వేలాది మంది ప్రయాణికులతో కిక్కిరిసిన వినుకొండ ఆర్టీసీ బస్టాండ్
నలుగురికి తీవ్ర గాయాలు
బస్సు ప్లాట్‌ఫాంపైకి వస్తుండగానే ఎక్కేందుకు వందలాది మంది ప్రయత్నం
బస్సు డోరు తగిలి ఒకరిపై ఒకరు పడిపోయిన ప్రయాణికులు
పండుగకు ప్రత్యేక బస్సులు లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రయాణికుల ఆగ్రహం
వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ డిపోలో సోమవారం బస్సు ఎక్కేందుకు ఒకేసారి వందలాది మంది ప్రయాణికులు పోటీ పడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంక్రాంతి సెలవులు ముగియడంతో సోమవారం ఉదయం దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పెద్దసంఖ్యలో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. పది గంటల సమయంలో వేలాది మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది.
అదే సమయంలో ఆర్టీసీ గ్యారేజీ నుంచి విజయవాడకు వెళ్లే బస్సు ప్లాట్‌ఫాంకు వస్తుండగా.. ఒక్కసారిగా వందలాది ప్రయాణికులు గ్యారేజీ వైపునకు వెళ్లి బస్సు ఎక్కేందుకు ప్రయత్నించారు. బస్సు కదులుతూ ఉండగానే సీటు కోసం తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా డోరు తగిలి పలువురు ఒకరిపై ఒకరు కిందపడిపోయి తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన బెల్లంకొండ చిన్న అంకయ్య, నూజెండ్ల మండలం కొత్త నాగిరెడ్డిపల్లికి చెందిన పరిమి కోటమ్మకు చేతులు విరిగిపోయాయి. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ఎండపల్లికి చెందిన ఎస్తేరురాణి, పుల్లలచెరువు తండాకు చెందిన బాణావత్ మంత్రిబాయికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ప్రైవేటు వాహనంలో పట్టణంలోని వివిధ వైద్యశాలలకు తరలించారు.
ప్రభుత్వం, ఆర్టీసీ వైఫల్యం వల్లే...
సంక్రాంతి పండుగ సెలవుల అనంతరం ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా ప్రత్యేక బస్సులు నడపడంలో చంద్రబాబు ప్రభుత్వం, ఆర్టీసీ ఘోరంగా విఫలమయ్యాయని పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. సెలవుల అనంతరం తీవ్ర రద్దీ ఉంటుందని తెలిసినా కూడా అదనపు సర్విసులు నడపకపోవడం వల్లే వినుకొండ డిపోలో తొక్కిసలాట జరిగిందని ప్రయాణికులు మండిపడ్డారు.


