సర్కారీ వైద్యం సూపర్‌

Superspeciality Medical Services At Markapuram District Hospital - Sakshi

మార్కాపురం జిల్లా వైద్యశాలలో సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు

నెల వ్యవధిలో 12 మంది డాక్టర్ల నియామకం

ప్రస్తుతం 32 మంది వైద్యుల సేవలు

రోజుకు 450 నుంచి 500 ఓపీలు

12 ఐసీయూ బెడ్‌ల ఏర్పాటు

జిల్లా కేంద్రానికి దూరంగా.. నల్లమల అభయారణ్యానికి దగ్గరగా ఉన్న మార్కాపురం పట్టణంలో గత ప్రభుత్వంలో మెరుగైన వైద్యం అందేది కాదు. ఇక్కడి జిల్లా వైద్యశాలలో వైద్యుల కొరతతో పాటు సరైన మౌలిక సదుపాయాలు కూడా ఉండేవి కావు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక వైద్యశాల రూపురేఖలు మారిపోయాయి. మెరుగైన వైద్యసేవలందించేందుకు కోటి రూపాయలతో అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు అవసరమైన స్పెషలిస్టు వైద్యులు, సిబ్బందిని నియమించారు. ఫలితంగా ఈ ప్రాంత ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి.  

మార్కాపురం(ప్రకాశం జిల్లా): గత ప్రభుత్వంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. 2019 వరకు మార్కాపురం జిల్లా వైద్యశాలలో 10 నుంచి 12 మంది మాత్రమే డాక్టర్లు ఉండేవారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చిన తరువాత వైద్య రంగానికి మహర్దశ పట్టింది. ప్రజలందరికీ ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్‌ వైద్యం అందించాలనే లక్ష్యంతో నాడు–నేడు పథకాన్ని అమలు చేశారు. ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి జిల్లా వైద్యశాలకు కో చైర్మన్‌గా ఉన్నారు.

ఇక్కడి సమస్యలను ఆయన ప్రభుత్వం, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లటంతో పశ్చిమ ప్రకాశం ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో స్పెషలిస్టు డాక్టర్లను నియమించారు. పశ్చిమ ప్రకాశం ముఖ్య కేంద్రమైన మార్కాపురంలోని జిల్లా వైద్యశాలలో ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వం 12 మంది డాక్టర్లను నియమించింది. దీంతో మొత్తం 32 మంది డాక్టర్లు ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లోని సుమారు 8 లక్షల మంది ప్రజలకు వైద్యసేవలు అందుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరత తీరింది. ప్రభుత్వం ఇటీవల ఇద్దరు పీడియాడ్రిక్, ముగ్గురు గైనకాలజిస్టులు, ఇద్దరు జనరల్‌ సర్జన్‌లు, ఇద్దరు ఈఎన్‌టీ సర్జన్‌లు, ఒక డెర్మటాలజిస్టు, ఇద్దరు ఆప్తమాలజిస్టులు, ఇద్దరు ఎనస్తీషియన్‌లు, ఒక మైక్రోబయాలజిస్టు, ఇద్దరు ఆర్ధోపెడిక్‌లు, ఇద్దరు జనరల్‌ మెడిసిన్, ఒక ఫోరెన్సిక్‌ డాక్టర్‌ను నియమించారు. వీరు కాక ఐదుగురు హౌస్‌ సర్జన్‌లు కూడా అందుబాటులోకి వచ్చారు.  

నెలకు 300 ఆపరేషన్లు
పూర్తిగా డాక్టర్ల నియామకంతో నెలకు 300 సాధారణ కాన్పులు జరుగుతున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం 15 రోజుల వ్యవధిలో సాధారణ డెలివరీలు, ఈఎన్‌టీ సర్జరీలు, ఆర్ధో సర్జరీలు, సిజేరియన్‌లు, పిండి కట్టులతో కలిపి సుమారు 150 జరిగాయి. 24 గంటలు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 400 నుంచి 450 మందిదాక ఔట్‌ పేషెంట్‌లు వైద్యశాలకు వచ్చి చికిత్స పొందుతున్నారు. 

వంద బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి. వైద్యశాలలో ఈసీజీ, వెంటిలేటర్‌లు, కంప్లీట్‌ ఆటో ఎనలైజర్, డయాలసిస్, హార్మోన్స్‌ ఎనలైజర్‌ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కిడ్నీ, లివర్, సీరమ్‌ అన్ని రకాల రక్త పరీక్షలు హార్మోన్స్‌ టెస్టు, థైరాయిడ్, గ్యాస్‌ ఎనాలసిస్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు.  

ప్రజలకు మంచి సేవలు అందించండి 
ప్రజలకు జిల్లా వైద్యశాల వైద్యులు మంచి సేవలు అందించాలి. డాక్టర్ల కొరత కూడా తీరింది. వైద్యశాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది వచ్చినా పరిష్కరిస్తాం. వైద్యశాలలో ఆధునిక వైద్య పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆక్సిజన్‌ ప్లాంట్‌లు కూడా ఉన్నాయి.  
– కేపీ నాగార్జునరెడ్డి, ఎమ్మెల్యే 

సేవలు అందించేందుకు సిద్ధం 
మార్కాపురం జిల్లా వైద్యశాలలో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. సిబ్బంది కొరత కూడా తీరింది. రోజూ 450–500 మంది వరకు ఓపీ చూస్తున్నాం. నెలకు 300 వరకు వివిధ రకాల ఆపరేషన్లు చేస్తున్నాం. 12 ఐసీయూ బెడ్‌లు, 28 వెంటిలెటర్లు, 102 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌లు అందుబాటులో ఉన్నాయి.  
– డాక్టర్‌ సుబ్బారెడ్డి, సూపరింటెండెంట్, జిల్లా వైద్యశాల, మార్కాపురం 

రోగులకు మంచి వైద్యం అందుతోంది 
నేను మార్కాపురం పట్టణంలో విజయ టాకీస్‌ ఏరియాలో ఉంటాను. ఇటీవల నాకు జ్వరం వచ్చినప్పుడు ట్రీట్మెంట్‌ కోసం జిల్లా వైద్యశాలకు వెళ్లాను. అక్కడ డాక్టర్లు, సిబ్బంది నాకు అన్ని రకాల పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. జ్వరం తగ్గింది. జిల్లా వైద్యశాలలో ఇప్పుడు రోగులకు మంచి సేవలు అందుతున్నాయి. డాక్టర్ల సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలి. 
– మీరావలి, మార్కాపురం 

రూ.కోటితో అభివృద్ధి పనులు  
గడిచిన ఏడాదిన్నర కాలంలో జిల్లా వైద్యశాలలో కోటి రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. కరోనా సమయంలో ఆక్సిజన్‌ దొరక్క చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి వైద్యారోగ్యశాఖ మంత్రితో మాట్లాడి రెండు ఆక్సిజన్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేయించారు. ఇందులో ఒకటి లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ కాగా మరొకటి ఆక్సిజన్‌ న్యాచురల్‌ ప్లాంట్‌. నిరంతరాయంగా ఒకే సమయంలో వంద మందికి ఆక్సిజన్‌ అందించే అవకాశం ఉంది. అత్యవసర వైద్యసేవలు అందించేందుకు 12 ఐసీయూ బెడ్‌లను కూడా ఏర్పాటు చేశారు. సుమారు రూ.50 లక్షలతో జిరియాట్రిక్‌ (వృద్దుల వార్డు)ను నిర్మించారు. దీంతోపాటు కరోనా టెస్టులు చేసేందుకు వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ను కూడా నిర్మించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top