ఐదు వర్కింగ్‌ గ్రూపులుగా స్పెషల్‌ పోలీస్‌! | Special police in five working groups | Sakshi
Sakshi News home page

ఐదు వర్కింగ్‌ గ్రూపులుగా స్పెషల్‌ పోలీస్‌!

Jun 10 2026 4:35 AM | Updated on Jun 10 2026 4:35 AM

Special police in five working groups

పునర్వ్యవస్థీకరణ దిశగా ఏపీఎస్పీ 

ఆరు నెలల్లో అధ్యయనం, డిజైన్‌ ఖరారు 

పోలీసు శాఖ ప్రతిపాదనలకు సూత్రప్రాయ ఆమోదం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ పోలీస్‌ (ఏపీఎస్పీ) విభాగాన్ని పునర్వ్యవస్థీకరించే దిశగా పోలీసు శాఖ అడుగులు వేస్తోంది. బెటాలియన్లను ప్రత్యేక కేటగిరీలగా విభజించి వేర్వేరు విధులు, బాధ్యతలకు వినియోగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీఎస్పీ విభాగాన్ని ఐదు వర్కింగ్‌ గ్రూపులుగా విభజించేలా ముసాయిదా పత్రాన్ని రూపొందించింది. ఆ ప్రతిపాదనను పోలీసు శాఖ ఇటీవల సూత్రప్రాయంగా ఆమోదించింది.

ఆ ఐ­దు వర్కింగ్‌ గ్రూపులకు కేటాయించిన ప్రత్యేక అంశాలపై అధ్యయనం చేయించి ప్రతి వర్కింగ్‌ గ్రూపునకు ప్రత్యేక డిజైన్‌ రూపొందించాలని నిర్ణయించింది. అయితే.. కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టేది లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ఏపీఎస్పీ సిబ్బందితోనే కొత్త వర్కింగ్‌ గ్రూపులు ఏర్పాటు చేసి సమర్థంగా విధులు నిర్వర్తించేలా అధ్యయనం చేయాలని పేర్కొంది. ఈ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తోంది.  

వర్కింగ్‌ గ్రూప్‌లు ఇలా 
ఏపీ ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌): రెండు ఏపీఎస్పీ బెటాలియన్లను ప్రత్యేకంగా ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌గా ఏర్పాటు చేస్తారు. ఈ విభాగం ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో అల్లర్లను నిరోధించడం, భారీ జనసమీకరణతో జరిగే కార్యక్రమాల నిర్వహణ ప్రధాన బాధ్యతల్ని చూస్తుంది. కేంద్రంలోని సీఆర్‌పీఎఫ్‌ బలగాలు పనిచేసే రీతిలో ఈ విభాగానికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.  

క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ యూనిట్‌: ప్రధాన ప్రభుత్వరంగ సంస్థలు, పోర్టులు, ఎస్‌ఈజెడ్‌లు, రిఫైనరీలు వంటి అత్యంత ప్రధానమైన ప్రభుత్వ ఆస్తులు, మౌలిక వ్యవస్థల భద్రతా విభాగం. అమరావతి పైలట్‌ ప్రాజెక్టుగా క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ సెక్యూరిటీ యూనిట్‌ ఏర్పాటు చేస్తారు. 

స్పెషల్‌ ఆపరేషన్స్‌ ప్లాటూన్లు (ఎస్‌ఓపీ): శాంతిభద్రతల కోణంలో అత్యంత సున్నితమైన సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే స్పందించి నియంత్రించే విభాగం. ముందస్తు అరెస్టులు, నగరాలు, జాతీయ రహదారులపై తనిఖీలు, డ్రగ్స్‌ నియంత్రణ తదితర అంశాలు ఈ ప్లాటూన్ల పరిధిలోకి వస్తాయి.  

డిజాస్టర్‌ రెస్పాన్స్‌ కంపెనీలు: తుపాన్లు, వర­దలు, పారిశ్రామిక ప్రమాదాలు, ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయ, పునరావాస చర్యలు చేపట్టే బలగాలుగా ఈ విభాగాన్ని సిద్ధం చేస్తారు. కేంద్ర ఎన్‌డీఆర్‌ఎఫ్‌ తరహాలో ప్రస్తుతం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తారు. 

టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌ యూనిట్లు: ఆధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని భద్రతా విధులు నిర్వహించే విభాగంగా తీర్చిదిద్దుతారు. డ్రోన్లు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ క్రౌడ్‌ ఎనలిటిక్స్, మొబైల్‌ కమాండ్, సైబర్‌ కో–ఆర్డినేషన్‌ మొదలైన అంశాలు ఈ విభాగం పరిధిలోకి వస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement