
2024లో చంద్రబాబు నుంచి తంబళ్లపల్లె టీడీపీ అభ్యరి్థగా బి–ఫాం తీసుకుంటున్న జయచంద్రారెడ్డితో ఏ–1 జనార్దన్‌రావు
ఏ–1 జనార్దన్‌రావుతో వీడియో కుట్రలు బూమరాంగ్
చౌకబారు వీడియోతో నవ్వులపాలైన ప్రభుత్వ పెద్దలు
దాంతో పచ్చ సిట్ ద్వారా సరికొత్త పన్నాగం
ఎంపీ మిథున్‌రెడ్డి నివాసం, ఆఫీసుల్లో సోదాలతో హల్‌చల్
కుటుంబసభ్యులు, కంపెనీ ప్రతినిధుల విచారణ
నకిలీ మద్యం మాఫియా ఊడలు కరకట్ట బంగ్లాలోనే..
టీడీపీ నేతల డిస్టిలరీల నుంచే నకిలీ మద్యం యూనిట్లకు స్పిరిట్ సరఫరా.. అడ్డంగా దొరికిపోయిన టీడీపీ సిండికేట్
పోలీసు, ఎక్సైజ్ శాఖలు కన్నెత్తి చూడకుండా కట్టడి
కూటమి సర్కారుపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత
దృష్టి మళ్లించేందుకే టీడీపీ పెద్దల డైవర్షన్ కుట్రలు..
నకిలీ మద్యం పాపం వైఎస్సార్‌సీపీదేనని ప్రచారం చేయండి
కూటమి ఎంపీలకు ఢిల్లీలో క్లాస్ తీసుకున్న చంద్రబాబు
జయచంద్రారెడ్డి ద్వారా వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి ఇదంతా చేయించారంటూ తొలుత ఎల్లో మీడియా రంకెలు..
తమ దాడులతోనే నకిలీ మద్యం రాకెట్ బయట పడిందని స్వయంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు
తాజాగా జోగి రమేష్ ఇదంతా చేయించారంటూ జనార్దన్‌రావుతో వల్లె వేయించిన ప్రభుత్వ పెద్దలు
రిమాండ్ రిపోర్టులో జోగి రమేష్ పేరు ప్రస్తావించని పోలీసులు
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం అవినీతి కూపంలో నిలువెల్లా కూరుకుపోయిన టీడీపీ పెద్దలు సరికొత్త డైవర్షన్ కుతంత్రాలకు పదును పెడుతున్నారు. బరి తెగించి నకిలీ మద్యం దందాకు పాల్పడిన వారే ఆ బురదను అందరికీ అంటించే కుట్రలు పన్నుతున్నారు. అందుకోసం టీడీపీ పెద్దల డైరెక్షన్‌లో చిత్రీకరించిన ‘పొలిటికల్ సోషియో ఫాంటసీ’ కుట్ర ఇప్పటికే బెడిసికొట్టింది. వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌పై దు్రష్పచారం చేసేందుకు పన్నిన కుతంత్రం ఫలించ లేదు.
దాంతో మరోసారి టీడీపీ వీర విధేయ సిట్‌ను రంగంలోకి దించి తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాల పేరిట హడావుడి చేయించారు. టీడీపీ సిండికేట్ కల్తీ మద్యం మాఫియా బాగోతం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ చౌకబారు ఎత్తుగడ వేసినట్లు స్పష్టమవుతోంది. తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి ద్వారా వైఎస్సార్ సీపీ నేత పెద్దిరెడ్డి ఇదంతా చేయించారంటూ తొలుత ఎల్లో మీడియా రంకెలేసింది! అయితే తమ దాడులతోనే నకిలీ మద్యం రాకెట్ బయట పడిందని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.
ఇక ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ ఇదంతా చేయించారంటూ జనార్ధన్‌రావుతో ప్రభుత్వ పెద్దలు చిలుక పలుకులు వల్లె వేయించారు. నిజానికి పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో జోగి రమేష్ పేరు ఎక్కడా లేదు. మరి 24 గంటల తరువాత జోగి రమేష్ పేరు చెబుతూ జనార్ధన్‌రావు వీడియో బయటకు రావడం వెనుక లోగుట్టు ఏమిటి? ఆ వీడియో కుట్ర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాగా నకిలీ మద్యం పాపం వైఎస్సార్‌సీపీదేనని ప్రచారం చేయాలంటూ కూటమి ఎంపీలతో ఢిల్లీలో సమావేశం సందర్భంగా చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.
సోషియో ఫాంటసీ కుట్ర అట్టర్ ఫ్లాప్
టీడీపీ పెద్దలే సూత్రధారులుగా పచ్చ సిండికేట్ సాగిస్తున్న నకిలీ మద్యం రాకెట్ కేసును పక్కదారి పట్టించేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. అడ్డంగా దొరికిపోయిన ప్రతిసారీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడే ప్రభుత్వ పెద్దలు ఈసారి మరీ చౌకబారు ఎత్తుగడ వేసి నవ్వుల పాలయ్యారు. డైవర్షన్ కుట్రలో భాగంగానే ఈ కేసులో ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావుతో చెప్పించిన వీడియో టీడీపీ పెద్దల నేలబారు రాజకీయాన్ని బయటపెట్టింది. ఏం చెప్పాలో పోలీసులే పక్కనుంచి ప్రాంప్టింగ్ అందిస్తుండగా.. జనార్దన్‌రావు వల్లె వేసిన మాటలను చిన్నపిల్లలు కూడా నమ్మడం లేదన్నది స్పష్టమైంది.
ఎల్లో మీడియా ద్వారా విడుదల చేసిన వీడియో డ్రామా టీడీపీ పెద్దల దిగజారుడుతనాన్ని బయటపెట్టింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు జనార్దన్‌రావుతో నిబంధనలకు విరుద్ధంగా వీడియో రికార్డ్ చేయించి విడుదల చేశారన్నది నిగ్గు తేలింది. అంతేకాదు.. ములకలచెరువులో బయటపడిన నకిలీ మద్యం మాఫియా రాష్ట్రమంతా విస్తరించిందన్నది తేటతెల్లమైంది. టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్ కేవలం పాత్రధారులేనని, ఈ వ్యవస్థీకృత దోపిడీకి కర్త, కర్మ, క్రియ అంతా ప్రభుత్వ పెద్దలేనన్నది రూఢీ అయ్యింది.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్దన్ ఏర్పాటు చేసిన నకిలీ మద్యం ప్లాంట్‌లో యంత్రాలు, క్యాన్లు (ఫైల్)
సిట్ ద్వారా మరో డైవర్షన్ డ్రామా...
ఏ 1 జనార్దన్‌రావు వీడియో డ్రామా ఎపిసోడ్ బెడిసికొట్టడంతో ప్రభుత్వ పెద్దలు వెంటనే మరో కుట్రకు పదును పెట్టారు. ఏడాదికిపైగా రెడ్‌బుక్ రాజ్యాంగ కుట్రలు అమలు చేస్తున్న తన సిట్‌ను రంగంలోకి దింపారు. వీడియో డ్రామా ద్వారా జోగి రమేష్‌ను లక్ష్యంగా చేసుకుని భంగపడ్డ టీడీపీ పెద్దలు.. ఈసారి సిట్ ద్వారా వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై గురి పెట్టారు. ఐక్యరాజ్య సమితి సదస్సుల్లో పాల్గొనే భారత పార్లమెంటరీ బృందంలో సభ్యుడిగా మిథున్‌రెడ్డి అమెరికాలో పర్యటించేందుకు అనుమతి కోరుతూ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానున్న తరుణంలో డైవర్షన్‌తో మరోసారి కుట్రలకు తెర తీశారు.
మిథున్‌రెడ్డి కుటుంబానికి చెందిన తిరుపతి, హైదరాబాద్‌లలోని నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు మంగళవారం సోదాలతో హడావుడి చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, కంపెనీ ప్రతినిధులను విచారించారు. వాస్తవానికి మద్యం విధానంపై అక్రమ కేసులో ఆయన్ను గతంలోనే అరెస్టు చేసి కస్టడీకి కూడా తీసుకుని విచారించారు. ఆ అక్రమ కేసులో సిట్ అధికారులు ఎటువంటి ఆధారాలు సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డికి న్యాయస్థానం బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇక ఈ కేసులో ఆయన్నుగానీ పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్ ప్రతినిధులనుగానీ విచారించేందుకు ఏమీ లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
డిస్టిలరీల మాటున నకిలీ దందా..
ఆధారాలతో సహా బట్టబయలైన నకిలీ మద్యం మాఫియాకు ప్రభుత్వ పెద్దలు వత్తాసు పలుకుతూ పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయకుండా కట్టడి చేస్తున్నారు. అసలు నకిలీ మద్యం తయారీకి అవసరమైన ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్) ఎక్కడి నుంచి సరఫరా అయిందన్న అంశంపై పోలీసులు దృష్టి పెట్టకపోవడమే అందుకు నిదర్శనం. ఎందుకంటే.. అత్యంత ప్రమాదకరమైన ఆ స్పిరిట్‌ను కొనుగోలు చేసేందుకు మద్యం డిస్టిలరీలు, రసాయన పరిశ్రమలకే అనుమతి ఉంది.
ఆ స్పిరిట్‌లో 100 శాతం ఉండే ఆల్కహాల్‌ను 42 శాతం లోపు తగ్గించి మనుషులు వినియోగించే మద్యాన్ని తయారు చేసే సామర్థ్యం డిస్టిలరీలకే ఉంటుంది. మరి టీడీపీ సిండికేట్ ములకలచెరువుతోపాటు అనకాపల్లి, పాలకొల్లు, ఇతర ప్రాంతాల్లో నెలకొల్పిన నకిలీ మద్యం యూనిట్లకు స్పిరిట్ ఎక్కడ నుంచి సరఫరా జరిగింది? అనేది అత్యంత కీలకంగా మారింది. అంటే.. డిస్టిలరీలే ఆ స్పిరిట్‌ను కొనుగోలు చేసి అక్రమంగా నకిలీ మద్యం యూనిట్లకు సరఫరా చేశాయని ఎక్సైజ్ వర్గాలే అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ టీడీపీ సీనియర్ నేతల కుటుంబాలకు చెందినవే.
వాటిలో తనిఖీ చేసి రికార్డులు పరిశీలిస్తే మొత్తం బండారం బయటపడుతుంది. అందుకే ఆ డిస్టిలరీలవైపు కన్నెత్తి చూడవద్దని ప్రభుత్వ పెద్దలు పోలీసు, ఎక్సైజ్ శాఖలను ఆదేశించినట్లు తెలుస్తోంది. తద్వారా నకిలీ మద్యం మాఫియా వెనుక ఉన్న టీడీపీ బడా బాబుల బండారం బయటపడకుండా అడ్డుకట్ట వేస్తున్నారన్నది సుస్పష్టం. నకిలీ మద్యం దందాతో అమాయకుల ప్రాణాలను హరిస్తుండటంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపథ్యంలో టీడీపీ పెద్దలు ఇలా డైవర్షన్ డ్రామాలతో కుట్రలకు తెర తీస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జనార్దన్‌రావు ఇంట్లో సోదాలు
ఇబ్రహీంపట్నం : నకిలీ మద్యం నిందితుడు జనార్దనరావు, ఆయన సోదరుడు జగన్‌మోహనరావు ఇళ్లల్లో పోలీసులు మంగళవారం రాత్రి సోదాలు నిర్వహించారు. పోలీసులను వారి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. గంటపాటు మంతనాల తర్వాత లోపలకు అనుమతించారు. మూడు
గంటలపాటు పోలీసులు సోదాలు చేశారు.
ఎంపీ మిథున్‌రెడ్డిపై మళ్లీ కక్ష సాధింపు
సాక్షి, అమరావతి/తిరుపతి : మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ వేధింపులు కొనసాగిస్తోంది. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబ వ్యాపార సంస్థ పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్ కార్యాలయాల్లో సిట్ అధికారులు మంగళవారం హల్‌చల్ చేశారు. హైదరాబాద్, తిరుపతిలోని ఆయన నివాసం, కార్యాలయాలకు వెళ్లిన సిట్ బృందాలు ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులు, కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలకు సంబంధించిన వివరాలు చెప్పాలంటూ పదే పదే అడిగినట్లు సమాచారం.
తిరుపతిలోని ఎంపీ మిథున్‌రెడ్డి నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయన తల్లి పెద్దిరెడ్డి స్వర్ణలత వాంగ్మూలం నమోదు చేశారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు ఇప్పటికే అనేకసార్లు విచారించారు. జుడీషియల్ రిమాండ్‌లో ఉన్నప్పుడు కూడా కస్టడీకి తీసుకుని సిట్ విచారించింది. ఆయనపై అభియోగాలకు ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడి బెయిల్ మంజూరు చేసింది. కానీ ఎంపీ మిథున్ రెడ్డిపై కక్ష సాధింపుతోనే సిట్ మళ్లీ సోదాలు, విచారణ పేరుతో హడావుడి చేస్తోంది.
కూటమి ప్రభుత్వ పెద్దల అండతో సాగుతున్న నకిలీ మద్యం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. అందుకే మిథున్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. అమెరికా పర్యటనకు అనుమతి కోరుతూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్‌పై తీర్పు ఇచ్చే సమయంలో సిట్ సోదాలు చేపట్టడం సందేహాస్పదంగా మారింది. కాగా, ఎంపీ మిథున్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాలు, విచారణపై సిట్ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఇంత జరిగినా.. ‘బెల్టు’ తీయరా..?
జయచంద్రారెడ్డిని అరెస్టు చేయరా?
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నకిలీ మద్యం 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే మొదలైంది. ఏడాదిన్నరగా సాగుతున్న ఈ దోపిడీపై ఎక్సైజ్ శాఖ ఉదాసీనంగా వ్యవహరించడం అసలు గుట్టును బయటపెట్టింది. టీడీపీ పెద్దల కనుసన్నల్లో టీడీపీ సీనియర్ నేతలు ప్రాంతాలవారీ పర్యవేక్షకులుగా మారి పక్కాగా దోపిడీని వ్యవస్థీకరించిన తీరే అందుకు నిదర్శనం. ఇక ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాను రాష్ట్రానికి స్వయంగా తెచ్చింది తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి, టీడీపీ నేతలు సురేంద్ర నాయుడు, అద్దేపల్లి జనార్దన్‌రావులే కావడం గమనార్హం.
ములకలచెరువు కేంద్రంగా మొదలైన ఈ మాఫియా ఏడాదిలో రాష్ట్రం అంతటా విస్తరించడం విస్మయపరుస్తోంది. అడ్డంగా దొరికిన తరువాత ఏ1 జనార్దన్‌రావుతో వీడియో డ్రామాకు యత్నించడం ప్రభుత్వ పెద్దల కుట్రను బట్టబయలు చేసింది. నకిలీ మద్యం మాఫియా కుట్రదారు, అంతిమ లబ్ధిదారు టీడీపీ పెద్దలేనన్న వాస్తవాన్ని ఎంతగా దాచాలని యత్నిస్తే.. అంతగా ఆ అవినీతి బాగోతం బట్టబయలవుతోంది.
జనార్దన్‌రావును విదేశాల నుంచి ఆగమేఘాలపై రాష్ట్రానికి రప్పించిన టీడీపీ పెద్దలు.. జయచంద్రారెడ్డిని ఎందుకు రప్పించడం లేదు? ఆయన్ను అరెస్టు చేసేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు? అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. నకిలీ మద్యం దందా బయటపడిన తరువాత కూడా రాష్ట్రంలో ఊరూరా విస్తరించిన దాదాపు 75 వేల బెల్టు షాపులను నిర్మూలించకపోవడం.. ప్రజల ప్రాణాలను హరిస్తూ అక్కడ విక్రయిస్తున్న నకిలీ మద్యాన్ని జప్తు చేయకపోవడం.. పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపకపోవటాన్ని బట్టి టీడీపీ పెద్దల అండదండలతోనే పచ్చముఠాలు నకిలీ దందాతో చెలరేగుతున్నట్లు స్పష్టమైందని పేర్కొంటున్నారు.