3 రాజధానులకు మద్దతుగా ప్రత్యేక పూజలు

Special pujas in support of Andhra Pradesh 3 capitals - Sakshi

పలుచోట్ల ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టిన ప్రజాప్రతినిధులు, ప్రజలు

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ)/ఇచ్ఛాపురం రూరల్‌/చినగంజాం: మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ, వాటికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మంగళవారం ఆలయాల్లో కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. విశాఖపట్నం పెదవాల్తేర్‌లోని శ్రీకరకచెట్టు పోలమాంబ ఆలయంలో అమ్మవారికి వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్, వైఎస్సార్‌ సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి తదితరులు ప్రత్యేక పూజలు చేశారు.

కొబ్బరి కాయలు కొట్టారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని పూర్ణామార్కెట్‌ వెలంపేటలోని దుర్గాలమ్మ ఆలయంలో కార్పొరేటర్‌ విల్లూరి భాస్కరరావు నేతృత్వంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ పూజలు చేసి వెయ్యి కొబ్బరికాయలు కొట్టారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జింక్‌ ఆంజనేయస్వామి ఆలయంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్‌ ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయలు కొట్టారు.

శ్రీకాకుళం జిల్లా లొద్దపుట్టి ధనరాజులమ్మ ఆలయంలో ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ చైర్మన్‌ నర్తు రామారావుయాదవ్‌ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న జిల్లా టీడీపీ నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. బాపట్ల జిల్లా వంకాయలపాడులోని సంతానవేణుగోపాలస్వామి ఆలయంలో జెడ్పీటీసీ సభ్యురాలు భవనం శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భవనం శ్రీనివాసరెడ్డి పూజలు చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top