
యోగా డే జనసమీకరణకు సర్వే
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులతో వివరాల సేకరణ
ఆరేడు నెలలుగా పెరిగిన సర్వేల భారం
దాదాపు 15, 16 సర్వేలు చేయించిన సర్కారు
గతంలో వలంటీర్లు చేసే పనులన్నీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులపైనే..!
సాక్షి, అమరావతి: యోగా డే సందర్భంగా విశాఖలో జరిగే కార్యక్రమానికి జన సమీకరణ కోసం సర్కారు ప్రత్యేక సర్వే చేపట్టింది. యోగాంధ్ర పేరుతో ఈ సర్వేను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో చేయిస్తోంది. దీంతో ఉద్యోగులు రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్లి జూన్ 21న యోగాడే కార్యక్రమానికి విశాఖపట్నం వస్తారా అంటూ ఆరా తీస్తున్నారు. సీఎం చంద్రబాబు మూడు రోజుల క్రితం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. వచ్చే జూన్ 21న విశాఖపట్నంలో రికార్డు స్థాయిలో ఐదు లక్షల మందితో యోగాడే వేడుకలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకొచి్చంది.
సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి యోగాడేలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నారా? లేదా? అని ప్రశ్నించాలి. వారిచ్చే జవాబు ఆధారంగా యాప్‌లో ఎస్ అనో లేదా నో అనో నమోదు చేయాలి. ఎస్ అని నమోదు చేసిన వెంటనే విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొంటారా.. లేదంటే సొంత ప్రాంతంలో పాల్గొంటారా.. ఇతర ప్రాంతాల్లో పాల్గొంటారా.. అనే ఆప్షన్లు ప్రత్యక్షమవుతాయి. వాటి ఆధారంగా వివరాలు నమోదు చేసి సచివాలయ ఉద్యోగులు సబ్మిట్ చేయాలి. యోగా వేడుకల్లో పాల్గొనదలచిన వ్యక్తి ఫోన్ నంబరుకు వచ్చిన ఓటీపీ కూడా నమోదు చేస్తే సర్వే పూర్తయినట్టు.
సర్వేలతోనే సరి!
గత ప్రభుత్వ పాలనలో ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వలంటీర్లు విధులు నిర్వర్తించేవారు. ప్రభుత్వానికి ఏ సమాచారం కావాలన్నా.. వారు సేకరించి ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడంతో ఇప్పుడు వలంటీర్ల పనిభారం అంతా సచివాలయ ఉద్యోగులపై పడింది.
సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయకపోయినా కూటమి సర్కారు ఆ వివరాలు తీసుకోండి.. ఈ వివరాలు కావాలి అంటూ సర్వేల పేరుతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వేధిస్తోంది. గత ఆరేడునెలల్లోనే ప్రభుత్వం దాదాపు 15–16 సర్వేలు చేయించినట్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ సమాచారం కోసం ప్రజల వద్దకు వెళ్తుంటే వారూ అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంటున్నారు.