
పెద్దలందరూ సేఫ్.. చిన్న ఉద్యోగులే బలి
సింహాచలం దుర్ఘటనపై ప్రభుత్వం తూతూమంత్రం చర్యలు
ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రులకు బాధ్యత లేదట!
ఈవో, మరో ఆరుగురు ఇంజినీరింగ్ సిబ్బంది సస్పెన్షన్‌కు నిర్ణయం!
ఇంజినీరింగ్ సిబ్బందిలో కాంట్రాక్టు ఉద్యోగులు కూడా..
కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలకు సిద్ధం!
సాక్షి, అమరావతి: సింహాచలం చందనోత్సవం సందర్భంగా జరిగిన దుర్ఘటనపై ప్రభుత్వ పెద్దలు మంత్రులు కుమ్మకైపోయారు. చివరకు తూతూమంత్రం చర్యలతో సరిపెట్టారు. దేవుడి దర్శనానికి వచ్చి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఏ మాత్రం బాధ్యత తీసుకోలేదు. చిన్న ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల తోపాటు కాంట్రాక్టరును బలి చేసి పెద్దలంతా తప్పుున్నారు. చందనోత్సవ కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలుగురు మంత్రుల కమిటీ రెండు నెలల పాటు వరుసగా సమీక్షలు నిర్వహించి.., గతంలో ఎప్పుడూలేని విధంగా ఉత్సవాల నిర్వహణకు కృషి చేశామని ప్రకటించారు.
ఏప్రిల్ 16వ తేదీన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయలు అధికారులతో సమీక్ష నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చందనోత్సవ నిర్వహణకు చర్యలు తీసుకున్నట్టు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు దుర్ఘటనకు మంత్రుల కమిటీ సభ్యలెవరూ బాధ్యత తీసుకోలేదు. ప్రభుత్వ పెద్దలు సైతం మంత్రివర్గ సహచరులను వెనకేసుకొస్తున్నారు. అంతా అనుకున్నట్లుగానే విచారణ కమిటీ ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా కమిటీ నివేదిక ఇవ్వడం, దాని ఆధారంగా ఈవోతోపాటు చిన్న ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం.. అంతా స్క్రిప్టు ప్రకారమే జరిగిపోయాయి. బాధ్యత వహించాల్సిన మంత్రులు, ప్రభుత్వ పెద్దలు సేఫ్ అయిపోయారు.
వరుస ఘటనలు జరిగితే ప్రభుత్వానికి బాధ్యత ఉండదా..
తిరుమల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి రోజున దర్శన టిక్కెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. ఆ ఘటనను మరవక ముందే ఇటీవల సింహాచలంలో గోడకూలి ఏడుగురు మరణించారు. ఈ రెండు ఘటనల్లోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా.. సర్కారు మాత్రం బాధ్యత తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.
ప్రభుత్వ చర్యలు వీరిపైనే..!
ప్రాథమిక నివేదికలో విచారణ కమిటీ సిఫార్సుల మేరకు ఈవో కె.సుబ్బారావు, ఈఈ డీజీ శ్రీనివాసరాజు, ఏపీటీడీసీ ఈఈ కె.రమణ, డిప్యూటీ ఈఈ కె.ఎస్.ఎన్.మూర్తి, ఏపీటీడీసీ డిప్యూటీ ఈఈ ఏబీవీఎల్‌ఆర్ స్వామి, ఏపీటీడీసీ ఏఈ పి.మదన్ మోహన్ (కాంట్రాక్టు ఉద్యోగి), జేఈ కె.బాబ్జీని సస్పెండ్‌చేయాలని, కాంట్రాక్టర్ కె.లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
అది ఏప్రిల్ 21న మొదలుపెట్టిన గోడే
సింహాచలం ఆలయంలో చందనోత్సవం రోజున కూలిన గోడ నిర్మాణాన్ని పది రోజుల ముందు గతనెల 21న మొదలు పెట్టినట్టు ప్రభుత్వం నియమించిన ముగ్గురు అధికారుల విచారణ కమిటీ నిర్ధారించినట్టు సమాచారం. ఆ కూలిన గోడకు వీపింగ్ హోల్స్ లేకపోవడం ప్రమాదానికి ప్రధాన కారణమని ఆ నివేదికలో వెల్లడించినట్టు తెలుస్తోంది. కనీసం పునాది లేకుండా, కాంక్రీట్ వేయకుండా ఫ్లై యాష్ వినియోగించి 20 మీటర్ల ఆ గోడను నిర్మించారని, నిర్మాణం తరువాత సరిగా క్యూరింగ్ కూడా జరగలేదని పేర్కొన్నట్టు సమాచారం. గోడ నాణ్యతపై దేవదాయ, టూరిజం కార్పొరేషన్ ఇంజినీర్లు సర్టిఫై చేయలేదని తెలుస్తోంది. దీంతో భారీ వర్షం వల్ల గోడ కూలిందని కమిటీ ప్రాథమిక నివేదికలో తేల్చినట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఘటనపై పూర్తి స్థాయి సమగ్ర నివేదికను 30 రోజుల్లో సమర్పించాలని ప్రభుత్వం విచారణ కమిటీని ఆదేశించిన విషయం తెలిసిందే.
దేవస్థానం డబ్బుతోనే పరిహారం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. సింహాచలం ఆలయంలో గోడ కూలి మృతిచెందిన వారి కుటుంబాలకు పరిహారం మొత్తం రూ.1.75 కోట్లను, గాయపడిన వ్యక్తికి రూ.3లక్షలను దేవస్థాన ఖజానా నుంచే చెల్లింపులు చేసింది. పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు పైసా విదల్చలేదు. దేవస్థాన నిధుల నుంచే చెల్లింపులు జరగడంపై ఆలయవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.