
సాక్షి, విజయవాడ: టీడీపీ లిక్కర్ సిండికేట్ కుట్రకు తెరతీసింది. మద్యం బార్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది. 840 బార్లలో 52 బార్లకే ఆఫ్లికేషన్లు దాఖలయ్యాయి. బార్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు రాకుండా టీడీపీ లిక్కర్ సిండికేట్ అడ్డుకుంది. భారీగా మార్జిన్ పెంచుకునేందుకు టీడీపీ లిక్కర్ సిండికేట్ కుట్రకు తెరతీసింది.
లిక్కర్ సిండికేట్‌కి సరెండర్ అయిన చంద్రబాబు సర్కార్.. 29వ తేదీ వరకు అప్లికేషన్లకు గడువు పెంచింది. మంత్రి వర్గం ఉపసంఘం ద్వారా మార్జిన్ పెంచుకోవడానికి లాబీయింగ్ చేశారు. ఇతరులెవ్వరిని బార్ల కోసం దరఖాస్తు చేసుకొనివ్వకుండా టీడీపీ సిండికేట్ బెదిరింపులకు దిగారు.
ఇంత తక్కువగా దరఖాస్తులు దాఖలు కావడం వెనుక టీడీపీ మద్యం సిండికేట్ వ్యూహాత్మక ఎత్తుగడ దాగుంది. బార్ల దరఖాస్తుల కోసం అయితే ఏకంగా 2,300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ.. వీరిలో తమ సిండికేట్ కాని వారిని గుర్తించిన టీడీపీ నేతలు.. దరఖాస్తు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ పార్టీ గూండాలు, పోలీసు అధికారులతో వారిని బెదిరిస్తున్నారు.
ఇక సిండికేట్‌కు అనుకూలంగా బార్ విధానంలో ముందే మార్పులు చేస్తే తమ దోపిడీ కుట్ర బట్టబయలవుతుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. అందుకే.. తగినంత మంది దరఖాస్తు చేయలేదు కాబట్టి బార్ల యజమానులకు లాభాల మార్జిన్ పెంచుతున్నాం అన్నట్లుగా ప్రజల్ని నమ్మించాలన్నది అసలు తంత్రం. అలాగే, 840 బార్లలో కనీసం 10 శాతం బార్లకు కూడా దరఖాస్తులు రాలేదు కాబట్టి సిండికేట్ దోపిడీకి వీలుగా ఇలా బార్ విధానంలో మార్పులు చేయాలన్నది పచ్చముఠా పన్నాగం.