పాట కోసమే ఆయన పుట్టారు.. | Swaroopanandendra Expressed Condolences Over Death SP Balu | Sakshi
Sakshi News home page

సంగీతమే ఊపిరిగా ఎస్పీ బాలు జీవించారు..

Sep 25 2020 3:08 PM | Updated on Sep 25 2020 3:20 PM

Swaroopanandendra Expressed Condolences Over Death SP Balu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన శివైక్యం పొందడం బాధాకరమన్నారు. బాలు మృతి సంగీత ప్రపంచానికే తీరని లోటు అని.. సంగీతమే ఊపిరిగా ఆయన జీవించారని తెలిపారు. విశాఖ శారద పీఠంతో బాలుకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం వెళితే శారదాపీఠం ఆశ్రమంలోనే ఆయన ఉండేవారని చెప్పారు. గొప్ప ఆధ్యాత్మిక భావాలున్న సంగీత శిఖరం బాల సుబ్రహ్మణ్యం అని స్వరూపానందేంద్ర ప్రస్తుతించారు. బాలు ఆత్మ భగవంతుని పాద చరణముల వద్దకు చేరాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. (చదవండి: ‘అది అదృష్టంగా భావిస్తున్నా’)

ఆయన పాట కోసమే పుట్టారు: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌
విజయవాడ: పాట కోసమే పుట్టిన మహనుభావులు ఎస్పీ బాలు అని, ఆయన లోటు మరే గాయకులు పూడ్చలేనిదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు.  ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాట్లాడినా, పాట పాడిన  తెలుగు భాష, తెలుగుజాతి సగర్వంగా చెప్పుకునే ఎస్పీ బాలు భౌతికంగా దూరమైనా 'పాట'లో మనతో మనలోనే శాశ్వతంగా ఉంటారన్నారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌రంతో ఎస్పీ బాలుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement