సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. గ్రీన్ జోన్ పేరు చెప్పి చంద్రబాబు.. రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. టీడీపీ ఏడేళ్ల పాలనలో విజయవాడకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి’’ అంటూ వెల్లంపల్లి డిమాండ్ చేశారు.
‘‘వైఎస్సార్‌సీపీ హయాంలో విజయవాడలో అభివృద్ది పరుగులు పెట్టింది. కేవలం రూ.20 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మించుకోవచ్చు. వెస్ట్ బైపాస్‌లో 10 శాతం పనులను ఎందుకు ఆపుతున్నారు. పోర్టు, రైల్వేస్టేషన్ కలిస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ మావిగన్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు’’ అని వెల్లంపల్లి పేర్కొన్నారు.
‘‘వైఎస్ జగన్ సూచించిన మావిగన్ ప్రతిపాదనను చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు. విజయవాడ అంటే చంద్రబాబుకు కక్ష. కూటమి అధికారంలోకి వచ్చాక విజయవాడలో ఒక్క అభివృద్ధి పనికూడా జరగలేదు. విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారు. అమరావతి బిల్లు పెట్టాక చంద్రబాబు మాట మార్చారు. అంతకుముందు 2028 కల్లా అమరావతి పూర్తవుతుందని చంద్రబాబు మొదట చెప్పారు. బిల్లు పెట్టాక అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో తెలియదంటున్నారు.
రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతిని గుదిబండగా మార్చారు. విజయవాడకు చంద్రబాబు ఏ ఒక్క మేలైనా చేశారా?. మచిలీపట్నం, గుంటూరులను కూడా పట్టించుకోవటం లేదు. ఎంతసేపూ అమరావతి పేరుతో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తారా?. లక్షల కోట్లు అమరావతిలో ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?. అందుకే జగన్ మావిగన్ పేరు సూచించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజాప్రతినిధులు మావిగన్ కు వ్యతిరేమా? అనుకూలమా?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.
మావిగన్‌కు ప్రజల మద్దతు లభిస్తోంది: దేవినేని అవినాష్
వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్నది షో రాజకీయాలే. ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అలాంటి అమరావతికి లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ సూచించిన మావిగన్‌కు ప్రజల మద్దతు లభిస్తోంది. అమరావతి కోసం చంద్రబాబు విజయవాడను చంపేశారు. నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయటం లేదు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టలేని చంద్రబాబు అమరావతి కట్టగలరా?. రిటైనింగ్ వాల్ కట్టలేని చంద్రబాబు అమరావతి కడతారా?.’’ అంటూ ఆయన నిలదీశారు.
‘‘విజయవాడలో అభివృద్ధి జగన్ మాత్రమే చేశారు. వెస్ట్ బైపాస్ నిర్మాణం కూడా కేవలం వైఎస్ జగనే చేశారు. విజయవాడలోని రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయకుండా చంద్రబాబే అడ్డుకున్నారు. కమ్మ సామాజిక వర్గం వారికి జగన్ ఎంతో మేలు చేశారు. వైఎస్ జగన్ దగ్గరకు వచ్చి పనులు చేయించుకున్నారు. వసంత కృష్ణప్రసాద్ ఐదేళ్లు మా పార్టీలో ఉండి డబ్బు సంపాదించుకున్నారు. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లి జగన్‌పై విమర్శలు చేయటం సిగ్గుచేటు. మావిగన్‌కు టీడీపీ నేతలు సైతం మద్దతు ఇస్తున్నారు. అమరావతి బిల్లు సందర్భంగా కేకులు కట్ చేయమని చంద్రబాబు పిలుపిస్తే టీడీపీ క్యాడరే పట్టించుకోలేదు. వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనకు అందరి మద్దతూ లభించింది’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.
అమరావతికి రూ.2 లక్షల కోట్లు అవసరమా?: మల్లాది విష్ణు
అమరావతికి రూ.2 లక్షల కోట్లు అవసరమా?. గ్రోత్ ఇంజన్ లాంటి మావిగన్‌పై ఎందుకు విమర్శలు చేస్తున్నారు?. రాష్ట్రం భరించలేని అప్పులు అవసరమా?. అమరావతిని ఎవరి కోసం నిర్మిస్తున్నారు?. గుంటూరు, విజయవాడలను చంద్రబాబు అన్యాయం చేశారు. మావిగన్ ప్రతిపాదనను జగన్ చెప్పగానే టీడీపీ నేతలు భయపడుతున్నారు. మచిలీపట్నం పోర్టు బేస్డుగా జరిగే మావిగన్ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు?. తెలంగాణానే మచిలీపట్నం పోర్టుకు రోడ్లు వేసుకోబోతోంది. మరి చంద్రబాబు ఆ కోణంలో ఎందుకు ఆలోచించటం లేదు?
అమరావతి పేరుతో భూములు తీసుకుని రైతులను ఎంతకాలం వేధిస్తారు?. మందడంలో రైతు రామారావు గుండె పగిలి చనిపోయాడు. దీన్ని కూడా ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. భావితరాలకు చంద్రబాబు లక్షల కోట్ల అప్పును గిఫ్టుగా ఇస్తున్నారు. బుడమేరు వరదలకు లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా చేయలేదు. విజయవాడ వాసులపై చంద్రబాబుకు ఎంత కోపమో దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు
కృష్ణా, బుడమేరులకు వరదలు వస్తే ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లకు కూడా సెలవులు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. అమరావతి పేరుతో జరిగే దోపిడీలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జపాన్‌కు చెందిన మాకీ అనే సంస్థ చంద్రబాబు అవినీతిని బయటపెట్టింది. చంద్రబాబు ఫ్రెండ్ సింగపూర్ ఈశ్వరన్‌ను కూడా జైల్లో పెట్టారు. అంటే వీరంతా కలిసి ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మావిగన్‌పై నిర్ణయం తీసుకోకపోతే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో టీడీపీ కనుమరుగు ఖాయం.


