త్వరలోనే శ్రీవారి సర్వ దర్శనం

Srivari Sarva Darshanam will be soon - Sakshi

ఆగస్ట్‌ నుంచి యథావిధిగా స్వామి వారి సేవలు ఉండే అవకాశం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవారి సర్వ దర్శనాలు, సేవలు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని భక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో కోవిడ్‌ పాజిటివిటీ రేటు 1 శాతానికి వస్తే సేవలు పునఃప్రారంభించేందుకు టీటీడీ సమాయత్తమవుతోంది. కరోనా నేపథ్యంలో గతేడాది 2020 మార్చి 20 నుంచి స్వామి వారి సేవలు టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తోంది. కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా కొన్నాళ్లు భక్తులకు దర్శనం కూడా నిలిపివేసింది. 2020 జూన్‌ 7నుంచి రోజుకు 5 వేల మందితో ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు జారీ చేసి దర్శనాలు ప్రారంభించింది. ఆ తర్వాత  సామాన్యులకు సైతం స్వామి దర్శనం కల్పించాలనే లక్ష్యం తో సర్వదర్శనం టోకెన్లు కూడా జారీ చేసింది. వీటి కోసం వేలాదిమంది భక్తులు పోటెత్తారు.

కోవిడ్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఏర్పడటంతో టీటీడీ సర్వదర్శనం నిలిపివేసింది. స్వామివారి సేవలు ప్రారంభించాలని ఫోన్లు, మెయిల్‌ ద్వారా భక్తులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ అంశం పాలక మండలి సమావేశంలో చర్చించి ఈ ఏడాది ఏప్రిల్‌ 14 నుంచి స్వామివారి సేవలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈలోపు కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి పెరగడంతో ఈ నిర్ణయం వాయిదా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు చిత్తూరు జిల్లాలో కూడా పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ రేటు 1 శాతానికి వచ్చి భక్తుల ఆరోగ్య భద్రతకు ఇబ్బంది లేని పరిస్థితి నెలకొంటే ఆగస్ట్‌లో స్వామి వారి సేవలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడానికి టీటీడీ సమాయత్తమవుతోంది. సేవలతో పాటు సామాన్యులకు ఉచిత దర్శనం కల్పించడానికి సిద్ధమవుతోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top