
సాక్షి, విజయనగరం అర్బన్: ఏపీలో కూటమి పాలనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. చంద్రబాబు ప్రభుత్వ పాలనపై సొంతపార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా విజయనగరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుకు బిగ్ షాక్ తగిలింది. వారి పాలన బాగాలేదంటూ నగరంలోని 28వ వార్డు రాజీవ్‌నగర్ కాలనీ టీడీపీ సీనియర్ కార్యకర్త తీగల ఆనందరావు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. తమ కాలనీలోని సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ సమస్యలపై ఏడాదిగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా కనీసం స్పందించలేదన్నారు. కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు మరమ్మతులు చేయాలని, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, సచివాలయ కార్యాలయానికి ప్రభుత్వ భవనం నిర్మించాలని, ప్రభుత్వాసుపత్రి నిర్వహణపై దృష్టిసారించాలని, పార్కులు అభివృద్ధి చేయాలని, వీధి దీపాలు అమర్చాలని, రేషన్ డిపోను ఏర్పాటు చేయాలని కోరినా ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. అందుకే, తమ కాలనీ సమస్యలను బ్యానర్ రూపంలో ప్రదర్శిస్తూ కలెక్టర్‌కు విన్నవించినట్టు తెలిపారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ఇలాంటి ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఒకటేనని వ్యాఖ్యానించారు.