ఇంటివద్ద పింఛన్ల పంపిణీకి ఎసరు! | TDP coalition government is gradually cracking down on pension distribution | Sakshi
Sakshi News home page

ఇంటివద్ద పింఛన్ల పంపిణీకి ఎసరు!

Mar 2 2025 4:03 AM | Updated on Mar 2 2025 4:03 AM

TDP coalition government is gradually cracking down on pension distribution

లబ్దిదారుని ఇంటికి 300 మీటర్ల పరిధిలో ఎక్కడైనా పంపిణీకి ప్రభుత్వం అనుమతి

అనేకచోట్ల లబ్దిదారులను ఒకచోటకి పిలిపించి పంపిణీ 

రోడ్ల మీదే లబ్ధిదారులను నిలబెట్టి అందజేత 

పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎండలో నిరీక్షణ 

టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక 2.06 లక్షల పింఛన్లు తగ్గుదల 

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ప్రతినెలా లబ్దిదారుల ఇళ్ల వద్దనే విజయవంతంగా కొనసాగిన పింఛన్ల పంపిణీకి టీడీపీ కూటమి ప్రభుత్వం క్రమంగా తూట్లు పొడుస్తోంది. లబ్దిదారుని ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలో ఎక్కడైనా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి తెలపడంతో శనివారం రాష్ట్రంలో అనేకచోట్ల లబ్దిదారులను ఒకచోటకు పిలిపించుకుని పంపిణీ చేశారు. 

లబ్దిదారుని ఇంటి వద్ద కాకుండా వేరేచోట పింఛను పంపిణీ చేసేటప్పుడు నిర్ణీత కారణాన్ని మొబైల్‌ యాప్‌లో నమోదుచేసి డబ్బులు పంపిణీ చేయవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో సిబ్బంది దీనిని తమకు అనుకూలంగా మలుచుకున్నారు.  

సాధారణంగా.. అత్యధిక గ్రామాల్లో 2,000 మంది లోపే జనాభా నివాసం ఉంటారు. అంటే.. ఆయా గ్రామాల మొత్తం విస్తీర్ణం కూడా ఆ 300 మీటర్ల పరిధిలోపే ఉండే అవకాశం ఉండడంతో ప్రభుత్వం లబ్దిదారులను ఒకచోటకు పిలిపించే కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది.   

ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరీక్షణ.. 
కర్నూలు జిల్లా కోసిగి సచివాలయం–4 పరిధిలోని సిద్దప్పపాళెం సూగూరేశ్వర దేవాలయం వద్ద పింఛన్లు అందించారు. అలాగే, కోసిగికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని పీకలబెట్ట పొలాల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్న లబ్దిదారులు సచివాలయం–2 వద్ద ఉ.9 నుంచి సా.4.30 గంటల వరకు తిండితిప్పలు మానుకుని పడిగాపులు పడ్డారు. ప్రతినెలా ఇలాగే అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. 

ఇక విజయవాడ వన్‌టౌన్, ఏలూరు తూము సెంటర్‌లో లబ్ధిదారులు పింఛన్ల కోసం మండేఎండలో నిరీక్షించారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో కూడా లబ్దిదారులందరినీ రోడ్డు మీదే నిలబెట్టి పెన్షన్లు అందజేశారు. జగనన్న హయాంలో తెల్లవారకముందే ఇంటికొచ్చి డబ్బులు ఇచ్చేవారని.. కానీ ఇప్పుడు ఎక్కడ, ఎప్పుడిస్తారోనని ఎదురుచూడాల్సి వస్తోందని వారంతా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. 

ఆడియో ప్రచారంతో పంపిణీలో జాప్యం.. 
మరోవైపు.. ప్రభుత్వం కొత్తగా ఈనెల నుంచి పింఛన్ల పంపిణీలో చేపట్టిన ఆడియో ప్రచార కార్యక్రమం కారణంగా అనేకచోట్ల పింఛన్ల పంపిణీలో జాప్యం జరిగింది. సర్వర్‌ సమస్యలవల్ల కూడా పలు ప్రాంతాల్లో ఆలస్యమైంది. అలాగే, నెట్‌వర్క్‌ ప్రాబ్లం పేరుతో అందరినీ ఒకేచోటకు పిలిపించి పంపిణీ చేశారు. దీంతో.. వికలాంగులు, వృద్ధులు అతికష్టం మీద పింఛన్లు ఎక్కడ పంపిణీ చేస్తున్నారో తెలుసుకుని అక్కడికి ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సి వచ్చింది.

గతనెల 63.53 లక్షలు.. ఈనెల 63.36 లక్షలే.. 
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 63,53,907 మంది లబ్దిదారులకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. మార్చి ఒకటిన పంపిణీకి మాత్రం 63,36,932 మందికి మాత్రమే మంజూరు చేసింది. నెలరోజుల్లో పింఛన్ల సంఖ్య 16,975 తగ్గడం గమనార్హం. దీంతో.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది మే నుంచి ఇప్పటివరకు తగ్గిన పింఛన్ల సంఖ్య 2.06 లక్షలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement