల్లో ప్రక్రియను ముగించారు.
1,500 మంది రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం!
సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల మేరకు, నిబంధనల ప్రకారం.. ‘కటాఫ్’కు పైన ఉన్న అభ్యర్థులను తప్పనిసరిగా ఓపెన్ కేటగిరీలోనే భర్తీ చేయాలి. వారిని ఎట్టి పరిస్థితిల్లోనూ రిజర్వేషన్ కేటగిరీలో చేర్చేందుకు ఆస్కారం లేదు. కానీ డీఎస్సీ – 2025లో ప్రభుత్వం ప్రకటించిన మెరిట్ లిస్టునే తీసుకుంటే.. అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో ఎంపిక కావాల్సిన వారిని వివిధ సామాజిక రిజర్వేషన్‌లోని లోకల్ పోస్టుల్లో (80 శాతం) నింపారు. దీంతో రిజర్వేషన్ అభ్యర్థులు మెరిట్‌లో ఉన్నా అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఇలాంటి వారు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 మంది ఉన్నట్టు అంచనా!
విజయనగరం జిల్లాలో ఎస్జీటీ పోస్టుల భర్తీలో ఈ అక్రమాలు కొట్టొచ్చినట్టు బయటపడ్డాయి. 88వ ర్యాంకు నుంచి 101వ ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థులను ‘ఓపెన్ కేటగిరీ’ లోకల్‌లో ఎంపిక చేస్తే.. 87వ ర్యాంకు అభ్యర్థిని ‘బీసీ–ఏ’ లోకల్ పోస్టులో భర్తీ చేశారు. దీంతో బీసీ–ఏ రిజర్వు కేటగిరీ అభ్యర్థి పోస్టు కోల్పోయారు. ఈ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు బీసీ–ఏ లోకల్‌లో 15 ప్రకటించారు. ఈ పోస్టుల్లో హారిజాంటల్ స్పెషల్ రిజర్వేషన్‌కు ఒక్క పోస్టు కేటాయించారు. మిగిలిన 14 బీసీ– ఏలోని మెరిట్ అభ్యర్థులకు ఇవ్వాలి. ఇదే తరహాలో అన్ని సామాజిక కేటగిరీలకు ఇవ్వాలి.
కానీ రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం ఎక్కడా పాటించలేదని అభ్యర్థులు, గతంలో డీఎస్సీ నిర్వహణలో పాల్గొన్న అధికారులు చెబుతున్నారు. ఒక్క విజయనగరం జిల్లాలోనే ఎస్జీటీ కేటగిరీలో నలుగురు రిజర్వుడు అభ్యర్థులు నష్టపోయారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులను రిజర్వుడు పోస్టులో భర్తీ చేయరాదని 2007లో సుప్రీంకోర్టు రాజేశ్‌కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో తీర్పు ఇచ్చింది. అలాగే 2025 డిసెంబర్‌లో రజత్‌యాదవ్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే రకమైన తీర్పు వెల్లడించింది. కానీ వీటిని తుంగలో తొక్కి డీఎస్సీ–2025లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని అభ్యర్థులు పేర్కొంటున్నారు.


