సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పిల్లలు కలగలేదని కుమిలిపోవాల్సిన అవసరం లేదు. వారికోసం అడ్డదారులు తొక్కనవసరం లేదు. సన్మార్గంలోనే పిల్లలను దత్తత తీసుకోవచ్చు. చట్టబద్ధంగా అన్ని హక్కులు పొందవచ్చు. అయినా కొందరు మాత్రం పక్కదారి పడుతున్నారు. చట్టం, సమాజం దృష్టిలో నేరస్తులవుతున్నారు. తాజాగా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో అపహరించిన పసికందుతో పట్టుబడిన దంపతుల దుస్థితి ఇదే.
గ్రామస్తులను నమ్మబలికి..
స్థానికుల కథనం ప్రకారం కవిటి మండలం కొత్తవరకకు చెందిన రైతు కుటుంబం మాదిన రాజేష్, లక్ష్మీప్రసన్నకు పిల్లలు కలగలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో అడ్డదారి తొక్కారు. ఈ క్రమంలో స్థానికులను నమ్మబలికించారు. గుజరాత్, తదితర రాష్ట్రాల్లో పిల్లల కోసం మంచి వైద్యం అందిస్తున్నారని స్థానికులకు చెప్పి కొన్ని నెలల క్రితం ఊరు విడిచి వెళ్లారు. అక్కడ చేసిన వైద్యంతో గర్భం దాల్చి, బిడ్డను కన్నారని చెప్పుకుని సొంతూరికి వస్తున్నామంటూ గ్రామస్తులకు సమాచారమిచ్చారు.
ఈ లోపు మార్గమధ్యలో కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో పోలీసుల జరిపిన తనిఖీల్లో పసికందుతో పట్టుబడ్డారు. వారి కన్న బిడ్డతో వెళ్తే పోలీసులు పట్టుకోవడమేంటని సందేహం రావచ్చు. కానీ వారి చేతిలో ఉన్న పసికందు వారిది కాదు. విశాఖపట్నం కేజీహెచ్‌లో వేరొక తల్లికి జన్మించిన బిడ్డను మధ్యవర్తుల ద్వారా అపహరించి తీసుకొచ్చిన పసికందు అది. ఇంకేముంది పోలీసులకు చిక్కారు. ఇప్పుడు క్రిమినల్ కేసులు ఎదుర్కొని, జైలు పాలు కావల్సిన పరిస్థితి. పసికందును అపహరించి తీసుకొచ్చిన లక్ష్మీ ప్రసన్న గతేడాది జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
దత్తత విధానమే మేలు..
సంతానం కలగని దంపతులు జిల్లాలో ఉన్న శిశు గృహ(ప్రత్యేక దత్తత సంస్థ)ను సంప్రదించి పిల్లలను దత్తత తీసుకోవచ్చు. అవాంఛిత గర్భం, రోడ్డు పక్కన దొరికిన పిల్లలు.. తదితర శిశువులను చేరదీసి శిశుగృహలో అలనాపాలనా చూస్తున్న విషయం తెలిసిందే.
ఇటువంటి పిల్లల్ని దత్తత తీసుకుందామనుకుంటే ఠీఠీఠీ.ఛ్చిట్చ.nజీఛి.జీn వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేస్తే చాలు సీరియల్ పద్ధతిలో జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ శిశు గృహల్లో ఉన్న పిల్లల్ని దత్తత తీసుకునే అవకాశం ఉంది. అంతా చట్టబద్ధంగా జరుగుతుంది. మన జిల్లాలోని శిశుగృహలో ప్రస్తుతం నలుగురు పిల్లలు ఉన్నారు. పిల్లలు లేని వారు మధ్యవర్తులను నమ్మి మోసపోవడం కంటే శిశు గృహను సంప్రదిస్తే మంచిదని జిల్లా పిల్లల సంరక్షణ అధికారి కె.వి.రమణ విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment