
చంద్రబాబు సర్కారుకు గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
వాక్ స్వాతంత్య్ర హక్కును హరిస్తున్న ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ
జర్నలిస్టుగా కొమ్మినేని శ్రీనివాసరావు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్న ధర్మాసనం
తద్వారా ఆయన వాక్ స్వాతంత్య్రాన్నీ రక్షించినట్లవుతుందని స్పష్టీకరణ
నవ్వడం నేరమా..? నవ్వితే అరెస్ట్ చేసేస్తారా? అంటూ మండిపాటు
నవ్వడం తప్పయితే మేం రోజూ నవ్వుతూనే కేసులను విచారిస్తుంటామని వ్యాఖ్య
ఏపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు
కొమ్మినేనికి బెయిల్ మంజూరు
తగిన షరతులు విధించాలని కింది కోర్టుకు స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పౌరులు, మేధావులు, పాత్రికేయుల వాక్ స్వాతంత్య్ర హక్కును హరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెప్పింది. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ను తప్పుపట్టింది. లైవ్ షోలో ఓ ప్యానలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై నవ్వినందుకు కొమ్మినేనిని అరెస్ట్ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది.
‘‘నవ్వడం నేరమా? దానికే అరెస్ట్ చేసేస్తారా?’’ అంటూ మండిపడింది. నవ్వడమే తప్పయితే, తాము కూడా ప్రతి రోజూ నవ్వుతూనే కేసులను విచారణ చేస్తుంటామంటూ గుర్తు చేసింది. లైవ్ షోలో ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వారే తప్ప, ఆయన ఎలాంటి అనుచిత, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది. ఓ జర్నలిస్టుగా లైవ్ న్యూస్ షోలో పాల్గొనే కొమ్మినేని హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని, తద్వారా ఆయన వాక్ స్వాతంత్య్ర హక్కును కూడా పరిరక్షించినట్లవుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఈ నెల 8న నమోదు చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. బెయిల్ మంజూరు సందర్భంగా షరతులు విధించాలని కింది కోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అరెస్ట్... రిమాండ్‌ను సవాల్ చేసిన కొమ్మినేని
కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే కేఎస్సార్ లైవ్ షోలో పాల్గొన్న మరో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి రాజధాని గురించి పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో కృష్ణంరాజు, కొమ్మినేనిపై టీడీపీకి చెందిన కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కొమ్మినేని, కృష్ణంరాజుపై ఐటీ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. తర్వాత పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
ఆయనను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో కొమ్మినేని తన అరెస్ట్, రిమాండ్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కొమ్మినేని తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు.
» ఈ నెల 6న కొమ్మినేని లైవ్ షో నిర్వహించారని, అందులో ప్యానలిస్ట్‌గా పాల్గొన్న మరో సీనియర్ జర్నలిస్ట్ అమరావతి గురించి వ్యాఖ్యలు చేశారని సిద్ధార్థ దవే ధర్మాసనానికి వివరించారు. ఈ వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన ఎవరి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని నివేదించారు. ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు.. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిని బాధ్యుడిగా చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు.
మరొకరు చేసిన వ్యాఖ్యలకు యాంకర్‌ను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించిన జస్టిస్ మన్మోహన్... అలా అదుపులోకి తీసుకునేందుకు చట్టం అనుమతిస్తుందా? అని ప్రశ్నించారు. ఏ నిబంధన మేరకు అరెస్టు చేశారో చెప్పాలని ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూథ్రాలను ప్రశ్నించారు.
చర్చలో ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేని నవ్వారని, ఈ విషయంలో ప్రేక్షక పాత్ర పోషించారని వివరించారు. ఆయన మాట్లాడేటప్పుడు అడ్డుకోకుండా నవ్వారని రోహత్గీ బదులిచ్చారు. ఈ వాదనపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. నవ్వడం నేరమా? నవ్వితే అరెస్ట్ చేస్తారా? అంటూ నిలదీసింది. ఎవరైనా నవ్వొచ్చేలా మాట్లాడితే ధర్మాసనంపై ఉన్న తాము కూడా నవ్వుతామన్న జస్టిస్ మన్మోహన్.. అంతమాత్రాన తప్పుడు కేసులు అంటగట్టేస్తారా? అని ప్రశ్నించారు.
జస్టిస్ మిశ్రా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ... ప్రతి రోజూ ఇలా జరుగుతూనే ఉంటుందని అన్నారు. కొమ్మినేని చర్చలో ప్రేక్షకుడు కాదని రోహత్గీ చెప్పగా... ఆయన ఆ వ్యాఖ్యలు చేయలేదు కదా? అని జస్టిస్ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు. పిటిషనర్ స్వయంగా ఎటువంటి పరువు నష్టం కలిగించే, అవమానకర వ్యాఖ్యలు చేయలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. లైవ్ షోలో ఆయన పాత్రికేయ భాగస్వామ్యం రక్షణకు అర్హమైనదని, ఇది వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడుతుందని తెలిపింది.
కొమ్మినేని అరెస్ట్ ఎంతమాత్రం సహేతుకం కాదంటూ ఆయనను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు విధించే నిబంధనలు, షరతులకు లోబడి ఈ నెల 8న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ నంబర్ 108లో కొమ్మినేనిని బెయిల్‌పై విడుదల చేయాలని నిర్దేశించింది. తాను నిర్వహించే షోలో కొమ్మినేని ఎలాంటి పరువు నష్టం వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని, ఇతరులను అలాంటి ప్రకటనలు చేయడానికి అనుమతించడం గానీ చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.