రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పోరాటానికి సిద్ధం కావాలి | State government employees must prepare for war | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పోరాటానికి సిద్ధం కావాలి

Jun 8 2026 3:32 AM | Updated on Jun 8 2026 3:32 AM

 State government employees must prepare for war

ఉద్యోగులు లక్షలాది రూపాయలు ఆర్థికంగా నష్టపోయి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు 

మారిన పరిస్థితులు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పేరివిజన్‌ చేపట్టాలి 

ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను పే స్లిప్‌లో చూపాలి 

12వ పీఆర్సీ కమిషనర్‌ను తక్షణమే నియమించాలి 

ఏపీ జేఏసీ (అమరావతి) చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు  

గాందీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): గడువు ముగిసి మూడేళ్లయినా పీఆర్సీ కమిషనర్‌ను నియమించి మధ్యంతర భృతిని ప్రకటించకపోవడం బాధాకరమని ఏపీ జేఏసీ (అమరావతి) చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు అన్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకపోయినప్పటికీ కమిషనర్‌ను నియమించకపోవడం శోచనీయమన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలోని ఏపీ రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ (అమరావతి) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. 

పీఆర్సీ కమిషనర్‌ను నియమించి, మధ్యంతర భృతి ప్రకటించాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ పెంచాలని... తదితర 12 అంశాలపై ఏకగ్రీవంగా ఈ సమావేశంలో తీర్మానం చేశారు. పీఆర్సీ జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగులు జేఏసీ ప్రకటించే ఎలాంటి కార్యాచరణకైనా కట్టుబడి ఉంటామని ప్రకటించారు. అనంతరం మీడియాతో బొప్పరాజు, పలిశెట్టి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషనర్‌ను నియమించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కమిషనర్‌ రాజీనామా చేశారని గుర్తు చేశారు. 

అప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం కమిషనర్‌ను నియమించలేదన్నారు. ఫలితంగా ఉద్యోగులు లక్షలాది రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి  ఉద్యోగులకు 2023 ఐఆర్‌ చెల్లిస్తున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదన్నారు. ఉద్యోగులంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. స్వయంగా సీఎం చంద్రబాబు గతేడాది అక్టోబర్‌ 25న ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై పీఆర్సీ అంశాన్ని ఆయనకు వదిలేయాలని చెప్పడంతో ఉద్యోగులంతా సహనంతో వేచి ఉన్నారన్నారు. 

కానీ ప్రభుత్వం నుంచి పీఆర్సీ కమిషనర్‌ నియామకం, మధ్యంతర భృతిపై కనీస స్పందన లేదన్నారు. మారిన పరిస్థితులు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పే రివిజన్‌ వెంటనే చేపట్టాలన్నారు. ఉద్యోగులు ట్యాక్స్‌లు చెల్లిస్తున్నప్పటికీ సరెండర్‌ లీవ్‌ కూడా చెల్లించడం లేదన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను పే స్లిప్‌లో చూపాలని డిమాండ్‌ చేశారు. చెల్లింపులపై రోడ్డు మ్యాప్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, వారి ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉద్యమ కార్యాచరణ తప్ప వేరే ప్రత్యామ్నయం కనిపించడం లేదన్నారు. 

ఉద్యమ కార్యాచరణ, కలిసొచ్చే సంఘాలతో సమన్వయం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని నియమించినట్లు తెలిపారు. ఉద్యోగులంతా ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో జేఏసీ అసోసియేట్‌ చైర్మన్‌ టి.వి.ఫణి పేర్రాజు, మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పారె లక్ష్మి, పొన్నూరు విజయలక్ష్మి, వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement