ఉపాధి గుండెల్లో  అవినీతి గునపం | Sakshi
Sakshi News home page

ఉపాధి గుండెల్లో  అవినీతి గునపం

Published Wed, Aug 12 2020 11:48 AM

TDP Leaders Corruption in Employment Guarantee Scheme Krishna - Sakshi

ఉపాధి హామీ పథకం టీడీపీ నేతలకు కల్పతరువుగా మారిందని మరోసారి రుజువైంది.  పేదల నోటిలో మన్ను కొట్టి.. తమ జేబులు నింపుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. రూ. కోట్లు కొల్లగొట్టారని విజిలెన్స్‌ తనిఖీల్లో తేటతెల్లమైంది. కేవలం ఏడాదిలోనే రూ.16.88 కోట్లు కాజేసినట్లు స్పష్టమైంది.          దీంతో ఈ నగదు రికవరీకి అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదించింది. 

సాక్షి, మచిలీపట్నం: పల్లెల్లో సైడు కాలువల్లో పూడిక తీత నుంచి చెక్‌ డ్యాంల వరకు ప్రతి పనిలో నిబంధనలకు పాతరేస్తూ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను అడ్డగోలుగా వాడేశారు టీడీపీ నాయకులు. సాధారణంగా ఉపాధి వేజ్‌ కాంపోనెంట్‌ నిధులతో చేపట్టే పనులన్నీ పంచాయతీల పర్యవేక్షణలోనే చేపట్టాలి. కానీ కోట్ల విలువైన లక్షలాది పనులు నామినేషన్‌ పద్ధతిలో పప్పూబెల్లాల మాదిరిగా పంచుకుని సొమ్ము చేసుకున్నారు. చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం.. పనులు చేయకుండానే చేసినట్టుగా రికార్డుల్లో నమోదు చేయడం వంటి చర్యలతో రూ. కోట్లు కొల్లగొట్టారు. ఈ తతంగంపై ప్రతిపక్షంలో ఉండగా        

వైఎస్సార్‌ సీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. వైఎస్సార్‌ సీపీ నేతల ఫిర్యాదుల మేరకు 2018–19 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులపై కేంద్రం బ్రేకులేసింది. 
విజిలెన్స్‌ విచారణ 
ఉపాధిలో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చేందుకు అధికారం చేపట్టిన వెంటనే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది.  
2018 అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి 2019 మే 31వ తేదీ వరకు జరిగిన ఉపాధి పనులపై లోతైన విచారణ జరిపింది.  
ఇందుకోసం పంచాయతీరాజ్, ఆర్‌ అండ్‌ బీ, రూరల్‌ డెవలప్‌మెంట్, నీటిపారుదల శాఖలకు చెందిన విజిలెన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌     డిపార్ట్‌మెంట్‌కు చెందిన 8 ప్రత్యేక బృందాల జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేశాయి.  
డ్వామా పీడీ నేతృత్వంలో ఇందుకోసం ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  
2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.171 కోట్ల 82లక్షల 23 వేల 461 విలువైన 1,048 పనులను పరిశీలించారు.  
ఒక్కో బృందం వంద నుంచి 150 పనుల వరకు పరిశీలించాయి. 
ప్రధానంగా పరిశీలించిన వాటిలో రూ.158 కోట్ల 14 లక్షల 43 వేల 674 అంచనాతో నిర్మించిన సీసీ, బీటీ రోడ్లు, రూ.7కోట్ల 80లక్షల 13వేల విలువైన 52 గ్రామ పంచాయతీ భవనాలు, రూ.10.04లక్షలతో నిర్మించిన గ్రామ పార్కులు, రూ.93.52లక్షల అంచనాతో నిర్మించిన 10 సీసీ వాల్స్, రూ.కోటీ 94లక్షలతో నిర్మించిన 20 గోకులంలు, రూ.1.17కోట్లతో నిర్మించిన గ్రావల్‌ సర్ఫేస్‌ రోడ్లు, రూ.29.96లక్షల అంచనాతో నిర్మించిన ఓ రివిట్‌మెంట్‌ ట్యాంక్‌ పనులను పరిశీలించారు.  
ఈ పనుల్లో రూ.16 కోట్ల 87 లక్షల 57వేల 443 అవినీతి జరిగినట్టుగా నిగ్గు తేల్చారు. ఆ మేరకు రికవరీ చేయాలనలి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.  

రికవరీకి నివేదించాం.. 
2018 అక్టోబర్‌ నుంచి 2019 మే వరకు జరిగిన పనులను మాత్రమే పరిశీలించాం. ఇందుకోసం ప్రత్యేక బృందాలతో దాదాపు ఆర్నెల్ల పాటు విచారణ జరిగింది. ఈ విచారణలో నాసిరకం, నాణ్యతా లోపాలే కాక.. పనులు జరగకుండా జరిగినట్టుగా రికార్డుల్లో నమోదైన అవకతవకలు కూడా పెద్ద ఎత్తున వెలుగు చూశాయి. ఆ మేరకు గుర్తించిన రూ.16.88 కోట్లను రికవరీ చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం.  – జీవీ సూర్యనారాయణ, పీడీ, డ్వామా 

Advertisement

తప్పక చదవండి

Advertisement