
‘ప్రైవేటు’లో పీజీకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై టీడీపీ కూటమి సర్కారు దగా
ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీ
గద్దెనెక్కాక ఆ ఊసే ఎత్తకుండా మోసం
ఫలితంగా ఐసెట్, పీజీసెట్‌లో భారీగా తగ్గిపోయిన దరఖాస్తులు
ఇప్పటికే ప్రభుత్వ వర్సిటీల్లో దెబ్బతిన్న బోధన నాణ్యత
అప్పులుచేసి చదువుకోలేక పేదింటి విద్యార్థులు సతమతం
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వ తీరు ‘ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన’ చందంగా తయారైంది. అధికారం కోసం ఎన్నికల్లో అంతులేని హామీలిచ్చి.. ఆ తర్వాత గద్దెనెక్కాక వాటిని అమలుచేయకుండా ప్రజల నెత్తిన కుచ్చుటోపీ పెడుతోంది. ముఖ్యంగా ఉన్నత విద్యా రంగాన్ని బ్రష్టుపట్టిస్తూ విద్యార్థులను నిలువునా మోసంచేస్తోంది. ప్రైవేటు కళాశాలల్లో పీజీ విద్యను అభ్యసించే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలుచేస్తామని చెప్పి వరుసగా రెండో ఏడాది కూడా ఎగ్గొట్టేస్తోంది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పదేపదే చేసిన వినతులను బుట్టదాఖలు చేసింది. తాను ఇచ్చిన హామీను తానే ఖూనీచేస్తూ యువత ఆశలపై కోలుకోలేని దెబ్బకొట్టింది.
జీఓలు ఇవ్వకుండా నయవంచన..
ఇదిలా ఉంటే.. పీజీ విద్యలో ప్రైవేటుకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలుచేసే దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. చివరికి.. పీజీఈసెట్, ఐసెట్, పీజీసెట్స్ నోటిఫికేషన్లు ఇచ్చే ముందువరకు ఇదే తంతు నడిపింది. నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసి.. కౌన్సెలింగ్ ప్రారంభమైనా ప్రైవేటులో పీజీకి ఫీజు రీయింబర్స్‌మెంట్ జీఓలు ఇవ్వకుండా మరోసారి తన మోసాన్ని బయటపెట్టుకుంది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు 77,491 మంది దరఖాస్తు చేస్తే 63,451 మంది అర్హత సాధించారు. వీరంతా ఎంటెక్, ఎం–ఫార్మసీ, సంప్రదాయ పీజీలో ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకామ్‌లతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు ఆశిస్తున్నారు. అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పీజీ కోర్సుల దరఖాస్తులు భారీగా తగ్గిపోయాయి. గతేడాదితో పోలిస్తే పీజీ సెట్‌కు 6వేల దరఖాస్తులు, ఐసెట్‌కు ఏకంగా 11,256 దరఖాస్తులు తక్కువగా రావడం ఆందోళన కలిగిస్తోంది.
అప్పట్లో దొంగ ప్రవేశాలకు అడ్డుకట్ట..
గత ప్రభుత్వం ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేయడంతో పాటు అందులో సమగ్ర బోధన పద్ధతులను ప్రవేశపెట్టి అక్కడ పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందించింది. కానీ, 2014–19 మధ్య వివిధ ప్రైవేటు కళాశాలలు పీజీల్లో విద్యార్థుల చేరికలు లేకున్నా దొంగ ప్రవేశాలు చూపించి రూ.కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దోచేశాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి గత ప్రభుత్వం ప్రభుత్వ వర్సిటీల్లో పీజీ విద్యను అభ్యసించే వారికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలుచేసింది. దీంతో వర్సిటీల్లో ప్రవేశాలు సైతం మెరుగుపడ్డాయి.
ఇప్పుడు ప్రభుత్వ వర్సిటీల్లో బోధన నాణ్యతను దెబ్బతీయడంతో పాటు ప్రైవేటులో పీజీకి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడుతోంది. ప్రభుత్వ వర్సిటీల్లో నాణ్యమైన బోధన అందుకోలేక, ప్రైవేటు కళాశాలల్లో అప్పులుచేసి చదువుకోలేక పేదింటి విద్యార్థులు నలిగిపోతున్నారు.
లోకేశ్ మాటలు నమ్మి..
కూటమిలోని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎన్నికల సమయంలో ప్రైవేటు కళాశాలల్లో పీజీ విద్యకు కూడా తాము ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చిన ఏడాది ఆ ఊసే ఎత్తలేదు. రెండో ఏడాది నుంచి అమలుచేస్తామని చెప్పి మరోసారి మోసానికి ఒడిగట్టారు. వాస్తవానికి.. ఎన్నికల్లో లోకేశ్ మాటలు నమ్మిన విద్యార్థులు ప్రభుత్వ వర్సిటీ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు వచ్చినప్పటికీ వదులుకుని ప్రైవేటు కళాశాలల్లో చేరారు.
తీరా వారికి అక్కడ ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదని తెలుసుకునేలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. చివరికి.. అప్పులుచేసి కళాశాలలకు ఫీజులు చెల్లించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. మరోవైపు.. ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ ఉన్నత విద్యా రంగానికి అరకొర నిధులనే కేటాయించింది. అంటే.. పీజీ విద్యను ప్రైవేటు కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి సాయం చేయట్లేదని అప్పుడే తేలిపోయింది. అయినప్పటికీ, విద్యార్థులను ప్రభుత్వం ఏమారుస్తూ వచ్చింది.