బాబు, పవన్‌ సస్పెన్స్‌ పాలిటిక్స్‌కు తెర.. ముసుగు తొలగింది!

Special Story On Pawan Kalyan And Chandrababu Party Alliance - Sakshi

ఏపీ రాజకీయాల్లో ముసుగు తొలగింది. గత మూడేళ్ల నుంచి తెర వెనుక జరుగుతున్న రాజకీయాలు ఈరోజు దాదాపుగా బహిర్గతమయ్యాయి. చంద్రబాబు కోసమే పవన్‌ కల్యాణ్‌ పని చేస్తున్నాడని ఇన్నాళ్ల నుంచి వైఎస్సార్‌సీసీ చేస్తున్న ప్రకటనలకు పూర్తి ఆచరణ రూపం ఇచ్చిన చంద్రబాబు.. నేరుగా విజయవాడ నొవాటెల్‌కు వెళ్లి పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యాడు. వీరిద్దరి భేటీతో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం పెరిగింది. ఒంటరిగా వెళ్తే తుడుచుకుపెట్టుకుపోతాయని పంచాయతీ, పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికలు నిరూపించడంతో.. ఇద్దరు హడావిడిగా ముసుగులు తొలగించి ముందుకొచ్చారు.

ముసుగు వెనకాల చంద్రబాబు గులాంగిరి..
నిజానికి విశాఖలో ఏం జరిగింది.? మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. దానిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఏదో ఒక కారణంతో ముసుగు తీయాలన్న బలమైన కోరికతో  ఉన్న  చంద్రబాబు.. సరిగ్గా ఈ పరిణామాన్ని కారణంగా చూపి బయటికొచ్చాడు. పవన్‌కు సంఘీభావం తెలుపుతానంటూ విజయవాడ నొవాటెల్‌కు వచ్చాడు. పక్కా స్క్రిప్ట్‌కు  స్క్రీన్‌ ప్లే జోడించినట్టు చంద్రబాబు, పవన్‌ భేటీ జరిగింది.

చెప్పు ఎపిసోడ్‌ కర్టెన్‌ రైజర్‌!
మంగళవారం మధ్యాహ్నం మంగళగిరి కార్యకర్తల సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ ఊగిపోయినప్పుడే సాయంత్రానికి ఏదో జరిగిపోతుందని చాలా మంది ఊహించారు. 2024 ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండటంతో ముసుగు తీయడమే మంచిదనుకున్నట్టుగా కనిపించారు. చెప్పులు చూపించడం, గొడవలు చేయాలని పిలుపునివ్వడం, వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేయాలని కార్యకర్తలకు సూచించడం దీంట్లో కొనసాగింపుగా జరిగాయి. ఇది జరిగిన కొద్దిసేపటికే బాబు, పీకే మీటింగ్‌ జరిగింది.

నాలుగు నెలల ముందే ప్లానింగ్‌..
గత కొన్నాళ్లుగా పవన్‌ కల్యాణ్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని నడుపుతున్నాడని, దానిని చంద్రబాబుకు అప్పగించడమే పవన్‌ లక్ష్యమని వైఎస్సార్‌సీపీ చెబుతోంది. ప్రజల్ని, తన అభిమాన సంఘాల్ని పవన్‌ కల్యాణ్‌ మోసం  చేస్తున్నాడని, తన ఫాలోయింగ్‌ను తాకట్టు పెట్టి ప్యాకేజీ తీసుకోవడమే పవన్‌ లక్ష్యమని వైఎస్సార్‌సీపీ చెబుతోంది. ఇది ఊహించిన పరిణామమేమని, అందుకే విశాఖలో  జనసేన కార్యకర్తలు తెగించారని చెబుతోంది. 

ఆనాటి తిట్లు ఏమయ్యాయి?
2014లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. నాడు పవన్‌ ఇంటికి చంద్రబాబు వెళ్లి పొత్తు పెట్టుకున్నాడు. అయితే, కొంత కాలానికే పవన్‌ కల్యాణ్‌.. నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత బీఎస్పీ, వామపక్షాలు, బీజేపీ.. ఇలా పార్టీలు మార్చుకుంటూ వెళ్లాడు. అయితే, చంద్రబాబు చెబితేనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని, పవన్‌ మా సీఎం అభ్యర్థి అని బీజేపీ అన్నా.. పవన్‌ చూపు మాత్రం చంద్రబాబు వైపే ఉందని వైఎస్సార్‌సీపీ ఎప్పటికప్పుడు చెబుతునే ఉంది. చివరికి అదే నిజమైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top