ఎన్ని పోరాటాలకైనా సిద్ధం

Speakers at Mana Visakha Mana Rajadhani Conference at Srikakulam - Sakshi

పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం 

అమరావతి ముసుగులో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం  

ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు, రామోజీలే అడ్డంకి 

శ్రీకాకుళంలో జరిగిన మన విశాఖ–మన రాజధాని సదస్సులో వక్తలు 

శ్రీకాకుళం న్యూకాలనీ: విశాఖ పరిపాలనా రాజధాని అయ్యేంతవరకు ఎందాకైనా వెళ్తామని, ఎన్ని పోరాటాలకైనా సిద్ధమని పలువురు వక్తలు ప్రకటించారు. పరిపాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వారు స్పష్టంచేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు, ఈనాడు అధినేత రామోజీరావే ప్రధాన అడ్డంకిగా మారారన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిల్వర్‌ జూబ్లీ ఆడిటోరియం వేదికగా వివిధ స్వచ్ఛంద సంస్థలు ‘మన విశాఖ–మన రాజధాని’ పేరిట సదస్సు నిర్వహించారు.

సదస్సుకు హాజరైన బీఆర్‌ఏయూ విశ్రాంత రిజిస్ట్రార్, విశాఖ రాజధాని సాధన ఐక్యవేదిక అధ్యక్షులు ప్రొ. గుంట తులసీరావు మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని.. విశాఖను పాలనా రాజధానిగా చేయాలన్న సీఎం నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే మరో చారిత్రక తప్పిదం అవుతుందని.. విశాఖ రాజధాని వద్దన్న వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.

విశాఖ రాజధాని సాధన ఐక్యవేదిక కన్వీనర్‌ డాక్టర్‌ దానేటి శ్రీధర్‌ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి స్వస్తి పలుకుతూ విశాఖ రాజధానే లక్ష్యంగా సీఎం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉద్యమాన్ని పల్లెస్థాయికి తీసుకెళ్తామన్నారు. రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ పి. జగన్మోహనరావు మాట్లాడుతూ.. రాయలసీమను వదిలి వెనుకబడిన ఉత్తరాంధ్రకు రాజధానిని ప్రకటించిన గొప్ప మానవతావాదిగా సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు.

అలాంటి ముఖ్యమంత్రి ఉండడం మనందరి అదృష్టమని.. భావితరాలకు విశాఖ రాజధాని అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని దూరం చేసేందుకు, భావితరాల భవిష్యత్‌ కోసం విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఉండాలని సంకల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని సదస్సుకు సంఘీభావం తెలిపిన రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

సీఎం జగన్‌ రాయలసీమకు చెందిన వారైనా, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తరాంధ్రులంతా సమర్థించి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అమరావతి పాదయాత్ర ముసుగులో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దాగి ఉందని, ఆయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఆరితేరిన ఘనుడని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి. సురేఖ, లయన్స్‌ క్లబ్‌ శ్రీకాకుళం సెంట్రల్‌ అధ్యక్షులు హారికాప్రసాద్, విద్యావేత్తలు దుప్పల వెంకట్రావు, సురంగి మోహన్‌రావు, శ్రీకాకుళం మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎంవీ పద్మావతి, విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top