
రెండు రోజుల్లో రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం
నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
2009 తర్వాత ముందుగా కేరళని తాకడం ఇదే తొలిసారి
సాక్షి, విశాఖపట్నం: మే చివరి వారంలో భానుడు భగ్గుమనలేదు... రోహిణి కార్తెలో రోళ్లు పగలనివ్వలేదు. ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు పలకరిస్తూ.. వేసవి ప్రతాపానికి మే నెలలోనే తెర వేశాయి. 2009 తర్వాత తొలిసారిగా నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళని తాకాయి. శనివారం మధ్యాహ్నం రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) ప్రకటించింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళకు వస్తాయని, కానీ ఈసారి 8 రోజుల ముందుగానే ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది.
ఈ నెల 26 నాటికి రాయలసీమలో ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ నెల 29 నాటికల్లా రాష్ట్రమంతటా వ్యాపించనున్నాయి. మరోవైపు ఈ నెల 27న ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా తేలికపాటి వానలు, అక్కడక్కడా మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
